పోలవరం నిధులు మావి.. కేంద్రం సుతిమెత్తగా వార్నింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పోలవరం నిధులు మావి.. కేంద్రం సుతిమెత్తగా వార్నింగ్

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (way2newstv.com)
పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై కేంద్రం ఒకింత అసహనం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ఖర్చు కేంద్రమే భరిస్తుంది కాబట్టి ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు తమకుందని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నవయుగ సంస్థను తప్పించి రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై నవయుగ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. మరోవైపు కేంద్రానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సైతం దీనిపై నివేదిక అందజేసింది. తాజాగా ఈ వివాదంపై కేంద్ర జలశక్లి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ స్పందించారు. 
పోలవరం నిధులు మావి.. కేంద్రం సుతిమెత్తగా వార్నింగ్

శుక్రవారం జరిగిన నీతిఆయోగ్‌ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టుకు డబ్బులిచ్చేది కేంద్రమే కాబట్టి ఆ ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకొనే హక్కు తమకు ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలవరంలో జరుగుతున్న పరిణామాలపై పూర్తిస్థాయి వాస్తవ నివేదికను కోరామని, అది వచ్చిన వెంటనే పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు రాష్ట్రప్రభుత్వం చేపట్టినంత మాత్రాన మాకు చెప్పకుండా ఇష్టానుసారం చేయడం కుదరదన్నారు. అక్కడ జరిగే ప్రతి విషయం మాకు తెలియాలని, అందుకే అన్ని విషయాలపై నివేదిక కోరినట్టు తెలిపారు. నివేదిక తమకు అందిన తర్వాత పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానంలో ఉన్నందున ఇంతకుమించి తానేమీ వ్యాఖ్యానించబోనని మంత్రి స్పష్టం చేశారు. కాగా, మోదీ, అమిత్ షాల ఆశీస్సులు తీసుకున్న తర్వాతే పోలవరం, పీపీఏలపై ముందుకెళ్తున్నట్టు రెండు రోజుల కిందట వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా కేంద్ర మంత్రి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని, హోం మంత్రులకు చెప్పే పోలవరంపై రీటెండరింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మనం ఇప్పుడు సమాఖ్య వ్యవస్థలో ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై రాష్ట్రం, కేంద్ర పరిధిలోని అంశాలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంతేకానీ, ఎవరి ఆశీస్సులు ఎవరికీ ఉండవని గజేంద్రసింగ్ షేకావత్ వ్యాఖ్యానించారు.