అసెంబ్లీలో వాయిస్ వినిపించని మంత్రులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అసెంబ్లీలో వాయిస్ వినిపించని మంత్రులు

విజయవాడ, జూలై 19 (way2newstv.com
ముఖ్యమంత్రి జగన్ కాకుండా పాతిక మంది మంత్రులు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు. వీరిలో నోరున్న, విషయం బాగా వివరించగలిగిన మంత్రులెవరు అన్నదే ఇపుడు పెద్ద చర్చగా ఉంది. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాన్ని కట్టడి చేయడానికి, ప్రభుత్వ విధానాలు వివరించి జనంలో మెప్పు పొందడానికి పనికొచ్చే మంత్రులు ఎందరు అంటే ఆలోచించుకోవాల్సిందేనంటున్నారు. బడ్జెట్ సమావేశాలు ఏ ప్రభుత్వానికైనా కత్తి మీద సాము లాంటివి. సుదీర్ఘ కాలం సాగే ఈ సమావేశాలపై అటు ప్రజలకు కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పుకుందేందుకు ఈ సమావేశాలు చాలా ఉపయోగపడతాయి. ఇక సర్కార్ ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం వీటిని వాడుకోవాలని చూస్తుంది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీకి తొలి బడ్జెట్ సమావేశాలు ఎంతటి ప్రతిష్టాత్మకమో చెప్పాల్సిన అవసరం లేదు.
అసెంబ్లీలో వాయిస్ వినిపించని మంత్రులు

చర్చ అంటే అర్ధవంతంగా ఉండాలి. ప్రతిపక్షానికి ఈ విషయంలో అంత ఆసక్తి ఉండదు, వారి దృష్టి ఎపుడూ అధికార పార్టీ మీద నాలుగు బండలు వేయడమే. దీన్ని గమనంలోకి తీసుకున్నపుడు సహజంగానే ప్రతిపక్షం రెచ్చగొడుతుంది. మాట కూడా తరచూ జారేస్తూ ఉంటుంది. మరి సహనంతో దాన్ని తీసుకుంటూ చర్చ కోసం ముందుకు సాగాల్సిన అవసరం, బాధ్యత అధికార పార్టీ మీద ఉంది. అలాగని ప్రతిపక్షం విమర్శలు చేస్తున్నా విడిచిపెట్టమని కాదు, వారికి సరైన పద్ధతిలో జవాబు చెప్పగలగాలి. సబ్జెక్ట్ తోనే సవాల్ ని ఎదుర్కోవాలి. అయితే వైసీపీ మంత్రుల్లో ఆ రకంగా స్పందించే వారు పెద్దగా కనిపించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంగా తాము ఏం చేయగలుతాము అన్న మాట జనంలోకి పోకుండా కట్టడి చేస్తున్న ప్రతిపక్షం ట్రాప్ లో కొందరు మంత్రులు పడిపోతున్నారు. పాత సభను ద్రుష్టిలో పెట్టుకుని టీడీపీ మీద రివెంజ్ తరహాలో ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. దాంతో బాగా రచ్చ జరుగుతోంది.జగన్ ఏరి కోరి తెచ్చుకున్న అయిదుగురు డిప్యూటీ చీఫ్ మినిష్టర్లు కూడా మౌనంగా సభలో కనిపిస్తున్నారు. వారు విపక్షానికి ధీటుగా జవాబు ఇస్తూనే ప్రభుత్వ ప్రాధాన్యతలు చెప్పగలగాలి. అయితే వీరిలో ఒక్క పిల్లి సుభాష్ చంద్రబోస్ తప్ప మిగిలిన వారు కొత్త. ఇక సుభాష్ చంద్రబోమ్ మొదటి నుంచి దూకుడు కాదు, దాంతో ఎవరూ పెద్దగా నోరు చేసుకోవడంలేదు. అసెంబ్లీ చూడాలనిపించేలా మాట్లాడే వక్తలు ఇపుడు లేకపోయినా ఉన్నంతలో సీనియర్ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు వంటి వారు సభలో విపక్షాన్ని నేర్పుగా ఎదుర్కొంటున్నారు. పూర్తిగా సబ్జెక్ట్ మీద మాట్లాడే వారిలో ధర్మాన ముందు వరసలో ఉన్నారు. ఇక మంత్రులు తమ శాఖలపై పూర్తి పట్టు సాధించడమే కాదు. సభలో ఆసక్తికరంగా మాట్లాడితేనే వారికీ, వారి పదవులకూ న్యాయం జరిగినట్లు అంటున్నారు. చూడాలి మరి