జైట్లీకి తెలుగు రాష్ట్రాల్లో అనుబంధం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జైట్లీకి తెలుగు రాష్ట్రాల్లో అనుబంధం

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (way2newstv.com)
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగు రాష్ట్రాలతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు సమయంలో అరుణ్ జైట్లీ కీలక పాత్ర పోషించారు. విభజన సమయంలో ఆయన తెలంగాణకు మద్దతుగా నిలిచారు. హైదరాబాద్‌ తెలంగాణకే దక్కాలని కోరారు. హైదరాబాద్ ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు విభజించాలనే వాదనను ఆయన ఖండించారు. భాగ్యనగర ఆదాయం పూర్తిగా తెలంగాణకే దక్కాలని జైట్లీ వాదించారు. ఆదాయాన్ని పంచడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతామయని, న్యాయపరమైన చిక్కులు తప్పవని హెచ్చరించారు. 
జైట్లీకి తెలుగు రాష్ట్రాల్లో అనుబంధం

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా లేదా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న ప్రతిపాదనలను ఆయన సమర్థించలేదు. రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. అరుణ్ జైట్లీ కూడా ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల డిమాండ్‌తో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. 2014 ఎన్నికల్లో గెలుపొందిన ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రి అయ్యారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ నేతలు డిమాండ్ చేసినప్పటికీ.. హోదా ఇవ్వలేమని జైట్లీ చెప్పారు. ప్రత్యేక హోదా స్థానంలో అవే ప్రయోజనాలతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. ఈ విషయంలో వెంకయ్య, జైట్లీ బాబును ఒప్పించారు. దీంతో చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ఈ విషయంలో మరో ఆలోచనకు తావు లేదని జైట్లీ వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ ఎన్డీయే నుంచి బయటకొచ్చింది. ఈ వ్యవహారం పట్ల స్పందించిన జైట్లీ.. చంద్రబాబు తొందర పడ్డారన్నారు.