యడ్డీకి సీనియర్ల నుంచి తలనొప్పి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యడ్డీకి సీనియర్ల నుంచి తలనొప్పి

బెంగళూర్, ఆగస్టు 20 (way2newstv.com)
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 20 రోజుల తర్వాత మంగళవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టిన యడియూరప్పకు సీనియర్ల నుంచి తలనొప్పి మొదలైందా? తాజా మంత్రివర్గ విస్తరణపై పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందా? ఇందుకు అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. సొంత పార్టీకి చెందిన వారు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పటికీ బీజేపీకి చెందిన ఉమేష్ కట్టి, మురుగేష్ నిరాని, బాలచంద్ర జార్కిహోలి, రేణుకాచార్య, బసవరాజ్ పాటిల్ యత్నాల్ వంటి సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
యడ్డీకి సీనియర్ల నుంచి తలనొప్పి

మంత్రుల జాబితా తనకు ఆశ్చర్యాన్ని, బాధను కలిగించిందని కేబినెట్ విస్తరణలో మంత్రి పదవిని ఆశించి భంగపడిన చిత్రదుర్గ బీజేపీ ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఇది నాలుగోసారి. భావసారూప్యం కలిగిన ఎమ్మెల్యేలతో మరికొద్ది రోజుల్లోనే సమావేశమై పార్టీకి విధేయులైన శానససభ్యులను మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తామని, భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చిస్తామని రెడ్డి చెప్పారు. కాగా, చిత్రదుర్గలో తిప్పారెడ్డి మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. తమ నాయకుడికి పార్టీ అధిష్ఠానం న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సిటీలోని గాంధీ సర్కిల్‌ రోడ్లపై టైర్లు తగలబెట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు పాక్షికంగా అంతరాయం కలిగింది. మంత్రి పదవి ఇవ్వకపోవడంపై బీజేపీకి చెందిన మరో ఎమ్మెల్యే ఎస్.ఆంగర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో తాను ఎప్పుడూ విలువలకు కట్టుబడి ఉన్నానని, ఇప్పుడు ఆ విలువలకే గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమేష్ కట్టి, మాజీ మంత్రి బసవరాజ్ పాటిల్, తదితర సీనియర్ నేతలు సైతం కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండిపోయారు. ఈ ప్రభావం భవిష్యత్తులో పార్టీపై పడే అవకాశాలు లేకపోలేదని వారి అనుయాయులు చెబుతున్నారు. మంత్రివర్గంలో కోస్టల్ కర్ణాటక, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించలేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు బీజేపీ నేతలు తెలిపారు.