దివిసీమలో డీఆర్ డివో కేంద్రం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దివిసీమలో డీఆర్ డివో కేంద్రం

విజయవాడ, ఆగస్టు 19 (way2newstv.com)
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండో క్షిపణి పరీక్ష కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఏర్పాటుచేస్తున్నారు. నాగాయలంక మండలంలోని గుల్లలమోదలో క్షిపణి పరీక్ష కేంద్రానికి ఆగస్టు 26న శంకుస్థాపన చేయనున్నారు. దీని నిర్మాణానికి 154.42 హెక్టార్ల భూమికి సంబంధించి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవలే అనుమతులు ఇచ్చింది. తాజాగా డీఆర్‌డీఓ అధికారి లెఫ్టినెంట్‌ కల్నల్‌ తిమ్మయ్య నేతృత్వంలోని బృందం  కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ను కలిసి, శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని వివరించారు. 
దివిసీమలో డీఆర్ డివో కేంద్రం

అనంతరం గుల్లమోదలో పర్యటించిన అధికారులు నాగాయలంక వద్దనున్న ఓఎన్జీసీ హెలిప్యాడ్‌ను పరిశీలించారు. వరదల నేపథ్యంలో వేదికను ఖరారు చేశారు. కాగా, దివిసీమ ప్రజల అభివృద్ధి కల సాకరం కానుండటంతో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. ఈ ప్రాజెక్టకు కీలకమైన అనుమతుల గురించి గతేడాది కేంద్రప్రభుత్వ సైంటిఫిక్‌ అడ్వయిజర్‌ సతీష్‌రెడ్డి, ఢిల్లీలోని ఏపీ భవన్ కమిషనర్‌ డాక్టర్‌ అర్జా శ్రీకాంత్‌ విశేషంగా కృషి చేశారు. క్షిపణి ప్రయోగ కేంద్రానికి ఆరేళ్లుగా డీఆర్‌డీవో అధికారులు, అటవీశాఖ అత్యున్నత అధికారులు గుల్లలమోద, లైట్‌హౌస్‌ ప్రాంతాల్లో పలుమార్లు పర్యటించి అవసరమైన వనరుల పరిస్థితిని అధ్యయనం చేశారు. సముద్రతీరంలో గాలివేగం, అత్యాధునిక భూ పరిశోధనలు ముగించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు ఆటంకంగా నిలిచిన అటవీశాఖ, రెవెన్యూ వర్గాల ఒప్పందాలు కొలిక్కి రావడంతో 381ఎకరాల భూమి అప్పగింత కార్యక్రమం రెండేళ్ల క్రితం పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూములకు 112మంది రైతులకు రూ.5కోట్ల పైచిలుకు పరిహారాన్ని 2018లో చెల్లించారు. ప్రస్తుతం ఒడిశాలోని బాలాసోర్ వద్ద వీలర్ ఐలాండ్ నుంచే అన్ని క్షిపణులను ప్రయోగిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి దేశంలో మరో క్షిపణి ప్రయోగ కేంద్రం అవసరమని డీఆర్‌డీవో నిపుణులు 2012లోనే ప్రతిపాదనలు చేశారు. అందుకు మచిలీపట్టణం సమీపంలోని గుల్లలమోద అనుకూలంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్ర తీరానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంతోపాటు చాందీపూర్ లాంటి వాతావరణ పరిస్థితులు ఉండటంతో క్షిపణి పరీక్షలకు అనువుగా ఉంటుందని డీఆర్డీఓ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. గత విజయదశమి నుంచే పనులు ప్రారంభించాలని భావించినా కుదరలేదు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.1600 కోట్లను కేటాయించగా, తొలి దశలో రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నారు.