కడప, ఆగస్టు 22, (way2newstv.com)
కలివికోడి ఆచూకీ కోసం తాజాగా మరో స్వచ్చంద సంస్థ రంగంలోకి దిగింది. పొడవైన సన్నని నల్లని కాళ్లు, మెడ కింద హారంలా ఎర్రటి చారలు, నల్లని పొడవైన ముక్కు కలిగి ఉన్న కలివికోడి ఆచూకీ కనుగొనేందుకు బెంగళూరుకు చెందిన ఎట్రీ సంస్థ ముందుకొచ్చింది. అటవీశాఖ అధికారుల సహకారంతో లంకమల అడవుల్లో కెమెరాలు, వాయిస్ రికార్డర్లు అమర్చి కలివికోడి ఆచూకీ కనుగొనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.ఎక్కువగా కలేపండ్ల పొదల్లో ఆవాసం ఉండే కలివికోడి రాత్రివేళ మాత్రమే సంచరిస్తుంది. దీని ఆచూకీ కోసం లంకమల అభయారణ్యంలో ఇప్పటికే కోట్లు ఖర్చుచేశారు. ముంబాయికి చెందిన నేచురల్ హిస్టరీ సొసైటీ, లండన్ సొసైటీ, రాయల్ సొసైటీలు పరిశోధనలు చేశాయి.
కడప జిల్లాల్లో కలివికోడి కలకలం
జిల్లాలోని అట్లూరు, బద్వేలు మండలాల పరిధిలో విస్తరించిన లంకమల అభయారణ్యంలో ఈ కలివికోడిని గతంలో సిద్దవటంకు చెందిన ఒక వ్యక్తి కనుగొన్నారు. దురదృష్టవశాత్తు ఆ పక్షి మరుసటి రోజు ఉదయానికే చనిపోయింది. దాన్ని కలివికోడిగా గుర్తించిన పక్షి శాస్తవ్రేత్తలు దానిపై పరిశోధనలు ప్రారంభించారు. ప్రపంచంలో అంతరించిపోయిందనుకున్న పక్షి తిరిగి కనిపించడం పక్షి శాస్తవ్రేత్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన శాస్తవ్రేత్తలు జగన్నాధం, సుమంత్‌మాలీ ముంబాయి నుంచి వచ్చి ఇక్కడ పరిశోధనలు చేశారు. కలివికోడి పరిరక్షణ, పరిశోధన కోసం రూ.3 లక్షలతో కొండూరు గ్రామం వద్ద పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. కలివికోడి అనే్వషణకు రూ.55.46 లక్షలు మంజూరయ్యాయి. రూ.20 లక్షలతో అడవిలో కెమెరాలు ఏర్పాటు చేశారు. కలివికోడి ఆవాస ప్రాంతం అభివృద్ధికి రూ.2.5 లక్షలు కేటాయించారు. ప్రచారం, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూ.1.3 లక్షలు ఖర్చు చేశారు. అయినా ఆచూకీ లభించలేదు.170 యేళ్లలో కలివికోడి కనిపించింది కేవలం మూడుసార్లు మాత్రమే. 170 యేళ్ల క్రితమే ఈపక్షి ప్రపంచంలో అంతరించిపోయిందని పక్షి శాస్తవ్రేత్తలు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈపక్షిని మొట్టమొదటిసారి 1848లో డా.్థమస్ జర్దాన్ కోర్సర్ కడప-నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో గుర్తించారు. ఆయన గౌరవార్థం ఈపక్షిని జోర్దాన్ కోర్సర్‌గా పిలుచుకున్నారు. తిరిగి 1900లో హోవార్డ్ క్యాంప్‌బెల్ అనంతపురం జిల్లా అడవుల్లో పెన్నానది పరివాహక ప్రాంతంలో ఈపక్షిని కనుగొన్నారు. ఆ తర్వాత మూడవసారి 1986లో కడప జిల్లాలోని లంకమల అడవుల్లో ఈపక్షి కనిపించింది. అట్లూరు మండలం రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఐతన్న ఈపక్షిని పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించాడు. దీన్ని కలివికోడిగా గుర్తించిన వారు అంతకుముందే పరిశోధనలు చేస్తున్న బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ వారికి సమాచారం ఇచ్చారు. దురదృష్టవశాత్తు వచ్చేలోపు ఈపక్షి చనిపోయింది.కలివికోడి పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు వ్యవసాయ భూమిగా కేటాయించిన బద్వేలు, అట్లూరు మండలాల్లోని డీకేటీ భూములు 4వేల ఎకరాలను 2008లో రూ.28 కోట్ల పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుంది. వీటిని లంకమల అభయారణ్యంలో చేర్చి కలివికోడి పరిరక్షణ భూ భాగంగా పరిగణిస్తున్నారు. మొత్తం 8,157 హెక్టార్ల విస్తీర్ణ అటవీప్రాంతాన్ని కలివికోడి ఆవాస ప్రాంతంగా పరిగణిస్తున్నారు. పరిశోధనలు చేస్తున్న స్వచ్చంద సంస్థలు అమెరికా నుంచి మూడు విడతలుగా 170 కెమెరాలు తెప్పించి ఈ అటవీప్రాంతంలో అక్కడక్కడ ఏర్పాటుచేశారు. అయినా కలివికోడి ఆచూకీ లభ్యం కాలేదు.కలివికోడి పరిరక్షణ కోసం తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన కాలువ అలైన్‌మెంట్‌ను కూడా మార్చారు. ఈమార్పు వల్ల తెలుగుగంగ ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాల ఆయకట్టు కూడా తగ్గిపోయింది.అంతకుముందు కలివికోడిపై పరిశోధనలు చేసిన స్వచ్చంద సంస్థలు ఇటీవల తమ పరిశోధనలను తగ్గించాయి. అప్పటి శాస్తవ్రేత్తలకు వయస్సు మీద పడటం వంటి అనేక కారణాలతో కలివికోడి కోసం అనే్వషణ దాదాపు మందగించింది. తాజాగా బెంగళూరుకు చెందిన ‘అశోక్ ట్రస్టు ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరానె్మంట్ ’ (ఏటీఆర్‌ఈఈ) సంస్థ రంగంలోకి దిగింది. అటవీశాఖ వీరికి సహకారం అందిస్తోంది. ఆర్థికమైన భారమంతా ఏట్రీనే భరిస్తోంది. గతంలో ఉన్న కెమెరాలకుతోడు మరిన్ని కెమెరాలు, కొత్తగా వాయిస్ రికార్డర్లు ఏర్పాటుచేశారు.కలివికోడి స్వర శబ్దాల రికార్డు ఇప్పటికే అటవీశాఖ, గతంలో పరిశోధన చేసిన స్వచ్చందసంస్థల వద్ద ఉంది. కొంతమంది ఈ కలివికోడి అరుపులను సెల్‌ఫోన్ రింగ్‌టోన్‌గా కూడా వాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటుచేసిన వాయిస్ రికార్డర్ల వల్ల కలివికోడి ఎక్కడైనా ఉంటే దాని అరుపులు రికార్డు అవుతాయని భావిస్తున్నారు.