పేరుకే ఆర్వో వాటర్.. (కర్నూలు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పేరుకే ఆర్వో వాటర్.. (కర్నూలు)

కర్నూలు, ఆగస్టు 24 (way2newstv.com): 
వసతిగృహ విద్యార్థులకు శుద్ధజలం కలగా మారింది. అధికారులు ఆగమేఘాల మీద వాటిలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చాలా వసతిగృహాల్లోని బోర్లలో నీరు అందుబాటులో లేకపోవడం.. కొన్నింటిలో అరకొరగా నీరు ఉండటం, ప్రత్యామ్నాయ నీటి వనరులు అన్వేషించకుండా శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేసి వదిలేయడంతో నిధులు వృథా కావడమేకాక విద్యార్థుల నీటికష్టాలు షరా మామూలయ్యాయి. జిల్లాలో 54 ఎస్సీ వసతిగృహాలు, 21 కళాశాలలకు చెందిన మేనేజ్‌మెంట్‌ వసతిగృహాలు ఉన్నాయి. వాటిల్లో 14 వేల మందికి పైగా విద్యార్థులు వసతి పొందుతున్నారు. 
 పేరుకే ఆర్వో వాటర్.. (కర్నూలు)

విజిలెన్స్‌ ఎస్పీ శివకోటి బాబు విచారణ చేసి అప్పటి కలెక్టర్‌ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లి జిల్లా మైనింగ్‌ నిధుల(డీఎంఎఫ్‌)తో ఈ ఏడాది మార్చిలో 74 వసతిగృహాల్లో రూ.కోటి వరకు ఖర్చు చేసి శుద్ధజల ప్లాంట్లను ఏర్పాటు చేశారు. చాలా వాటిల్లో బోర్లు వేసినా.. అందులో నీరు పడక.. కొన్నింటిలో తక్కువ నీరు పడటంతో ఆ వసతిగృహాల్లోని విద్యార్థులకు సురక్షిత నీరు కరవైంది. ఒక్కో శుద్ధజల ప్లాంటుకు రూ.1.75 లక్షలతో ప్రతిపాదించగా, అందులో జీఎస్టీ, పన్ను పోగా రూ.1.46 లక్షలతో ప్లాంటు ఏర్పాటు చేశారు. ఆర్వో సిస్టమ్‌ కంట్రోల్‌ ప్యానల్, రెండు బ్లూకలర్‌ ఫిల్టర్లు, 500 లీటర్ల స్టీల్‌ ట్యాంకులను సమకూర్చారు. మూడేళ్లపాటు కంపెనీల సిబ్బంది సర్వీసు బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. వాటితోపాటు అదనంగా బోరు ఏర్పాటు చేసి కనెక్షన్‌ ఇచ్చిఉంటే శుద్ధజలం అందే అవకాశం ఉండేది. పలు కంపెనీల ప్లాంట్లను ఏర్పాటు చేసినా వారికి ఇంకా నిధులు మంజూరు కాలేదంటున్నారు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు. ఎస్సీ వసతిగృహాల్లో ఆర్వో ప్లాంట్లతోపాటు బోర్లు వేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పలుచోట్ల సమృద్ధి నీరు పడలేదు. కొన్నింటిలో పడినా అవి ఎటూసరిపోక ప్లాంట్లు వృథాగా మారాయనడంలో సందేహం లేదు. ప్రత్యామ్నాయంగా పంచాయతీలు, పురపాలక అధికారులతో మాట్లాడి కుళాయిలు, నీటి గొట్టాలు ఏర్పాటు చేయించడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించి ప్లాంట్లను వినియోగించడం గానీ, అదనంగా బోర్లు వేసి నీటి కేంద్రాలు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఓ కంపెనీ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుని వసతిగృహాల్లో బోర్లు వేసి అందులో నీరున్నా లేకున్నా ప్లాంట్లను ఏర్పాటు చేసి వెళ్లారు. తర్వాత బోర్లలో నీరుందా, ప్లాంట్లు వినియోగిస్తున్నారా లేదా అని పరిశీలించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రత్యామ్నాయంగా నీటి వనరులను పరిశీలించి ప్లాంట్లను వినియోగంలోకి తీసుకొస్తే విద్యార్థులు సురక్షిత నీటిని తాగి వారి ఆరోగ్యాలను పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. నీటి కేంద్రాలు మరమ్మతులకు గురైతే సంబంధిత కంపెనీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాక మరమ్మతులు చేయడంలో తీవ్ర జాప్యం వహిస్తుండటంతో ఆయా వసతిగృహాల సంరక్షకులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మూడేళ్లపాటు ఉచిత సర్వీసు ఇవ్వాలనే నిబంధన ఉన్నా వారు పట్టించుకోకపోవడం గమనార్హం.