వరికి ఉరి (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వరికి ఉరి (కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, ఆగస్టు 24 (way2newstv.com): 
వ్యవసాయాన్ని ఆక్వా రంగం కబళిస్తోంది. వేలాది ఎకరాల్లోని పచ్చని పొలాలు చెరువులుగా రూపాంతరం చెందుతున్నాయి. చెరువుల తవ్వకాలకు నిబంధనలు సడలించడంతో పాటు ఆక్వాను ప్రోత్సహించే దిశగా అడుగులు వేయడంతో వందలు.. వేలు...లక్షల ఎకరాలకు విస్తరించింది. జిల్లాలోని కలిదిండి, మండవల్లి, కైకలూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి, నందివాడ, ముదినేపల్లి, గుడివాడ, మచిలీపట్నం, కోడూరు, నాగాయలంక తదితర మండలాల్లో ఆక్వాసాగు బలంగా వేళ్లూనుకుంటోంది. ఇది మరిన్ని మండలాలకు విస్తరిస్తోంది. ఈ మండలాల్లో ఒక్క ఎకరం వ్యవసాయ భూమి లేని గ్రామాలు సుమారు 70 వరకు ఉన్నాయి. వీటిలో పూర్తిగా చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారు. 
వరికి ఉరి (కృష్ణాజిల్లా)

ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో మిగిలిన గ్రామాలకు విస్తరించే అవకాశం ఉంది. కొండూరు, కాళ్లపాలెం, పోతుమర్రు, భాస్కరరావుపేట, మట్టగుంట, మూలలంక, పెదలంక, సంతోషపురం, కొండంగి, కొవ్వాడలంక, మణుగులూరు, చింతపాడు, శింగనపూడి, నందిగామలంక, పెనుమాకలంక, ఉనికిలి, ఇంగిలిపాకలంక, పుట్లచెరువు, చింతలపూడి, లోకుమూడి, చావలిపాడు, నుచ్చిమిల్లి, కైకలూరు, ఆటపాక, గోనెపాడు, చెటాకాయ్, భుజబలపట్నం, దొడ్డిపట్ల, గోపవరం, పల్లెవాడ, ఆలపాడు, కొట్టాడ, సోమేశ్వరం, పెంచికలమర్రు, పందిరిపల్లిగూడెం, కొల్లేటికోట, గుమ్మళ్లపాడు, శృంగవరప్పాడు గ్రామాల్లో వరిసాగు పూర్తిగా లేదు.ప్రస్తుతానికి ఆహార ధాన్యాల కొరత లేకపోయినా.. వరిసాగు క్రమంగా తగ్గుముఖం పట్టడం వల్ల మున్ముందు అనేక దుష్ఫలితాలు సంభవిస్తాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.  జనాభా పెరుగుదల శాతం గణనీయంగా వృద్ధి చెందుతోంది. వారికి తగిన స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరగాల్సి ఉంది. అందుకు భిన్నంగా సాగు విస్తీర్ణం తరిగిపోవడం వల్ల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది. దీంతో మారక ద్రవ్యాల విలువలు తగ్గుతాయి. తిండి గింజల ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది.  వ్యవసాయ ఆధారిత కూలీలకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. ఫలితంగా కూలీల కుటుంబాలు వలస బాట పట్టక తప్పదు.  వ్యవసాయంలో నామమాత్రంగానే ఎరువులు, రసాయనాల వినియోగం ఉంటుంది కాని ఆక్వా పరిశ్రమలో ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్న రసాయనాలతో భూమి, గాలి, పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. పరిమితికి మించి ఆక్వా విస్తరించడం వల్ల భూగర్భ, భూ ఉపరితల జలాలు కలుషితంగా మారే అవకాశం ఉంది. జిల్లాలో పదిహేనేళ్ల కిందట సుమారు 7.38 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేసేవారు. దానిలో అయిదు లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఏటికేడు ఈ విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. గత అయిదేళ్లలో గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రెండు లక్షల ఎకరాల్లో ఆక్వాసాగు విస్తరించింది. ఈ లెక్కన దాదాపు మూడు లక్షల ఎకరాల్లో మాత్రమే వరి వేస్తున్నారు. రానున్న అయిదేళ్లలో ఈ విస్తీర్ణం మరింతగా పడిపోయే అవకాశం ఉంది. సాగునీరు.. గిట్టుబాటు ధరరైతు ఉనికికి మూలమైనవి సాగునీరు, గిట్టుబాటు ధరే. ఇవి రెండూ లేనప్పుడు పుట్టెడు అప్పులే మిగులుతాయి. మాగాణిపై మమకారంతో.. వరి కంకులపై ప్రేమతో అష్టకష్టాలకోర్చి వ్యవసాయాన్నే నమ్ముకుంటూ కాలం నెట్టుకొస్తున్న రైతులకు వర్షాభావ పరిస్థితులు శాపంగా మారాయి. పంట సమయంలో కృష్ణమ్మ పొడిబారి పోతుండడంతో పొలాలు బీటలు వారిపోవడం.. సాగునీటికి ఎదురుచూసిన రైతు కంట తడి ఆరిపోవడం పరిపాటిగా మారిపోయింది. ప్రత్యామ్నాయం కోసం దిక్కులు చూస్తున్న రైతులకు ఆక్వా రంగం ఆకట్టుకుంది.