మహబూబ్ నగర్ ఆగస్టు 19 (way2newstv.com)
సమాజం అభివృద్ధి చెందడానికి మనలో ఐకమత్యమే ప్రధానమైనదని, ప్రజలందరూ ఒక్కటై జీవనాన్ని సాగించినప్పుడు శాంతిసౌభాగ్యాలతో గ్రామ సీమలు విలసిల్లుతాయని అదనపు ఎస్.పి ఎన్.వేంకటేశ్వర్లు అన్నారు. వివిధ రీతుల ఉన్న సాంఘీక దురాచారాల నిర్మూలనకై నిరంతరం కృషి చేస్తున్న జిల్లా పోలీసులు నేడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్.పి. రెమా రాజేశ్వరి ఆలోచన మేరకు, సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో పోలీసు, ప్రజలు కలిసి అంటరానితనమనే మాయరోగాన్ని మన గ్రామం నుండి తరిమేద్దామని ప్రతిన పూని ర్యాలీలు నిర్వహించారు. ఈసందర్భంగా మహబూబ్ నగర్ రూరల్ పి.ఎస్. పరిధిలోని బోయపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అదనపు ఎస్.పి. హాజరైయారు.
ఐకమత్యమే అభివృద్దికి ప్రధానం
మన సమాజం అనేకమైన మార్పులను ఆహ్వానిస్తూ, అంతరిక్షంలోకి, చంద్రుని పైకి వెళ్లి నివాసం ఉంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నదని, ఈ సమయంలో అంటరానితనం అంటూ, దురాచారాలంటూ దీర్గాలు తీయడం మన మూర్ఖత్వమే అవుతుందని అన అన్నారు. నాటి సమాజంలో మహా పండితులు అన్నమయ్య, వేమన, శంకరాచార్యులు, ఆధునిక కాలంలో మహనీయులు అంబేడ్కర్, గాంధీజీ వంటివారు అంటరానితనాన్ని ఈసడించుకోవడం స్పష్టంగా మనముందు ఉండగా, వారికన్నా మనలో గొప్పేముందని ఇటువంటి అనాగరికాలను పాటిస్తున్నామని అధికారి ప్రశ్నించారు. ప్రస్తుతం చాలావరకు సాంఘీక దురాచారాలకు ప్రజలు దూరంగా ఉన్నా, అక్కడక్కడ కొన్ని సంఘటనలు మనకు మచ్చ తెస్తున్నాయని, ప్రజలంతా ఒకే కుటుంబంగా చక్కగా చదువుకోవడం, అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ముఖ్యమని, మన పిల్లలలో ఇటువంటి ఆలోచనలు లేని సంస్కారయుతమైన జీవనాన్ని అలవాటు చేద్దామని పిలుపునిచ్చారు. డి.ఎస్.పి. బి.భాస్కర్ మాట్లాడుతూ, జిల్లా ఎస్.పి. ఆదేశాల మేరకు అంటరానితనం నిర్మూలన అవగాహన పోస్టర్లను రూపొందించి, సర్పంచులు, వార్డ్ సభ్యులు, యువత, విద్యార్థులతో కలిసి జిల్లా వ్యాప్తంగా సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రజలకు మంచి జరిగే ప్రతి కార్యక్రమంలో పోలీసు శాఖ ముందు నిలబడి పని చేస్తుందని, సమాజం నుండి లభించే ప్రోత్సాహం, అభినందన తమకు గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొన్న ఈ సమావేశం, ర్యాలీ ఉత్సాహంగా సాగగా, రూరల్ ఇన్స్పెక్టర్ బి.కిషన్, ఎస్.ఐ. భాస్కర్ రెడ్డి, అంబేడ్కర్ సంఘ నాయకులు బ్యాగరి వెంకటస్వామి ఇతర నాయకులు పాల్గొన్నారు
Tags:
telangananews