ఆదిలాబాద్, జూలై 20 (way2newstv.com):
నాలుగు జిల్లాలకు ప్రత్యేక జిల్లాపరిషత్‌లు ఏర్పడిన నేపథ్యంలో ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి (జీపీఎఫ్) విభజన అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ పదేళ్లుగా నిలిచిపోవడం, ఆ బకాయిలు పెరగడంతో అందరిలో అయోమయం నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగానే జీపీఎఫ్ కొనసాగిస్తారా? లేక ఎలా విభజిస్తారనే దానిపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పంచాయతీరాజ్ ఉద్యోగులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 13 వందల వరకు ఉంటారు. వీరంతా జడ్పీ కిందనే పనిచేస్తారు. జిల్లాపరిషత్‌లతోపాటు మండల పరిషత్, జడ్పీ, మండల పాఠశాలల్లో పనిచేసే బోధనేతర ఉద్యోగులను పంచాయతీరాజ్ ఉద్యోగులుగా పిలుస్తారు. దీంతోపాటు గ్రామీణ నీటిసరఫరా విభాగం, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లో కొందరు డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు.
పీఎఫ్ బెంగ (ఆదిలాబాద్)
ఈ పంచాయతీరాజ్ ఉద్యోగులతోపాటు జిల్లాపరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకోసం సాధారణ భవిష్య నిధి (జీపీఎఫ్) ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీనికోసం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకంగా జీపీఎఫ్ విభాగం ఉంటుంది. ఉద్యోగులు తక్కువలో తక్కువగా తమ మూల వేతనంలోంచి 6 శాతం జీపీఎఫ్‌లో జమ చేయాలి. ఆ తర్వాత ఎంత ఎక్కువ అనేది ఉద్యోగుల ఇష్టం. అయితే మొత్తం స్థూల వేతనంలోంచి ఎల్‌ఐసీ, జీఐఎస్, టీఎస్‌జీఎల్‌ఐ, జీపీఎఫ్ ఇతర అన్ని రకాల మినహాయింపులు(డిడక్షన్)50శాతం కంటే తక్కువ ఉండాలనే నిబంధనకు లోబడి ఉండాలి. ఉద్యోగుల వారీగా జీపీఎఫ్ నంబర్ కేటాయించారు. ఎనిమిదేళ్ల కిందట వరకు అస్తవ్యస్తంగా ఉన్న ఆ ఖాతాల వివరాలు కొత్త సాఫ్ట్‌వేర్‌తో సంబంధిత విభాగం (సెక్షన్) ఉద్యోగులు కష్టపడి సరిచేస్తూ వచ్చారు. దీంతో ఉద్యోగుల వివరాలన్నీ చరవాణిలోనే చూసుకునే సౌకర్యం కలగడంతో జీపీఎఫ్ డబ్బులు సాధ్యమైనంత ఎక్కువగా జమ చేయడం మొదలైంది. ఉద్యోగుల వారీగా నెలకు రూ.వెయ్యి నుంచి మొదలుపెట్టి రూ.45వేల వరకు ఇందులో జమచేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి చెందిన జీపీఎఫ్ పీడీ అకౌంట్‌లో జమవుతాయి. జిల్లాల వారీగా ఈ పీడీ ఖాతాలున్నాయి. ఉద్యోగులు ఎంత జమచేస్తే దానికి 8 శాతం వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తోంది. గతంలో 6 శాతం వడ్డీ ఉండగా పెరుగుతూ 8 శాతం వరకు వచ్చింది.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జీపీఎఫ్‌లో 6,715 మంది ఖాతాదారులున్నారు. ప్రతినెల ఉద్యోగులు తమ వేతనంలోంచి కొంత జమచేస్తున్నారు. అందరు ఉద్యోగుల మొత్తం జమ డబ్బులు లెక్కిస్తే ప్రస్తుతం రూ.292.18 కోట్లు ఖాతాలో ఉన్నాయి. ఈ మూల నిధికి 2009 నుంచి వడ్డీ రాకపోవడం సమస్యగా మారింది. దీంతో వడ్డీ బకాయి పెరుగుతూ వచ్చింది. అప్పటినుంచి లెక్కిస్తే రూ.150కోట్లు వడ్డీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ప్రతినెల పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు మాత్రం ఇబ్బందులు రాకుండా వడ్డీతో కలిపి చెల్లిస్తున్నారు. అందరు ఉద్యోగులు జమచేసిన మూలనిధిలోంచే ఈ వడ్డీ డబ్బులు చెల్లిస్తూ సర్దుబాటు చేస్తున్నారు. ఉద్యోగి జమచేసిన దాంట్లో 70శాతం రుణం తీసుకునే వెసులుబాటు ఉండడంతో ఈ డబ్బులు సైతం మూలనిధిలోంచే చెల్లిస్తు వస్తున్నారు.ఉద్యోగులపరంగా ప్రతినెల మూలనిధి(అసలు)కి రాబడులు పెరుగుతుండడం చెల్లింపులు తక్కువగా ఉండడంతో ఎలాంటి సమస్య రాలేదు. అంటే నెలవారీగా ఉద్యోగులనుంచి జమ డబ్బులు రూ.7 కోట్లవరకు వస్తే చెల్లించేది రూ.3 కోట్లవరకే ఉంటోంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జీపీఎఫ్ కొనసాగుతోంది. ప్రస్తుతం కొత్త జిల్లావారీగా పనిచేస్తున్న ఉద్యోగుల జీపీఎఫ్ వివరాలను ఆ జిల్లా జడ్పీకి బదిలీ చేసినా వడ్డీ రాకపోవడంతో నిధిని ఎలా విభజిస్తారనే అయోమయం నెలకొంది. ఎందుకంటే ఉన్న మూల నిధిలోంచి ఇంతవరకు ఇతర ఉద్యోగులకు వడ్డీ చెల్లించడంతో నిధుల విభజన కాస్త కష్టతరమని ఉద్యోగులు చెబుతున్నారు. మరోపక్క ఈ విభజన ఎలా ఉంటుందోననే అయోమయంలో ఖాతాదారులున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ దాదాపు రూ.150 కోట్లు వస్తే ఉద్యోగుల వారీగా నిధి విభజన సులువవుతుంది.
Tags:
telangananews