తిరుపతి, ఆగస్టు 24 (way2newstv.com)
ఏపీలో బలపడే దిశగా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న బీజేపీ సమయం చిక్కినప్పుడల్లా అధికార వైసీపీని టార్గెట్ చేస్తోంది. గతంలో పీపీఏల పున:సమీక్ష నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా పోలవరం రివర్స్ టెండర్లపై జగన్ సర్కార్‌కు షాకిచ్చింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి నిధులు కేంద్రం సమకూరుస్తుందని, నిర్మాణ బాధ్యతలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని.. నిర్ణయాలు తీసుకునే ముందు కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుందని కాస్త ఘాటుగానే సమాధానమిచ్చింది.
సమర్ధ పాలన కోసమే అధికారం ఇచ్చారు : రామ్ మాధవ్
అటు రాజధాని అమరావతి తరలిస్తారని జరుగుతున్న ప్రచారంపైనా బీజేపీ తీవ్రంగానే స్పందించింది. రాజధాని పేరిట ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేశారని, రాజధాని మార్పు ఆలోచన సరికాదని విమర్శించింది. ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే రాజధాని రైతుల తరఫున ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని కూడా హెచ్చరించింది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రజలు అధికరమిచ్చింది మెరుగైన, సమర్థ పాలన అందిస్తారనే కానీ ఇష్టం వచ్చినట్లు చేసేందుకు కాదన్నారు. ఏపీలో విధ్వంసకర పరిస్థతులు నెలకొన్నాయని.. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా చేపట్టలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తోందన్న రాం మాధవ్ రాష్ట్రంలో పరిస్థతులు ఏం బాగాలేవని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలని, లేకుంటే ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కూడా సిద్ధమన్నారు.
Tags:
Andrapradeshnews