చిక్కిపోతున్న బాల సంజీవని (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చిక్కిపోతున్న బాల సంజీవని (పశ్చిమగోదావరి)

ఏలూరు, ఆగస్టు 24(way2newstv.com): 
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించాలనే సంకల్పంతో అంగన్‌వాడీల్లో ప్రారంభించిన బాల సంజీవని కార్యక్రమం సక్రమంగా అమలు కావడం లేదు. పోషకాహార కిట్లు అంగన్‌వాడీ కేంద్రాలకే వెళ్లడం లేదు. గడువు ముగిసినా కొత్త టెండర్లు పిలవలేదు. పాలకుల నిర్లక్ష్యం, ఉన్నతస్థాయి అధికారుల నిర్లిప్తత.. కారణాలు ఏవైనా కావచ్చు పోషకాహారం అందక బాలింతలు, గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు.  జిల్లాలో బాల సంజీవని కార్యక్రమంలో భాగంగా రక్తహీనత కలిగిన గర్భిణులు, బాలింతలు ఒకపూట మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రోజూ 200 మి.లీ. పాలు, ఒక కోడిగుడ్డు, పప్పు భోజనంతోపాటు అదనంగా రాగిజావ కోసం రాగిపిండి, బెల్లం, ఎండు ఖర్జూరం తదితరాలు అందజేస్తున్నారు. 
చిక్కిపోతున్న బాల సంజీవని (పశ్చిమగోదావరి)

గత ప్రభుత్వ హయాంలో ఈ పోషకాహార జాబితాలో కొన్ని మార్పులు చేసి ప్రత్యేక కిట్లు పంపిణీ చేశారు. అలా ఒక్కొక్కరికి కిలో ఖర్జూరం, అరకిలో బెల్లం, కిలో రాగిపిండి, బెల్లం పాకంతో కూడిన శనగ చెక్కలు 25 చొప్పున అందించేవారు. కొన్నేళ్లు సక్రమంగా పంపిణీ జరిగినా కొంతకాలంగా సరఫరాలో ఇబ్బందులు ఏర్పడటంతో నిర్వహణ కుంటుపడిందని లబ్ధిదారులు వాపోతున్నారు. పోషకాహారలోపం, రక్తహీనత సమస్యలతో అవస్థలు పడుతున్న వారిని ప్రత్యేక పరీక్షల్లో గుర్తించి ఈ కార్యక్రమానికి అర్హుల జాబితాను రూపొందించారు. ప్రతి 15 రోజులకోసారి కిట్‌ అందించేవారు. ఇందులో ఇచ్చే ఆహారంలో కాల్షియం, పొటాషియంతోపాటు విటమిన్లు విరివిగా ఉంటాయన్నది నిపుణుల మాట. పిల్లలు ఆరోగ్యకరంగా పుడతారనే ఉద్దేశంతో గర్భిణులు కూడా ఈ ఆహారం తీసుకునేందుకు సుముఖత చూపారు. ప్రస్తుతం ఈ కిట్ల సరఫరా నిలిచిపోవటంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాస్థాయిలో తీసుకునే నిర్ణయం కాకపోవటంతో సమస్యను ఎవరి దృష్టికి తీసుకువెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది.గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ కిట్ల టెండర్లకు సంబంధించిన గడువు ఈ ఏడాది జూన్‌తోనే ముగిసిందని అధికారులు చెబుతున్నారు. జులై వరకు తాత్కాలికంగా పొడిగించినా సరఫరా జరగడం లేదనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ టెండర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలని ఐసీడీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో టెండర్లు ఖరారు చేసే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కిట్ల పంపిణీ జరగటం లేదని క్షేత్రస్థాయిలో పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. ఈ కార్యక్రమం పునఃప్రారంభమైతే గతంలో మాదిరే కొనసాగుతుందా లేక మార్పులు, చేర్పులతో కొత్తరూపు సంతరించుకుంటుందా, లేక పూర్తిగా నిలిచిపోతుందా అనే అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ కిట్ల పంపిణీ నిలిచిపోతే లబ్ధిదారులు నష్టపోవడమే కాక సరైన పోషకాహారం లేక రక్తహీనత తదితర సమస్యలతో బాధపడాల్సి వస్తుందని గర్భిణులు, బాలింతలు వాపోతున్నారు.