అనంతపురంలో 25 క్వారీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనంతపురంలో 25 క్వారీలు

అనంతపురం, ఆగస్టు 9, (way2newstv.com)
ప్రతి కంకర క్వారీలో పెద్దగుండ్లను పేల్చి చిన్నవిగా చేయాలంటే తప్పనిసరిగా పేలుడు పదార్థాలు వినియోగించాలి. ఇలాంటివి పేల్చేందుకు ముందుగా అనుమతులు ఉండాలి. అలాగే లైసెన్స్‌ ఉన్న వారి నుంచే పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలి. కానీ జిల్లాలో అటువంటి ఖాతరు చేయడం లేదు. నిబంధనలకు పాతరేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ముఖ్యంగా మధ్యవర్తుల ద్వారా పేలుడు పదార్థాలు తెప్పించి దర్జాగా వినియోగిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, గనుల శాఖ యంత్రాంగం కళ్లకు గంతలు కట్టుకున్న వేళ.. నర‘కంకరు’ల ధనదాహానికి అడ్డే లేకుండా పోతోంది. వాస్తవానికి పేలుడు పదార్థాల వినియోగం గురించి పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. లేకపోతే జిలెటిన్‌ స్టిక్స్‌ వంటి పేలుడు పదార్థాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. 
అనంతపురంలో 25 క్వారీలు

జిల్లాలోని 78 రహదారి కంకర క్వారీలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లులోనే 25 క్వారీలు ఉన్నట్లు తేలింది. ఇంకా నార్పల, శింగనమల, అనంతపురం గ్రామీణం, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో క్వారీలు నిర్వహిస్తున్నారు. పోలీసు సబ్‌ డివిజన్ల వారీగా చూస్తే, అత్యధికంగా కళ్యాణదుర్గం సబ్‌ డివిజన్‌లో 33, కదిరి డివిజన్‌లో 17 క్వారీలు ఉన్నాయి. అనంతపురం సబ్‌డివిజన్‌లో 9, తాడిపత్రి, కదిరి డివిజన్లలో ఏడేసి చొప్పున ఉన్నాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, పోలీసుల అనుమతితోపాటు, గనుల శాఖ భద్రత విభాగం, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల ద్వారా అనుమతులు తీసుకున్న మ్యాక్జైన్‌లు 17 ఉన్నాయి. జనావాసాలకు చాలా దూరంగా, చుట్టూ కంచె నిర్మించి, ఇందులో కాంక్రీట్‌తో నిర్మించిన గదిని మ్యాక్జైన్‌ అంటారు. ఇందులో చాలా రక్షణ చర్యలు తీసుకుంటారు. తలుపు సైతం ఇనుముదే ఏర్పాటు చేయాలి. ఇటువంటి మ్యాక్జైన్‌లో జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలు నిల్వ ఉంచుతారు. ఒకవేళ ప్రమాదం జరిగినా సరే... అవి ఆ భవనం నుంచి బయటకు కూడా ప్రభావం కనిపించనంతగా మ్యాక్జైన్‌ ఉంటుంది.చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా... పోలీసు, గనులు, రెవెన్యూ తదితర శాఖలతో కలిసి సంయుక్తంగా అన్ని కంకర క్వారీలను పరిశీలించనున్నారు. ముందుగా క్వారీల్లో పేలుడు పదార్థాలు ఎక్కడ ఉంచుతున్నారు. అసలు అత్యంత రక్షణాత్మక ప్రదేశంలో మ్యాక్జైన్‌లలో పేలుడు పదార్థాలు నిల్వ చేస్తున్నారా? లేదా? అనేది దృష్టి పెట్టనున్నారు.మ్యాక్జైన్‌లలో శింగనమల మండలం జులకాలవలో 4, రాయదుర్గం మండలం హెచ్‌.సిద్ధాపురంలో 2, అనంతపురం గ్రామీణంలోని ఇటుకులపల్లి, నార్పల మండలం గడ్డం నాగేపల్లి, గోరంట్ల మండలం కాటేపల్లి, గుంతకల్లు మండలం నక్కనదొడ్డి, బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లు, ఉంతకల్లు, డి.హీరేహాళ్‌ మండలం హనుమాపురం, రాయదుర్గం మండలం వేపరాళ్ల, హిందూపురం మండలం నక్కలపల్లి, సోమందేపల్లి మండలం చలకూరు, చిలమత్తూరు మండలం సోమగడ్డలలో ఒక్కో మ్యాక్జైన్‌కు అనుమతులు ఉన్నాయి.సాధారణంగా ప్రతి క్వారీ నిర్వాహకుడు పేలుడు పదార్థాలు వినియోగించి, గుండ్లను పేల్చాలంటే తప్పనిసరిగా బ్లాస్టింగ్‌ అనుమతులు ఉండాలి. అలాగే బ్లాస్టింగ్‌కు అవసరమైన పేలుడు పదార్థాలను లైసెన్స్‌ ఉన్న వారి నుంచి కొనుగోలు చేసి... ఆయా మ్యాక్జైన్‌లలో నిల్వ ఉంచాలి. కానీ చాలా మంది క్వారీల నిర్వాహకులు ఇటువంటి నిబంధనలేవీ పట్టించుకోవడం లేదు. కొందరు మధ్యవర్తుల ద్వారా ఇష్టానుసారం పేలుడు పదార్థాలను తెప్పించుకొని, ఏకంగా క్వారీ ఆవరణలోనే ఉంచుకొని వినియోగిస్తున్నారు. లైసెన్స్‌ ఉన్న వారి నుంచి కాకుండా మధ్యవర్తుల ద్వారా పేలుడు పదార్థాలు జిల్లాకు చేరుతున్నాయి. ఇందుకు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో మధ్యవర్తులు ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా అనంతపురం నగరం, నార్పల, తాడిపత్రి.. ఇలా అనేక చోట్ల కొందరు మధ్యవర్తులు, క్వారీల యజమానుల ఆర్డర్‌ మేరకు ఎన్ని పేలుడు పదార్థాలైనా తీసుకొస్తున్నట్లు సమాచారం. వీటిని అనధికారంగా అంతా వినియోగిస్తున్నారు. అధికారులకు ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా అన్ని కంకర క్వారీల తీరుపై ప్రభుత్వం దృష్టిపెట్టిన నేపథ్యంలో.. ఇకనైనా నిబంధనలు అమలయ్యేలా చూస్తారా? అనేది ప్రశ్నార్థకంగానే మారుతోంది. రంగంలోకి దిగనున్న మూడు, నాలుగు శాఖలు సంయుక్తంగా సమర్థంగా పని చేసి నిబంధనలు అన్నీ పాటిస్తున్నారా? లేదా? అనేది తేల్చి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి