జబ్బుల జాతర (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జబ్బుల జాతర (కరీంనగర్)

కరీంనగర్, ఆగస్టు 27  (way2newstv.com): 
జిల్లాలో అసంక్రమిత వ్యాధుల బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జీవన శైలిలో వస్తున్న మార్పులు, తగ్గుతున్న శారీరక శ్రమ.. జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, ధూమ, మద్య పానం తదితర కారణాలతో పాటు జన్యుపరమైన సమస్యలు ఉండటంతో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ లాంటి అసంక్రమిత వ్యాధుల బాధితులు జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్నారు. ఈ బాధితులకు వైద్య సేవలు అందించేందుకు జిల్లా ఆసుపత్రిలో ఎన్‌సీడీ కేంద్రం ఏర్పాటు చేశారు. జాతీయ ఆరోగ్య సంస్థ తన నివేదికలో 50 శాతం మరణాలు దీర్ఘకాలిక వ్యాధుల మూలంగానే సంభవిస్తున్నట్లు పేర్కొంది. ఆధునిక జీవనంలో ప్రమాదకర క్యాన్సర్‌తో పాటు బీపీ, షుగర్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి మెరుగైన వైద్య సేవలందించాలన్నదే ఎన్‌సీడీ కేంద్రం లక్ష్యం. 
జబ్బుల జాతర (కరీంనగర్)

గతేడాది డిసెంబర్‌లో కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభమైన ఎన్‌సీడీ(నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజ్‌) కేంద్రం నిత్యం వంద మందికి పైగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ఉచితంగా మందులు, వైద్య సలహాలతో పాటు కౌన్సెలింగ్‌ అందిస్తూ మన్ననలు పొందుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ  జీవనశైలి వ్యాధులపై చేసిన సర్వే ప్రకారం 3,45,744 మందికి స్క్రీనింగ్‌ చేయగా అందులో బీపీ 19,528, మధుమేహం 13,945 మంది బాధితులు ఉన్నట్లు తేలింది. వ్యాధి తీవ్రతను గుర్తించకపోవడం, సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోవడంతో వాటి ప్రభావం గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై పడి మనిషి రోగాల కుప్పగా మారుతున్నాడు. అలాంటి వారిని ముందుగా గుర్తించి ఎన్‌సీడీ కేంద్రం ద్వారా అవసరమైన మందులతోపాటు, కౌన్సెలింగ్‌ సలహాలు, సూచనలిస్తూ రక్తపోటు, మధుమేహంలను అదుపులో ఉంచడంలో ఎన్‌సీడీ కేంద్రం కీలకంగా వ్యవహరిస్తోంది. కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు ఆరుగురు నర్సులు, ఆరుగురు సిబ్బంది, ఇద్దరు కౌన్సిలర్లు, ఓ మానసిక వైద్యునితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. మొదట ఎన్‌సీడీ కేంద్రానికి వచ్చిన రోగికి బీపీ, షుగర్‌ పరీక్షలు చేసి వ్యాధి ప్రారంభ దశలో ఉన్నవారికి అవసరమైన మందులు అందజేయడంతోపాటు వ్యాధులను అదుపులో ఉంచుకునేందుకు సలహాలు, సూచనలిస్తారు. వ్యాధి రెండో దశలో ఉన్న వారికి ప్రత్యేక కార్డుతో ప్రతి నెలా ఉచితంగా మందులు అందజేయడంతోపాటు ప్రత్యేక కౌన్సిలర్‌ పలు సూచనలు చేస్తాడు. తీసుకోవాల్సిన ఆహారం.. వ్యాయామం, తదితర అంశాలపై వివరిస్తారు.