ఆరోగ్యమస్తు (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆరోగ్యమస్తు (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, ఆగస్టు 24 (way2newstv.com): 
జిల్లాలోని 30 ఏళ్లు పైబడిన వారి ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. నాన్‌కమ్యునికేబుల్‌ డీసీజెస్‌(ఎన్‌సీడీ) కార్యక్రమం కింద అధికారులు కొనసాగిస్తున్నారు. తాజాగా కేంద్రం కూడా ఈ కార్యక్రమం చేపడుతూనే మాతా, శిశు సంరక్షణ కేంద్రాలను బలోపేతం, ప్రజారోగ్య సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించటంతో ఉమ్మడి జిల్లా వాసులందరికి ప్రయోజనం కలుగనుంది.  కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న జీవనశైలి వ్యాధుల గుర్తింపు కార్యక్రమంలో జిల్లాలో ఎన్‌సీడీ కార్యక్రమం గత ఫిబ్రవరి నుంచి ప్రారంభించి కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం తుది దశలో ఉంది. ఇప్పటికే గుర్తించిన బాధితులను చికిత్సల కోసం ఆసుపత్రులకు సిబ్బంది తరలిస్తున్నారు. 
ఆరోగ్యమస్తు (ఆదిలాబాద్)

ఈ ఎన్‌సీడీ కార్యక్రమంలో క్యాన్సర్‌, మధుమేహం, రక్తపోటు వ్యాధులు నిర్ధరించటానికి పరీక్షలు చేశారు. ప్రస్తుతం వివరాలను అంతర్జాలంలో నమోదు చేయటంతోపాటు వైద్యాధికారులు శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు.  ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలోని కొలాం ఆదివాసీలకు సైతం నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్‌ సూచన మేరకు దీన్ని ప్రారంభించారు. పలు గూడేలకు వైద్య సిబ్బంది వెళ్లి వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేసున్నారు. వారికి మందులను అందజేస్తున్నారు. కొలాం తెగ అంతరించే జాతుల జాబితాలో ఉండటంతో జిల్లా వైద్యారోగ్య శాఖ ఈ మేరకు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ తెగలోని పలువురు దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధులు, క్యాన్సర్‌ తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. అవగాహన లోపం వల్లే ఇలా జరుగుతోందని భావించిన వైద్య శాఖ వారికి రక్తపోటు, మధుమేహం, రక్త  హీనత నిర్ధరణ పరీక్షలు చేస్తూ అవసరమైన మందులను అందజేస్తున్నారు. అంతే కాక అవసరమైన వారిని పెద్దాసుపత్రులకు తరలిస్తున్నారు. 30 సంవత్సరాలు పైబడిన జీవన శైలి వ్యాధులను గుర్తించి చికిత్సలు అందించటానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించటంతో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో దాదాపు 19,12,890 మందికి ప్రయోజనం కలగనుంది. ఇందులో భాగంగా రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించి చికిత్సలు అందించనున్నారు. క్యాన్సర్‌ గుర్తింపులో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌లను గుర్తిస్తారు. ప్రజల్లో ఆరోగ్యకర అలవాట్లు పెంపొందించటానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రాలను పటిష్ఠం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించటానికి నిర్ణయించారు.