గాంధీలో కనిపించని సేఫ్టీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గాంధీలో కనిపించని సేఫ్టీ

హైద్రాబాద్,  ఆగస్టు 10, (way2newstv.com)
గాంధీ దవాఖానాలో ఫైర్సేఫ్టీ సిస్టం అలంకార ప్రాయంగా మారింది. 2003లో ఏర్పాటు చేసిన అగ్ని మాపక పరికరాలు మూలకుపడి పనిచేయడం లేదు. ఇన్, ఔట్పేషెంట్లతో పాటు మెడికల్ కాలేజ్ విద్యార్థులు, డాక్టర్లు, పేషెంట్ల అటెండెంట్స్.. ఇలా దాదాపు రోజూ 10వేల మంది దాకా దవాఖానాకు వచ్చిపోతుంటారు. గురువారం పిడియాట్రిక్వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని పరికరాలు కాలిపోయాయి. ఆ మంటలు పక్కనున్న వార్డులకు వ్యాపిస్తే పరిస్థితి ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ కల్పించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పట్టించుకోలేదని, నిధుల విడుదల చేయకనే పనులు జరగలేదన్న ఆరోపణలున్నాయి. గాంధీ హాస్పిటల్ మూడో అంతస్తులోని పీడియాట్రిక్సర్జరీ వార్డులో షార్ట్సర్క్యూట్తో  అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే విద్యుత్సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. 
 గాంధీలో కనిపించని సేఫ్టీ

ఈ సంఘటనతో గాంధీలోని అగ్ని మాపక వ్యవస్థ తీరుపై ప్రశ్నలు మొదలయ్యాయి. రాష్ట్రంలోనే పెద్దాస్పత్రుల్లో ఒక్కటైన గాంధీ హాస్పిటల్ లో అగ్ని మాపక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. 2003లో ఏర్పాటు చేసిన అగ్ని మాపక పరికరాలు ఇప్పుడు మూలన పడ్డాయి. రోజుకు ఐపీ, ఓపీ తో పాటు మెడికల్ కాలేజ్ విద్యార్థులు, డాక్టర్లు, పేషెంట్ల అటెండెంట్స్ ఇలా పదివేల మంది నిత్యం గాంధీ హాస్పిటల్ లో ఉంటారు. ఇలాంటి చోట ఎంతో పకడ్బందీగా అగ్ని మాపక వ్యవస్థ ఉండాలి. ఐతే అత్యాధునిక అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే దాదాపు 2 కోట్ల రూపాయలు కావాలి. కానీ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో 7 ఐదేళ్లుగా ఇక్కడ అగ్నిమాపక వ్యవస్థ ప్రతిపాదన స్థాయిలోనే ఆగిపోయింది.దాదాపు ఏడేళ్ల క్రితం కోల్ కతాలోని ఓ హాస్పిటల్ లో జరిగిన అగ్ని ప్రమాదం మొత్తం దేశంలోని హాస్పిటల్స్ లో అగ్ని మాపక వ్యవస్థ తీరుపై చర్చ జరిగేలా చేసింది. ఆ ఘటనలో హాస్పిటల్ లో సరైన అగ్నిమాపక యంత్రాలు లేక దాదాపు 100 మందికి పైగా రోగులు చనిపోయారు. దీంతో  దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ లో అగ్ని మాపక వ్యవస్థను పటిష్టం చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. పైగా ఈ ఘటనకు ఓ ఏడాది ముందు గాంధీ హాస్పిటల్ లోనూ అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా అదృష్టవశాత్తు త్వరగానే మంటలను అదుపులోకి తెచ్చారు. ఐతే ఈ సమయంలోనే అగ్నిమాపక అధికారులు గాంధీ హాస్పిటల్ లో ఫైర్ సేప్టీ ఏ మాత్రం బాగాలేదని నిర్ధారించారు. గాంధీ లోని ఇన్ పేషెంట్ బిల్డింగ్ ఎనిమిది అంతస్థులు ఉంటుంది. ఇందులోని ఏ ఫ్లోర్ లో ప్రమాదం జరిగిన భారీ అగ్ని మాపక యంత్రాలు లోనికీ వెళ్లే అవకాశమే లేదు. అలాగని అన్ని అంతస్తుల్లో ఫైర్ సేప్టీ ఉందా అంటే అదీ లేదు. కేవలం ప్రధాన ద్వారా గేటు ముందు మాత్రమే అలంకరణ ప్రాయంగా అగ్నిమాపక పరికరాలు ఉన్నాయి. వీటి నిర్వహణ సరిగా లేదు. ఏదైనా అంతస్తుల్లో ప్రమాదం జరిగితే మంటలను వెంటనే ఆర్పే పరిస్థితి లేదు. ఓపీ సహా మెడికల్ కాలేజ్ భవనాల వద్ద ఇదే పరిస్థితి. అప్పట్లోనే స్వయంగా అగ్ని మాపక సిబ్బంది అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని కోరినప్పటికీ ఆ దిశగా దృష్టి పెట్టిన నాథుడే లేడు.గాంధీలో ఫైర్ సేఫ్టీ పటిష్టంగా ఏర్పాటు చేయాలంటే రూ.2 కోట్లు కావాలి. కానీ ఇందుకోసం చొరవ తీసుకోవాల్సిందెవరన్నది ప్రశ్నగా మారింది. కారణం గాంధీలోని పాలన యంత్రాగానికి ప్రభుత్వం నుంచి రోజు వారీ ఖర్చులు రాబట్టుకోవడమే కష్టంగా మారింది. ఎంఆర్ఐ, సిటి స్కాన్ లాంటి యంత్రాలు పాడైతేనే ఆరు నెలల వరకు రిపేర్ కు దిక్కులేదు. దీనికోసమే హాస్పిటల్ పాలనా యంత్రాగం నెలల తరబడి ప్రభుత్వం చుట్టు తిరిగి హాస్పిటల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో అగ్ని మాపక యంత్రాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పరిస్థితి లేదు.అదృష్టవశాత్తు స్వల్ప ప్రమాదాలతో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా పోయింది. కానీ భారీ అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటీ, దానికి బాధ్యత ఎవరూ వహించాలి. ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత వీటిపై దృష్టి పెట్టటం లేదు.  మొన్నటి ఎండకాలంలో బషీర్ బాగ్ లోని ఖాన్ లతీఫ్ ఖాన్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు కొన్ని రోజులు హడావుడి చేశారు. సిటిలోని అన్ని భవనాలకు సరైన అగ్నిమాపక వ్యవస్థ ఉండాలని యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. కానీ ప్రభుత్వ భవనాల సంగతేంటన్నది పట్టించుకున్న వారు లేరు. ఇకనైనా పెద్ద ఎత్తున జనాలు ఉండే ప్రభుత్వ భవనాల్లో అగ్ని మాపక వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.