ముందుకు సాగని ఆఫ్ షోర్ రిజర్వాయర్‌ పనులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముందుకు సాగని ఆఫ్ షోర్ రిజర్వాయర్‌ పనులు

శ్రీకాకుళం, ఆగస్టు 22 (way2newstv.com
రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఒకటి. వ్యవసాయాధారిత జిల్లా అయిన శ్రీకాకుళం నుంచి వలసలు అధికం. ప్రచ్ఛన్న నిరుద్యోగం పుణ్యమాని.. ఖరీఫ్ పనులు పూర్తికాగానే, జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు పొట్టచేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలస పోతారు. వర్షాలు బాగా కురిస్తే తిరిగి సొంతగూటికి చేరుతుంటారు. వంశధార రిజర్వాయర్‌తో పాటు పలాస, టెక్కలి నియోజకవర్గాలకు సాగు నీరు అందించి వలసలను నివారించేందుకు ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు శ్రీకారం చుట్టారు. పలాస జిల్లా నందిగాం మండలం రేగులపాడు వద్ద మహేంద్రతనయ నదిపై రిజర్వాయర్‌ను నిర్మించాలని నిర్ణయించారు. రూ.126 కోట్లు అంచనా వ్యయంతో 24,600 ఎకరాలకు సాగునీరుతో పాటు నందిగాం, మెళియాపుట్టి, టెక్కలి, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 
ముందుకు సాగని ఆఫ్ షోర్ రిజర్వాయర్‌ పనులు

పదేళ్ల క్రితమ ఆగస్టు 4న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు.అయితే ప్రాజెక్టు ఆరంభం నుంచి నిర్మాణ పనులు సజావుగా సాగడం లేదు. భూసేకరణ, అనంతరం ఆర్‌ఆర్ ప్యాకేజీ వర్తింపు తదితర అంశాలు గుది బండలా మారాయి. దీంతో ప్రాజెక్ట్ కలగా మారింది. 2009లో ముఖ్యమంత్రి వైఎస్ అకాల మరణం, రాష్ట్ర విభజన నేపథ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. తిరిగి 2014లో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. అయితే అంచనా వ్యయం పెరగడంతో కాంట్రాక్టరు చేతులెత్తేశారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ పోరాటం చేసి ముఖ్యమంత్రిని ఒప్పించి రూ.463 కోట్లు విడుదల చేయించారు. నిర్దేశిత లక్ష్యం ప్రకారం 2018 జూలై 31 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలి. గడువు ముగిసినా ఇప్పటి వరకు 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు ఏడు సార్లు గడువు పొడిగించారు.జిల్లాలోని వంశధార ప్రాజెక్ట్ పరిధిలో హిరమండలం జలాశయం తరువాత నిర్మిస్తున్న మరో జలాశయం ఆఫ్‌షోర్ ప్రాజెక్టే. దీని సామర్థ్యం 2.05 టీఎంసీలు. ప్రస్తుతం జరుగుతున్న జలాశయం గట్టు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. బాలారిష్టాలు దాటడం లేదు. కాంక్రీట్ నిర్మాణాలన్నీ పునాదుల దశను దాటలేదు. మహేంద్రతనయ నుంచి కాలువలోకి నీటిని విడుదల చేసి, ఆపై నియంత్రించి, పంపించే నిర్మాణాలు మెళియాపుట్టి మండలం చాపర వద్ద ప్రారంభం కావాలి. ఇక్కడి ఇన్‌లెట్ రెగ్యులేటర్ మొదలుకొని కాలువ ప్రవహించే..13 కి.మీ. పొడవునా అనేక నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితేమీ కనిపించలేదు. కాలువ శివారైన.. నందిగాం మండలం పెదగురువూరు వద్ద కాలవలో నుంచి నీటిని జలాశయంలోకి పంపించేందుకు హెడ్ రెగ్యులేటర్ నిర్మించాల్సి ఉంది. ఇలా మొత్తంగా 29 కట్టడాలు పూర్తి కావాల్సి ఉంది. వీటిలో ఇప్పటి వరకు 9 కట్టడాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇవి కూడా గోతుల దశను దాటలేదు. కానీ జలవనరుల శాఖ మాత్రం వింత నివేదికలు సమర్పిస్తోంది. పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని చెబుతోంది. ఇక టెక్కలి-మెళియాపుట్టి ప్రధాన రహదారిలో రెండు వరుసల వంతెనలు మూడు నిర్మించాల్సి ఉంది. వీటికి చాలా సమయమే పట్టే అవకాశం ఉంది. కొండను తొలిచే టన్నెల్ నిర్మాణమే అసలు సిసలైన పరీక్ష. కొండకు రెండువైపులా ఇంకా పదేసి మీటర్ల లోతుకు వెళ్లే గానీ సొరంగం పనులు పూర్తి కాలేదు. సొరంగం పనులు పూర్తి కాకుండా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదని సాగునీటి రంగ నిపుణులే చెబుతున్నారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి అధికారుల అలసత్వమే కారణమని స్థానిక ఎమ్మెల్యే శివాజీ ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా బుధవారం ఆయన మౌనదీక్ష కూడా చేపట్టారు. కాగా, టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక దృష్టి సారించి ప్రాజెక్టు పనులు పూర్తి చేయించాలని రైతులు కోరుతున్నారు.జలాశయం నిర్మిస్తున్న ప్రాంతంలో ఇంకా ఐదు గ్రామాలు ఉన్నాయి. వీటి పునరావాసానికి సంబంధించి ఇప్పటి వరకు పరిష్కారం లభించలేదు. ఆ గ్రామాలను ఖాళీ చేయించాలి. కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ విధానం అని కొత్తగా పెట్టడంతో చెల్లింపులు సకాలంలో జరగలేదు. దీనికి తోడు పరిహారం రెట్టింపు అయింది.ప్రాజెక్టుకు సంబంధించి 72.61 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు 35.93లక్షల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. కాంక్రీట్ పని 68,704 క్యూబిక్ మీటర్లకు గాను 1,761 క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే పూర్తయ్యాయి.మొత్తం జలాశయం గట్టు 2.5 కి.మీ. పొడవునా రాతి కట్టడం నిర్మించాలి. ఇప్పటి వరకు 800 మీటర్ల మేర పనులు    నిర్వహించారు.ప్రాజెక్టు పరిధిలో వివిధ చోట్ల మొత్తం 29 కాంక్రీట్ కట్టడాలు నిర్మించాల్సి ఉండగా, పనులు ప్రారంభించినవి 9.  ఇక సొరంగం, కాలువ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది.