ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం దిశగా అడుగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం దిశగా అడుగులు

న్యూఢిల్లీ, ఆగస్టు 19 (way2newstv.com)
ఎన్నికల సంఘం ఓటర్లకు షాకివ్వనుంది. మరీముఖ్యంగా ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు కలిగిన వారికి భారీ ఝలక్ తగలనుంది. ఎందుకంటారేమో.. ఎలక్షన్ కమిషన్ మీ ఆధార్ వివరాలను ఉపయోగించుకోనుంది. ఈసీ దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. ఎన్నికల సంఘం కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకున్న వారు, అలాగే ఇప్పటికే ఓటు హక్కు కలిగిన వారి ఓటర్ ఐడీ వివరాలను ఆధార్‌తో సరిచూడనుంది. అంటే ఓటర్‌ కార్డుతో ఆధార్ అనుసంధానం జరగనుంది. దీంతో మీకు ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉంటే అప్పుడు ఒకటి మినహా మిగతావన్నీ రద్దవుతాయి. 
ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం దిశగా అడుగులు

ఇది మంచి నిర్ణయమనే చెప్పాలి. ఇప్పటికే ఓటు హక్కు కలిగిన, లేదా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి ఆధార్ వివరాలు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీ తాజాగా న్యాయ శాఖకు లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతి ఇస్తే అప్పుడు ఆధార్-ఓటర్ అనుసంధానం అనివార్యం అవుతుంది. దీంతో ఎక్కువ ఓట్లు కలిగిన వారికి భారీ ఝలక్ తగులుతుంది. ఎన్నికల కమిషన్ గతంలోనే ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి ప్రయత్నించింది. అయితే 2015 ఆగస్ట్‌లో ఆధార్ కార్డుపై సుప్రీం కోర్టు తీర్పుతో ఈసీ ఆధార్-ఎలక్టోరల్ డేటా అనుసంధానానికి బ్రేకులు పడ్డాయి. పోల్ ప్యానెల్ అప్పుడు నేషనల్ ఎలక్ట్రోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథంటికేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆధార్ వివరాలు సేకరించింది. ఓటర్ కార్డులో తప్పులు లేకుండా చూసేందుకు, అలాగే ఎక్కువ కార్డులకు దరఖాస్తు చేసుకోకుండా నియంత్రించేందుకు ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈసీ ఆధార్ వివరాలు తీసుకోవాలంటే ఎలక్ట్రోరల్ చట్టానికి సవరణలు చేయాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు.