సోరంగ మార్గం మారిపోయిందోచ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సోరంగ మార్గం మారిపోయిందోచ్

విజయవాడ, ఆగస్టు 9, (way2newstv.com)
విజయవాడ, చిట్టినగర్ నుండి హైదరాబాద్ జాతీయరహదారిని కలిపే మార్గంలో ఉన్న సొరంగం ఇది. నగర శివారు ప్రాంతాలైన భవానీపురం, విద్యాధరపురం, కబేళా పరిసర ప్రాంత వాసులు అతి తక్కువ సమయంలో నగరంలోకి రావడానికి ఉన్న ఏకైక మార్గం సొరంగం. అయితే మనకు తెలిసిన సొరంగం వేరు, ఇప్పుడు వేరు. విజయవాడ మొత్తాన్ని పరిశుభ్రంగా తాయారు చేస్తున్న చంద్రబాబు, సొరంగ మార్గాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సొరంగం మొత్తం, లోపల భాగంలో అందమైన రంగులతో నింపారు. కళంకారీ పెయింటింగ్స్ వేస్తున్నారు. పనులు చాలా వరకు అయిపోయాయి. ఇంకా కొంత మేర పెయింటింగ్స్ వెయ్యాల్సి ఉంది.కేఎల్‌ రావు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ సొరంగ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. 
సోరంగ మార్గం మారిపోయిందోచ్

60వ దశకంలో నిర్మాణమైన ఈ సొరంగ మార్గం, అప్పట్లో విజయవాడకు బెజవాడ అనే పేరు రావడానికి ఈ సొరంగమే కారణమనే వాదనలు ఉన్నాయి. ఈ సొరంగం పూర్తయ్యే నాటికి విజయవాడలో అక్షరాస్యుల శాతం చాలా తక్కువని, గ్రామీణుల రాకపోకలు ఎక్కువగా ఉండేవని చెబుతారు. దీంతో గ్రామీణులు అప్పట్లో ఈ సొరంగాన్ని బెజ్జంగా వ్యవహరించేవారు. బెజ్జం ఉన్న ఊరు కాబట్టి విజయవాడ కాస్తా, బెజ్జంవాడగా, కాలక్రమంలో బెజవాడగా విజయవాడ బాగా ప్రసిద్ధి చెందిందనేది వారి వాదన.స్వచ్ఛ భారత్‌లో బెజవాడ బెస్ట్‌ సిటీగా నిలిచింది అంటే కారణం, ఇలా సిటీ మొత్తం అందంగా తీర్చిదిద్దితేనే. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొత్తం 4 వేల నగరాలు పోటీపడ్డాయి. వీటిని అధిగమించి మరీ విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం నగరంలో దాదాపు పదిహేను రోజులపాటు విజయవాడలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. డంపింగ్‌ యార్డులో ఏర్పాటు చేసిన బయోమైనింగ్‌ ప్రాజెక్టు, వీవీడీ అనే ప్రైవేటు సంస్థ ద్వారా చేపట్టిన భవన నిర్మాణాల వ్యర్థాలతో టైల్స్‌ తయారీ సంస్థ ఏర్పాటు వంటి వాటితో పాటు నగరంలో పారిశుధ్యం దిశగా చేపట్టిన చెత్త సేకరణ, కమర్షియల్‌ ప్రాంతాల్లో చెత్త సేకరణకు తీసుకున్న చర్యలు, డంపింగ్‌ యార్డు నిర్వహణ, స్మార్ట్‌ డంపర్‌ బిన్లు, చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న స్మార్ట్‌ వాహనాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.నగరంలోని చెత్తసేకరించే అన్ని ప్రాంతాలను పర్యవేక్షించేందుకు వినూత్నంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు రహదారుల పక్కన చెత్త లేకుండా ఎప్పటికప్పుడు తరలించడం, తడి, పొడిచెత్తను వేర్వేరుగా సేకరించడం, ప్రజా మరుగుదొడ్లను ఆధునికీకరించడం, నగరంలోని పాఠశాలల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛకార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం, కాలువల పక్కన సుందరీకరణ, ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చడం, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా వాలంటీర్లను ఏర్పాటు చేయడం, ప్రజలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయడం వంటివి చర్యలు చేపట్టారు.మరోవైపు నగరంలోని కూడళ్లన్నింటినీ అందంగా మారుస్తూ ఫౌంటేన్లు, గ్రీనరీని పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. రహదారులకు ఇరువైపులా ఉన్న గోడలన్నింటినీ అందమైన చిత్రాలతో అలంకరించారు. వాణిజ్య సముదాయాల వద్ద తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేకంగా డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేశారు. నిత్యం సేకరించే తడి చెత్తనున ఎరువుగా మార్చేందుకు నగరంలోని రైతుబజార్లు, కూరగాయల మార్కెట్ల వద్ద 11 ప్రాంతాల్లో కంపోస్టుయార్డులను ఏర్పాటు చేశారు. ఆటోనగర్‌, విద్యాధరపురం ప్రాంతాల్లో రెండు పెద్ద కంపోస్టు యార్డులను నెలకొల్పారు. నగరంలో 550 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తుండగా.. దీనిలో 200 మెట్రిక్‌ టన్నుల తడి చెత్త ఉంటోంది. ఈ చెత్త మొత్తం ప్రస్తుతం కంపోస్టు ఎరువుగా మారుస్తున్నారు.