బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు

తిరుమల, ఆగస్టు 28, (way2newstv.com)
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు జరుగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టిటిడి సివిఎస్వో గోపినాథ్‌ జెట్టి, అర్బన్‌ ఎస్పీ కెకెఎన్‌.అన్బురాజన్‌ కలిసి బ్రహ్మోత్సవాల భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో ప్రత్యేకాధికారి మీడియాతో మాట్లాడుతూ టిటిడి నిఘా, భద్రతా విభాగం, అర్బన్‌ పోలీసులు కలిసి బ్రహ్మౌత్సవాల్లో రోజువారీ భద్రతా ప్రణాళికపై చర్చించేందుకు సమావేశమయ్యారని తెలిపారు. 
బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు

సెప్టెంబరు 30న ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, ఈ పర్యటన భద్రతా ఏర్పాట్లపైనా చర్చిస్తారని వివరించారు.బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం రోజున ముఖ్యమంత్రి పర్యటన, గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం లాంటి విశేషమైన రోజుల్లో గత అనుభవాలను దష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడతామని టిటిడి సివిఎస్వో గోపినాథ్‌ జెట్టి తెలిపారు. దొంగతనాలు జరగకుండా సిసిటివిల నిఘాతో పాటు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తామన్నారు. అక్టోబరు 4న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 3న అర్ధరాత్రి నుండి అక్టోబరు 5వ తేదీ ఉదయం వరకు రెండు ఘాట్‌ రోడ్లలో ట్రాఫిక్‌ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. తిరుమలలో దర్శనాలు, గదులు, లడ్డూప్రసాదం దళారులను అరికట్టేందుకు స్థానిక పోలీసుల సహకారంతో పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. భద్రత ఏర్పాట్లకు సంబంధించి మీడియా సలహాలను కూడా ఆహ్వానించారు.