మళ్లీ తెరపైకి కర్నూలు రాజధాని - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ తెరపైకి కర్నూలు రాజధాని

కర్నూలు, ఆగస్టు 10, (way2newstv.com)
అధికారంలో ఐదేళ్లున్నారు అప్పుడు గొంతు పెగల లేదు. ఇప్పుడు విపక్షంలోకి మారాక మాత్రం పాత డిమాండ్లన్నింటినీ బయటకు తీసుకువస్తున్నారు. అందులో సిద్ధహస్తులు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఇటీవల బీజేపీలో చేరిన టీజీ వెంకటేష్ రాయలసీమ రెండో రాజధాని అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ డిమాండ్ కొత్తదేమీ కాదని, ఎప్పటి నుంచో ఉందని ఆయన తెలిపారు. అందునా కర్నూలులో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన ఇప్పుడు గళం విప్పుతున్నారు.టీజీ వెంకటేష్ అన్ని విధాలుగా బలమైన నేత. అందులో ఎవరూ కాదనలేరు. ఇటు ప్రజల్లోనూ ఆయనకు మంచి పేరుంది. కర్నూలు నియోజకవర్గంలో చేస్తున్న సేవా కార్యక్రమాలే ఇందుకు కారణం. ఇక ఆర్థికంగా ఆయనను కొట్టేవారే లేరు. 
మళ్లీ తెరపైకి కర్నూలు రాజధాని

దీంతో ఆయన ఎప్పుడూ అధికార పార్టీలో ఉండాలని కోరుకుంటారు. అధికార పార్టీలో ఉంటే అన్ని రకాలుగా సేఫ్ గా ఉండవచ్చనేమో. అందుకే 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో ఉన్న టీజీ వెంకటేష్ రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీజీ వెంకటేష్ కు చంద్రబాబునాయుడు రాజ్యసభ పదవి ఇచ్చి గౌరవించారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన కోసం బీజేపీపై టీజీ వెంకటేష్ పెద్ద పోరాటమే చేశారు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆయన బీజేపీ గూటికి చేరారు. బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన మనసంతా కర్నూలు కుర్చీపైనే ఉంది. కర్నూలు నియోజకవర్గంలో తనయుడు టీజీ భరత్ ను గెలిపించుకోవాలన్న కోరిక టీజీ వెంకటేష్ కు నెరవేరలేదు. అతి కష్టం మీద సీటు సంపాదించుకున్నా ఈ ఎన్నికల్లో భరత్ ఓటమి పాలయ్యారు.అందుకే వచ్చే ఎన్నికల నాటికి మరింత స్ట్రాంగ్ అవ్వాలని టీజీ వెంకటేష్ టీడీపీ కంటే వైసీపీనే టార్గెట్ చేసుకున్నారు. అందుకే సీమకు రెండో రాజధాని నినాదం ఎత్తుకున్నారు. అన్ని ప్రాంతాల్లో న్యాయం జరగాలంటే సీమలో రెండో రాజధాని అవసరమట. మరి ఐదేళ్ల పాటు అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ నినాదం ఎందుకు టీజీ వెంకటేష్ కు గుర్తుకురాలేదంటున్నారు వైసీపీ నేతలు. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించి కాషాయ కండువా కప్పుకున్నా సైకిల్ సవారీ వీడలేదని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మొత్తం మీద టీజీ వెంకటేష్ తన కుమారుడి భవిష్యత్ కోసమే వైసీపీని టార్గెట్ చేశారంటారా?