ఖమ్మం, జూలై 20 (way2newstv.com):
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని భద్రాచలం ఏజెన్సీలో చాలాకాలంగా మావోయిస్టుల కార్యకలాపాలకు బ్రేక్ పడింది. గతేడాది అడపాదడపా కార్యకలాపాలతో తమ ఉనికిని చాటుకొన్న మావోయిస్టులు ఇటీవల అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును అపహరించడంతో అలజడి రేగింది. ఇన్‌ఫార్మర్ నెపంతో ఆయన్ని హత్య చేసిన మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసిరారు. గతేడాదిగా పోలీసు నిర్బంధాలతో మావోయిస్టులు సరిహద్దు దండకారణ్యానికే పరిమితమయ్యారు. 2018 జులై 24న మావోయిస్టు జిల్లా కమిటీ సభ్యుడు సుంకరి రాజ్‌కుమార్ అలియాస్ అరుణ్ కుర్నపల్లి అడవుల వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లో మృతి చెందడంతో ఆ పార్టీకి ఈ ప్రాంతంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ క్రమంలో కుర్నపల్లికి చెందిన గిరిజనులను మావోయిస్టులు అపహరించి విచారణ చేశారు. ఈ సందర్భంలో గిరిజనులపై దాడి చేయడంతో ఇర్పా వెంకటేశ్వర్లు మృతి చెందారు.
అడవిలో అలజడి (ఖమ్మం)
ఈ ఘటన అనంతరం మావోయిస్టులు తమ కార్యకలాపాలకు కొంత విరామం ఇచ్చినట్లుగా కనిపించింది. నిర్బంధాలతో మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసి అరెస్టు చేశారు. దీంతో మన్యం ప్రశాంతంగా ఉందని భావిస్తున్న తరుణంలో శ్రీనివాసరావును హత్య చేయడంతో మన్యంలో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి.అంతకు ముందు బోదనెల్లి, కుర్నపల్లి, ఎర్రబోరుకు చెందిన గిరిజనులను అపహరించిన మావోయిస్టులు విచారణ అనంతరం వారిని క్షేమంగా విడిచిపెట్టారు. ఈ ప్రాంతంలో గత మూడేళ్ల నుంచి హత్య సంఘటనలు చోటుచేసుకోలేదు. ఓ పక్క మావోయిస్టులకు సేఫ్‌జోన్‌గా మారిన దండకారణ్యంలో దూకుడు ప్రదర్శించిన మావోయిస్టులు తెలంగాణ సరిహద్దులో కాసింత తగ్గినట్లుగా కనిపించింది. తాజా ఘటనతో తెరాస శ్రేణులతోపాటు రాజకీయ పార్టీల నాయకుల్లో వణుకు మొదలైంది. మూడేళ్ల కిందట తెరాస భద్రాచలం నియోజకవర్గ ఇన్‌ఛార్జి మానె రామకృష్ణ సహా అయిదుగురు తెరాస నాయకులను పూసుగుప్ప నుంచి అపహరించిన మావోయిస్టులు ప్రభుత్వ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టి వారిని విడిచిపెట్టారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తాజా సంఘటనతో పెద్దఎత్తున మావోయిస్టుల వేట కోసం పోలీసు బలగాలు సరిహద్దుకు చేరుకొంటున్నాయి. మరోపక్క ఈనెల 28 నుంచి మావోయిస్టు వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో మన్యంలో ఏ నిమిషానికి ఏమి జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సరిహద్దు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్‌కు భద్రతా బలగాలు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.
Tags:
telangananews