వైసీపీ, బీజేపీ మధ్య పెరుగుతున్న దూరం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైసీపీ, బీజేపీ మధ్య పెరుగుతున్న దూరం

విజయవాడ, ఆగస్టు 16  (way2newstv.com)
నిన్నామొన్నటివరకూ అనధికారమిత్రపక్షాలుగా వ్యవహరించిన వైసీపీ, బీజేపీలు దూరమవుతున్నాయా? అందుకు కారణాలేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రంలోని భారతీయ జనతాపార్టీకి అవసరమైన ప్రతిసందర్భంలోనూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటికీ సహకరిస్తోంది. కీలకమైన బిల్లులు రాజ్యసభలో గట్టెక్కడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తనవంతు మద్దతు అందిస్తోంది. అది సమాచారహక్కు చట్టం కావచ్చు. ట్రిపుల్ తలాక్ కావచ్చు. కశ్మీర్ పునర్విభజన కావచ్చు. అంశం ఏదైనా వైసీపీ నుంచి కచ్చితమైన సహకారం అందుతోంది. అయితే షరతులు వర్తిస్తాయన్నట్లుగా వ్యూహాత్మకంగా వైసీపీ స్నేహహస్తం అందిస్తోంది. కొన్ని సార్లు బిల్లులకు విస్త్రుతకోణంలో సానుకూలంగా ఓటు వేస్తోంది. మరికొన్ని సార్లు విభేదిస్తున్నట్లు చెబుతూనే సభకు గైర్హాజరవుతోంది. 
వైసీపీ, బీజేపీ మధ్య పెరుగుతున్న దూరం

ఈ అనుబంధం గతం నుంచీ కొనసాగుతూ వస్తోంది. గతంలో వైసీపీ లోక్ సభ సభ్యులు రాజీనామా చేసినప్పుడు వాటిని ఆమోదించకుండా నాన్చడం ద్వారా ఉప ఎన్నిక రాకుండా కేంద్రం అడ్డుపుల్ల వేసింది. టీడీపీ, బీజేపీకి వీడ్కోలు పలికేసిన తర్వాత వైసీపిని అనధికార మిత్రపక్షంగా చేరదీసింది. కానీ తాజాగా వైసీపీపై బీజేపీ వ్యూహాత్మక దాడి మొదలు పెట్టింది.కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి టీడీపీ రాం రాం చెప్పిన తర్వాత కమలం పార్టీ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసింది. ప్రధానమంత్రి మొదలు మంత్రుల వరకూ ఇక్కడి అవినీతి తతంగాలపై విమర్శలు కురిపించారు. పోలవరం టీడీపీకి ఏటీఎం గా మారిందని ప్రధానమంత్రే ఆరోపించారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం తన స్టాండ్ మార్చుకుంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతోంది. విద్యుత్ ఒప్పందాల రద్దుపై చర్యలను ప్రశ్నించింది. పోలవరం పనుల నిలిపివేతపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తెలుగుదేశం శ్రేణులపై ఎక్కువగా దాడులు సాగుతున్నాయి. స్థానికంగా వైసీపీ, టీడీపీల మధ్య ఎన్నికల వాతావరణంలో చోటు చేసుకున్న ఘర్షణల ఫలితంగా గ్రామప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఇంకా సడలలేదు. దీనిని బీజేపీ టేకప్ చేస్తోంది. హింసాత్మక సంఘటనలకు వైసీపీదే బాధ్యత అంటూ తాను పోరాటపాత్రను తీసుకుంటోంది. నిజానికి బీజేపీ కార్యకర్తల కంటే టీడీపీ కార్యకర్తలే వైసీపీ శ్రేణులకు టార్గెట్ . అయినప్పటికీ కమల నాథులు జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు పూనుకోవడమే ఆసక్తి గొలుపుతోంది. చంద్రబాబు నాయుడు బీజేపీ పై చేసిన విమర్శలు రాష్ట్రంలో ఆ పార్టీని చాలా బద్నాం చేశాయి. ఆ పార్టీకి ఉన్న ఒరిజినల్ ఓటు బ్యాంకుకు సైతం చిల్లు పడింది. ఈ స్థితిలో టీడీపీ స్టాండ్ ను బీజేపీ భుజాన వేసుకోవడంలోని మతలబు ఏమిటనేదే అందరినీ ఆలోచింపచేస్తోంది.ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ లక్ష్యం ఏదైనా కావచ్చు. కానీ బీజేపీకి కొన్ని టార్గెట్లున్నాయి. ఎన్నికల్లో ఘోర ఓటమితో టీడీపీ పోరాటపటిమను కోల్పోయింది. బీజేపీ ఎన్నికల్లో పెద్దగా ఎక్స్ పెక్ట్ చేసిందేమీ లేదు. అందుకే ఆ పార్టీ డీలాపడిపోలేదు. టీడీపీ పతనాన్ని తన విజయంగా మార్చుకోవాలని యోచిస్తోంది. అందుకే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటోంది. వైసీపీ నిర్ణయాల పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత తలెత్తితే తెలుగుదేశం క్రమేపీ పుంజుకుంటుంది. అప్పుడు ఆందోళనలకు దిగితే ప్రజల నుంచి కొంత సహకారం దొరుకుతుంది. దాంతో టీడీపీ మళ్లీ పుంజుకుంటుంది. ఆ తర్వాత బీజేపీ స్పేస్ దొరకదు. అందుకే అంతవరకూ వేచి చూడకుండా ముందుగా తానే ప్రోయాక్టివ్ ప్రతిపక్ష పాత్ర తీసుకోవాలని భావిస్తోంది. టీడీపీ ఇప్పటికిప్పుడు ఉద్యమాలు చేసే స్థితి లేదు. కేసులతో క్యాడర్ ను ప్రభుత్వయంత్రాంగం ఇబ్బంది పెట్టవచ్చు. బీజేపీకి ఆ భయం, బాధ లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీపై రాష్ట్రప్రభుత్వం అంత దూకుడు ప్రదర్శించలేదు. దానినే బీజేపీ అడ్వాంటేజిగా మలచుకుంటోంది.చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే తన మనుషులను బీజేపీలోకి పంపుతున్నారనే వాదన బలంగా ఉంది. బీజేపీ ఆ మాత్రం పసిగట్టలేనంత అమాయకపు పార్టీ కాదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ప్రస్తుతం తనకు కావాల్సింది బలం, బలగం. అందుకు ఏ పార్టీ నుంచి అండదండలు అందినా స్వీకరించేందుకు సిద్దం. పైపెచ్చు పదవుల సహా వచ్చి చేరతామంటే వద్దనుకునేంత సత్తెకాలం పార్టీ కాదు . చంద్రబాబు ఆలోచనలతో సంబంధం లేకుండానే పార్టీలో చేరేవారికి బీజేపీ ఆహ్వానాలు పలుకుతోంది. కరడుగట్టిన టీడీపీ వాదులకు సైతం కమలం కండువా కప్పుతోంది. టీడీపీ ఖాళీ అయిపోతోందనే భావన ప్రజల్లోకి వెళితే సహజంగానే ఆ పార్టీకి నైతికస్థైర్యం తగ్గుతుంది. ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రప్రభుత్వ విధానాలపై ఇంకా రోడ్డెక్కక ముందే తానే కదిలితే రాజకీయ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ప్రజలను తనవైపు తిప్పుకోవచ్చు. జనసేన, టీడీపీలకు చెక్ పెట్టి ఆ పాత్రను తాను చేజిక్కించుకోవచ్చు. అందుకే రాష్ట్రప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ తాను బలపడాలనుకుంటోంది బీజేపీ. తెలుగుదేశం పై విమర్శలు చేస్తే తనకు పెద్దగా రాజకీయంగా కలిసొచ్చే చాన్సులుండవు. వైసీపీని తప్పుపడితేనే ప్రజల అసంతృప్తిని ఎన్ క్యాష్ చేసుకోవచ్చు. ఈ ద్విముఖ వ్యూహమే భారతీయ జనతాపార్టీకి ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్ నిస్తుందని అగ్రనాయకులు విశ్వసిస్తున్నారు.