పులస...విలాసా.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పులస...విలాసా..

రాజమండ్రి, ఆగస్టు 28, (way2newstv.com)
ధవళేశ్వరం బ్యారేజి నుంచి సాగరసంగమం వరకు ఉన్న పాయల్లోనే దొరికే చేప. పేరు ‘పులస’. ఆ పేరు వింటేనే మాంసాహార ప్రియుల నోట్లో నీరూరుతూంటుంది. వండిన తరువాత ఆ ముక్క పంటికి తగిలితే.. ఆ రుచికి నాలుక వహ్వా అంటుంది. జీవితంలో ఒకసారి పులస రుచి చూస్తే ఏటా లొట్టలేసుకుని తినాలి్సందే.అత్యంత ఖరీదైన డిష్‌ ఈ పులస చేప. కిలో పులస కావాలంటే ఐదారు వేల రూపాయలు పెట్టాల్సిందే. అయినప్పటికీ ‘పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి్సందే’నని గోదావరి జిల్లాల్లోని మాంసాహార ప్రియులు అంటారు. ‘పులస’ నేపథ్యం ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.పసిఫిక్‌ మహాసముద్రం ప్రాంతంలోని ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్‌ తదితర దేశాల సముద్ర జలా ల్లో జీవించే ఈ పులసను క్యుఫిడే కుటుంబానికి చెం దిన కార్డేటాగా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. 
పులస...విలాసా.. 

పులస ప్రజాతి హిల్సా. జాతి ఇల్సా. ఈ ‘ఇల్సా’ కాస్తా  సముద్రంలో ఉన్నప్పుడు ‘విలస’గా.. గోదావరిలోకి ప్రవేశించాక ‘పులస’గా మారుతుంది. ఈ చేపలు పునరుత్పత్తి కోసం పసిఫిక్‌ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మీదుగా.. సుమారు 11 వేల నాటికల్‌ మైళ్లు ప్రయాణించి గోదావరిలోకి వలస వస్తాయి. ఇందుకోసం అవి 30 నుంచి 40 రోజుల పాటు జీవ గడియారం (బయోలాజికల్‌ క్లాక్‌) ఆధారంగా ఏకధాటిగా ప్రయాణిస్తాయి. సైబీరియా పక్షులు, ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల మాది రిగానే.. పులసలు కూడా పునరుత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరాన్ని అలవోకగా అధిగమించి.. ఏటా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో గోదావరి నదికి ఎర్రనీరు (వరద) వచ్చే సమయానికి గుడ్లు పెట్టడానికి వలస వస్తాయి. ఆడ, మగ పులసలు గోదావరిలో ఇసుక, గులక రాళ్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సంగమించి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు ఒకటి రెండు రోజుల్లోనే చేప పిల్లలుగా ఎదుగుతాయి. పులస చేప పిల్లలను ‘జట్కా’ అని పిలుస్తారు. పునరుత్పత్తి పూర్తయ్యాక వచ్చిన సముద్ర మార్గంలోనే సంతానం(జట్కాలు)తో కలిసి తిరిగి వచ్చిన చోటకే వెళ్లిపోతాయి. ఇందుకు మరో నెల రోజులు సమయం పడుతుంది. వీటిల్లో కొన్ని గోదావరిలో వలలకు చిక్కి, మత్స్యకారులకు సిరులు కురిపిస్తాయి. ఇవి ఉభయ గోదావరి జిల్లాల్లోని గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయల్లో మాత్రమే లభిస్తాయి.గోదావరికి వరదలు వచ్చే జూలై చివరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పులసలు లభిస్తాయి. కొన్ని సార్లు సెప్టెంబర్‌లో కూడా దొరుకుతాయి.. సముద్రం నుంచి గోదావరిలోకి ప్రవేశించాలంటే అవి ఏటికి ఎదురీదుకుంటూ రావాలి్సందే. మహోగ్ర వడితో పరవళ్లు తొక్కే వరద గోదావరికి ఎదురీదడమంటే మాటలు కాదు. అందుకు తగినట్టుగానే పులసలు 100 కిలోమీటర్ల వేగంతో గోదావరికి ఎదురీదుతాయి. గోదావరి జిల్లాల్లో సముద్ర ముఖద్వారం నుంచి గోదావరి నదిలో సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అంత దూరం అంత వేగంతో ఎదురీదడంతో ఈ చేపల్లో కెమికల్‌ రియాక్షన్‌ విపరీతంగా జరిగి దీని కండరాల్లో ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. పులసలకు స్వేదగ్రంధులు ఉండవు.  మామూలుగా చేపల్లో ఒమేగా–3 పేట్రియాసిడ్స్‌ (ఆమ్లాలు) ఉంటాయి. కానీ ఈ ఆమ్లాలు పులసల్లో మూడు రెట్లు అధికంగా ఉంటాయని, అందువల్లనే వీటికి మంచి రుచి వస్తుందని చెబుతారు.మాంసాహార ప్రియులు ఎంతగానో ఇష్టపడి తినే ఈ పులసలకు కూడా నకిలీల బెడద తప్పడం లేదు. పులసలపై అవగాహన ఉన్న గోదావరి వాసులు నకిలీ పులసలను సులువుగా గుర్తిస్తున్నారు. గోదావరిలో దొరికే పులస దిగువన చర్మం బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. అదే ఒడిశా నుంచి వచ్చే నకిలీ పులస చర్మం కొద్దిగా ఎరుపు రంగులో ఉన్నా మెరుపు ఉండదు. కేజీ బేసిన్‌లో చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం జరుగుతున్న డ్రిల్లింగ్‌ కారణంగా జలకాలుష్యం పెరిగిపోవడం వలన గోదావరిలో పులసల రాక తగ్గుతోందని చెబుతున్నారు. సముద్ర గర్భంలో రిగ్గింగ్, బ్లాస్టింగ్‌ వంటి కార్యకలాపాల వల్ల  ఈ చేపల వలసలు తగ్గాయని మత్స్యకారులు అంటున్నారు