గురుకులం.. ఎలా ఉండగలం..? (మహబూబ్ నగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గురుకులం.. ఎలా ఉండగలం..? (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, ఆగస్టు 24 (way2newstv.com):
విద్యార్థులకు అన్ని వసతులతో నాణ్యమైన ఇంటర్మీడియట్‌ విద్యను అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బీసీ గురుకుల కళాశాలలకు భవనాలు కరవయ్యాయి. దీంతో అద్దె భవనాలు, చాలీచాలని గదులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన బీసీ గురుకుల కళాశాలలకు నేటికీ భవనాలను నిర్మించలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రభుత్వం మూడేళ్ల క్రితం మూడు బీసీ గురుకుల కళాశాలలను ఏర్పాటు చేసింది. నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొడంగల్‌లో వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్క కళాశాలకూ సొంత భవనం లేకపోవడం గమనార్హం. ఈ కారణంగా అందుబాటులో ఉన్న భవనాలు, గదుల్లోనే విద్యార్థులు కాలం గడుపుతున్నారు.
గురుకులం.. ఎలా ఉండగలం..? (మహబూబ్ నగర్)

భవనాల నిర్మాణానికి స్థలాలు అందుబాటులో ఉంటే వెంటనే నిధులు మంజూరు చేస్తామని కళాశాలలు మంజూరు చేసిన సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని చోట్ల అధికారులు స్థలాలను సేకరించకపోవడం, స్థలాలు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం విద్యార్థులకు శాపంగా మారినట్లయింది. ఒక్కో గురుకుల కళాశాలలో 320 మంది చొప్పున విద్యార్థులు ఇంటర్‌ విద్యను అభ్యసిస్తున్నారు. భవనాలు లేకపోవడంతో అరకొర వసతుల మధ్య చదువులను కొనసాగిస్తున్నామని విద్యార్థులు వాపోతున్నారు. కొన్ని భవనాల్లో స్నాన గదులు, మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్వకుర్తిలో రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలికల వసతిగృహంలో గురుకుల కళాశాలను నిర్వహించారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాల వసతి గృహం ప్రారంభం కావడంతో గురుకుల కళాశాలను ఖాళీ చేయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బాలికల గురుకుల పాఠశాలలోనే కళాశాలను కొనసాగిస్తున్నారు. గురుకుల పాఠశాలలో గదుల కొరత కారణంగా కళాశాల విద్యార్థులకు తరగతులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. ఇరుకు గదుల్లో బోధించడం ఇబ్బందికరంగా ఉందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. మరుగుదొడ్లు సరిపడా లేవు. భోజనశాల లేకపోవడం ఇబ్బందికరంగా ఉందన్నారు. తరచుగా భవనాలు మార్చడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ అరకొర గదులు ఉండటంతో ప్రయోగశాలలు, కంప్యూటర్‌ ల్యాబ్‌, గ్రంథాలయం, క్రీడా ప్రాంగణం లేని పరిస్థితి. ప్రభుత్వం దశాబ్దాల క్రితం నిర్మించిన గురుకుల పాఠశాలలోనే కళాశాల తరగతులు, వసతిగృహాన్ని కొనసాగిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ గురుకుల కళాశాలనూ అక్కడి బాలికల గురుకుల పాఠశాలలోనే నిర్వహిస్తున్నారు. ఇక్కడా అసౌకర్యాలే వేధిస్తున్నాయి. ఇక్కడ కళాశాల విద్యార్థులు బస చేయడానికి తరగతి గదులకు ఒకే గదిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావడంతో భోజనం, క్రీడలు తదితరాలకు విద్యార్థులు అవస్థల పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గురుకుల కళాశాలలకు స్థలాలను సేకరించి భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తూ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు కోరుతున్నారు.