ఇష్టారాజ్యంగా ఫీజులు
నెల్లూరు, ఆగస్టు 6, (way2newstv.com)
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పలు నోటిఫికేషన్లు...కోచింగ్ సెంటర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యంతో నిరుద్యోగులంతా కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. దీంతో ఏ కోచింగ్ సెంటర్లో చూసినా అభ్యర్థులతో కిటకిటలాడుతున్నారు. ఇదే అదునుగా ఆయా సెంటర్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మరోవైపు కనీస సౌకర్యాలు కల్పించకుండా నిరుద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే లక్షలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో దాదాపు 8,545 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్–5) పోస్టులు 571, ఏఎన్‌ఎం/మల్టీపర్సస్ పోస్టులు 1,041, హెల్త్ అసిస్టెంట్ వీఆర్‌ఓ (గ్రేడ్–2) 384, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులు 19, పశుసంరక్షణ అసిస్టెంట్ పోస్టులు 805, ఉద్యానశాఖలో అసిస్టెంట్లు 483, వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ పోస్టులు 282, మహిళా పోలీస్ పోస్టులు 1,217, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 159, డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ(సెక్రటరీ గ్రేడ్–6) పోస్టులు 896, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు 896, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ పోస్టులు 896, విలేజ్ సర్వేయర్ పోస్టులు 896 భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో కోచింగ్ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగం తెచ్చుకోవాలనే లక్ష్యంతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. నెలరోజులు మాత్రమే గడువు ఉండటంతో శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు కోచింగ్ తీసుకునేందుకు జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. ఇదే అదనుగా జాబ్ గ్యారెంటీ పేరుతో కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆర్భా ట ప్రచారాలు చేస్తూ నిరుద్యోగులకు వల వేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి నిపుణులను రప్పించి ప్రత్యేశ శిక్షణ ఇప్పిస్తామంటూ ఆశలు పెడుతున్నారు. నెల రోజుల శిక్షణకు రూ.8 వేల దాకా ఫీజు ఫిక్స్ చేశారు. హాస్టల్ వసతి కావాలంటే మరో రూ.3,500 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై అధికారులకు నియంత్రణ లేదు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కోచింగ్ సెంటర్లను ఏ అధికారీ పర్యవేక్షించరు. ఇవి ఎవరి పరిధిలోకి వస్తాయనే విషయంపై అధికారులకే స్పష్టత లేదు. ఇదే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కలిసి వస్తోంది. అధికారులు పట్టించుకోకపోవడం, శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు నోరు మెదపకపోవడంతో ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. పైగా కనీస సౌకర్యాలు కల్పించడం లేగు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోచింగ్ సెంటర్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుని, కనీస సదుపాయాలు కల్పించేలా చూడాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు.
Tags:
Andrapradeshnews