27 నుంచి సిటీలో రెండు లక్షల విగ్రహాలు పంపిణీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

27 నుంచి సిటీలో రెండు లక్షల విగ్రహాలు పంపిణీ

హైద్రాబాద్, ఆగస్టు 22 (way2newstv.com)  
వినాయక చవితి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 2న వినాయక చవితి పర్వదినం. వినాయక చవితి అంటే ముందుగా గుర్తుకొచ్చేది విగ్రహాలు, మండపాలు. ఎక్కడ చూసినా గణనాథుడి విగ్రహాలు ప్రతిష్టించి ప్రత్యేక పూజలు  చేస్తారు. ఆ తర్వాత ఘనంగా నిమజ్జనం నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఈసారి కూడా మండపాలు రెడీ అవుతున్నాయి. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కలర్స్, కెమికల్స్ తో చేసిన విగ్రహాల కారణంగా పర్యావరణానికి తీవ్ర  నష్టం జరుగుతోంది. నీరు, భూమి కలుషితం అవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం అధికారులు నడుం బిగించారు. కెమికల్స్ వద్దు మట్టి ముద్దు అనే నినాదం వినిపిస్తున్నారు. మట్టితో చేసిన విగ్రహాలనే  వినియోగించాలని కోరుతున్నారు. 
27 నుంచి సిటీలో రెండు లక్షల విగ్రహాలు పంపిణీ

మట్టి గణపయ్య విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.ఆగస్టు 27 నుంచి హైదరాబాద్ నగరంలోని ముఖ్య కూడళ్లు, కమ్యూనిటీ హాళ్లు, జీహెచ్ఎంసీ జోనల్, డివిజనల్ కార్యాలయాలు, పార్కులు, మార్కెట్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో 2లక్షల మట్టి గణపతుల పంపిణీకి  ఏర్పాట్లు చేస్తున్నారు. పీసీబీ ఆధ్వర్యంలో 1.60లక్షలు, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 40వేల విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. 2018లోనూ ఇలానే మట్టి గణపతులను పంచారు. 2018లో కూడళ్లలో ఏర్పాటు చేసే  మండపాల్లో పూజించేందుకు వీలుగా 5, 6, 7, 8 అడుగుల గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్లే సమయంలో విగ్రహాలు ముక్కలుగా విరిగిపోతున్నాయి. ఈ కారణంతో ఈసారి కేవలం  ఇళ్లలో పూజల కోసం 8 అడుగుల గణపతులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. 
ఇలా పర్యావరణాన్ని కాపాడుకుందాం:
* కలర్స్, కెమికల్స్ లేని మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే ప్రతిష్టించి నిమజ్జనం చేయాలి. వీటి సైజు కూడా చిన్నగానే ఉండాలి.
* జలాశాయాల్లో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాల సంఖ్యను ఏటేటా తగ్గాలి. ఎక్కడి విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలి.
* మంచి నీటి చెరువులు, బావుల్లో నిమజ్జనం చేయరాదు.
* విగ్రహాలతో పాటు పువ్వులు, కొబ్బరి కాయలు, నూనె, పండ్లు, ధాన్యం, పాలిథీన్ కవర్లు వంటి నీళ్లలో వేయరాదు.
* నిమజ్జనం జరిగిన గంటలోపే వ్యర్థాలను తొలగించాలి.
* పర్యావరణంలో త్వరగా కలిసిపోయే పదార్దాలను విగ్రహాల తయారీలో వాడాలి.
* పీఓపీ (ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్) తయారు చేసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం చేయరాదు. వాటిని జలాశయం దగ్గరికి తీసుకొచ్చి కొంత నీరు చల్లాలి. వచ్చే ఏడాది తిరిగి వినియోగించేలా ప్రోత్సహించాలి.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్స్ తో చేసిన విగ్రహాలను జలాశయల్లో నిమజ్జనం చేసిన సమయంలో వాటిలోని హానికారక కెమికల్స్ నీటిలో చేరుతున్నాయి. లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్,  రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, కోబాల్ట్, టర్పీన్ ప్రమాదకరం అవుతున్నాయి.చెరువులు కలుషితం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో గణేష్ నిమజ్జనానికి చెరువుల దగ్గర ప్రత్యేక కొలనులను జీహెచ్‌ఎంసీ నిర్మిస్తోంది. ఇప్పటివరకు ఆయా ప్రాంతాల్లో 23 కొలనులను సిద్ధం చేశారు. మరో మూడు కొలనుల నిర్మాణం జరుగుతోంది. ఇవికూడా నిమజ్జన సమయానికి సిద్ధమవుతాయని అధికారులు చెప్పారు. మొదటి దశలో రూ.6.95కోట్లతో పది, రూ.14.94కోట్లతో 15 కొలనుల నిర్మాణం చేపట్టారు. తాజాగా మల్కాజిగిరిలో బండచెరువులో కోటి రూపాయల వ్యయంతో మరో కొలను నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో ఇప్పటివరకు 23 పూర్తయ్యా యి. జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ సఫిల్‌గూడ చెరువువద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
పూర్తయిన నిమజ్జన కొలనులు:
ఊరచెరువు-కాప్రా, చర్లపల్లి చెరువు-చెర్లపల్లి, అంబీర్‌చెరువు-కూకట్‌పల్లి, పెద్దచెరువు-గంగారం శేరిలింగంపల్లి, వెన్నెల చెరువు-జీడిమెట్ల, రంగధామునికుంట- కూకట్‌పల్లి, మల్కచెరువు-రాయదుర్గ్, నల్లగండ్లచెరువు-నల్లగండ్ల, పెద్దచెరువు-మన్సూరాబాద్, హుస్సేన్‌సాగర్‌లేక్, పెద్దచెరువు-నెక్నాంపూర్, లింగంచెరువు-సూరారం, ముళ్లకత్వచెరువు-మూసాపేట్, నాలోల్ చెరువు, కొత్తచెరువు-అల్వాల్, నల్లచెరువు-ఉప్పల్, పత్తికుంట-రాజేంద్రనగర్, బోయిన్‌చెరువు-హస్మత్‌పేట్, మియాపూర్-గురునాథ్‌చెరువు, గోపిచెరువు-లింగంపల్లి, రాయసముద్రం చెరువు-రామచంద్రాపురం,హఫీజ్‌పేట్-కైదమ్మకుంట చెరువు, రాయదుర్గం చెరువు-రాయదుర్గ్ తదితర చెరువులు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి. పటాన్‌చెరువులోని సాకిచెరువు, హుస్సేన్‌సాగర్‌ లోని అంబేద్కర్‌ నగర్ దగ్గర, మల్కాజ్‌గిరిలోని బండ చెరువు తదితరచోట్ల కొలనుల నిర్మాణం జరుగుతోంది