మైనర్ డ్రైవింగ్... ఇద్దరు మృతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మైనర్ డ్రైవింగ్... ఇద్దరు మృతి

హైద్రాబాద్, ఆగస్టు 19 (way2newstv.com)
మద్యం సేవించి రాంగ్ రూట్‌లో వాహనం నడిపిన ఓ మైనర్.. ఇద్దరు ప్రాణాలను బలిగొన్న ఘటన హైదరాబాద్ నగరంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇదే ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లి భాగ్యనగర్‌కాలనీకి చెందిన చంద్రశేఖర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. చంద్రశేఖర్‌, సంధ్యాకిరణ్‌ (45) దంపతులకు మహదేవ్‌ (14 నెలలు), మాధవ్‌ కవల పిల్లలు ఉన్నారు. వీరిని చూసుకోడానికి సంధ్యాకిరణ్ తల్లి, రిటైర్డ్ సీడీపీఓ నాగమణి (65) కొద్ది రోజుల కిందటే తన కుమార్తె ఇంటికి వచ్చింది. ఈ నేపథ్యంలో యాప్రాల్‌లో ఉండే తన మేనల్లుడు రంజిత్‌ ఇంటికి వెళ్లేందుకు మనవళ్లు, కుమార్తెతో కలిసి నాగమణి  బయలుదేరింది. కూకట్‌పల్లి నుంచి యాప్రాల్‌కు వెళ్లేందుకు వీరు ఓలా ఆటోను బుక్‌ చేసుకున్నారు. 
మైనర్ డ్రైవింగ్... ఇద్దరు మృతి

వీరు ప్రయాణిస్తోన్న ఆటో డెయిరీ ఫాం క్రాస్‌ రోడ్డు సమీపంలో కంటోన్మెంట్‌ చెక్‌పోస్టు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. అతివేగంగా వచ్చిన మారుతీ కారు అదుపుతప్పి ఆటోతోపాటు వెనక వస్తున్న రెండు బైక్‌లను ఢీకొట్టడంతో మహదేవ్‌, నాగమణి, సంధ్యాకిరణ్‌, ఆటోడ్రైవర్‌, మరో వ్యక్తి రాములు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహదేవ్‌, నాగమణి మృతిచెందారు. సంధ్యాకిరణ్‌, రాజు, రాములు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు, ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడ సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే కారులో నుంచి మద్యం సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాన్ని మైనర్ బాలుడు నడిపాడని, అతడు మద్యం సేవించి ఉన్నాడని స్దానికులు సైతం చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన మైనర్‌ను హసన్‌‌గా గుర్తించిన పోలీసులు, అతడి కోసం గాలిస్తున్నారు.