సందడి షురూ (ఖమ్మం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సందడి షురూ (ఖమ్మం)

ఖమ్మం, ఆగస్టు 27  (way2newstv.com): 
మద్యం దుకాణాల వేలానికి గడువు సమీపిస్తుండడంతో ఉభయ జిల్లాల్లో సందడి మొదలైంది. దుకాణాలు చేజిక్కించుకునేందుకు ఆశావహులు దృష్టి సారిస్తున్నారు. ఆబ్కారీశాఖ శాఖాపరమైన కసరత్తు ప్రారంభించింది. వచ్చేనెల 30తో లైసెన్సీల గడువు ముగుస్తుండగా సెప్టెంబరు మొదటి వారంలో కొత్త లైసెన్స్‌ల నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు ఇక్కడ పాగా వేసేందుకు గాలం వేస్తున్నారు. నూతన మద్యం పాలసీలో భారీ మార్పులు జరగబోతున్నాయని ప్రచారం సాగినా శాఖాపరంగా ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు లేవు. ఈ విధానంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న అనుమతి గదులను తొలగించే అంశాన్ని ఉన్నతస్థాయి పరిశీలనలో ఉన్నప్పటికీ ఆ విషయంలో ఎలాంటి ఆదేశాలు రాలేదు. 2017కు ముందు లైసెన్స్‌ ఫీజుకు అదనంగా అనుమతి గదికి రూ.లక్ష తీసుకునే విధానం ఉండగా ఇప్పడు లైసెన్స్‌ ఫీజులోనే కలిపారు. 
 సందడి షురూ (ఖమ్మం)

కొత్త విధానంలో అనుమతి గది లేకుండా చేయాలని, అవసరమైన వారు అదనంగా చెల్లించే పద్ధతిని అమలు చేసే అవకాశం ఉంది. దరఖాస్తు రుసుము, లైసెన్స్‌ ఫీజులు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఖమ్మం జిల్లాలో మద్యం లైసెన్స్‌ ను చేజిక్కించుకునేందుకు ఈసారి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు దృష్టి సారిస్తున్నారని సమాచారం. ఆ రాష్ట్రంలో మద్యం దుకాణాల కుదింపు, వేలం కాకుండా ప్రభుత్వమే సిబ్బందిని నియమించి ప్రభుత్వం కనుసన్నల్లోనే మద్యం విక్రయాలు జరపాలనే ప్రయత్నం ఉన్నందున ఖమ్మం జిల్లాకు సరిహద్దు ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల్లోని మద్యం వ్యాపారులు ఖమ్మం వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి వ్యాపారం తీరుతెన్నుపై దృష్టి సారించారు. కొందరు ఇప్పటికే ఇక్కడ ఈ వ్యాపారంలో ఉన్న వారితో సంప్రదిస్తున్నారు. జిల్లాలో రెండేళ్ల కిందట జరిగిన వేలంలో 83 లైసెన్స్‌లను దక్కించుకునేందుకు 4,050 మంది దరఖాస్తుదారులు ఇచ్చారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష ఫీజు చెల్లించారు. లాటరీ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ అని తెలిసినప్పటికీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీ పడ్డారు. ఖమ్మం నగరంలోని దుకాణాలకు లైసెన్స్‌ ఫీజు రూ.55 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలకు రూ.45 లక్షలు చెల్లించే విధానం ఉండగా ఇందులో ఈసారి కొంత మొత్తం పెంచే అవకాశం ఉందనే ఊహాగానాలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 78 మద్యం దుకాణాలు ఉండగా ఇక్కడ సగానికిపైగా ఏజెన్సీ చట్టం నిబంధనల్లో ఉన్నాయి. మిగిలిన వాటిలో 2450 దరఖాస్తులు వచ్చాయి. ఉభయ జిల్లాల్లో ఇప్పటికే ఉన్న బార్ల సంఖ్యను కుదించి దుకాణాల సంఖ్య పెంచాలనే డిమాండ్‌ ఉంది. దీనికి సంబంధించిన కసరత్తు ఉన్నతస్థాయిలో కొనసాగుతోందని సమాచారం.