అద్దె భవనాల్లో...ఆదాయాలను ఇచ్చే శాఖలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అద్దె భవనాల్లో...ఆదాయాలను ఇచ్చే శాఖలు

విజయనగరం, ఆగస్టు 16, (way2newstv.com)
ప్రభుత్వానికి ఏడాదికి వందల కోట్ల రూపాయల ఆదాయం తీసుకువచ్చే జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖకు సొంత భవనాలు లేవు. దీంతో కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆరేడేళ్ల కిందట భవన నిర్మాణాలకు నిధులు మంజూరైనా సకాలంలో పనులు ప్రారంభించకపోవడంతో వెనక్కి మళ్లిపోయాయి. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వం ఎక్సైజ్‌ కార్యాలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తూ ఫిబ్రవరిలో జీఓ జారీ చేసినా భవనాల పనులు మాత్రం ప్రారంభం కాలేదు.ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయాలు జిల్లా కేంద్రంలోని తోటపాలెం, ప్రదీప్‌నగర్‌ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి నెలకు అద్దె రూపంలో వేలాది రూపాయలు పదేళ్లకు పైగా చెల్లిస్తున్నారు. 
అద్దె భవనాల్లో...ఆదాయాలను ఇచ్చే శాఖలు

దీంతోపాటు డీసీ, ఏసీ కార్యాలయాలు కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే ప్రతి ఏడాదీ భవనాలను మారుస్తుండడంతో సిబ్బందికి ఇక్కట్లు తప్పడం లేదు. విజయనగరం ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌ కార్యాలయం కలెక్టరేట్‌ ప్రాంగణంలోని శిథిల గదుల్లోనే నిర్వహిస్తున్నారు.పట్టణంలోని బొగ్గులదిబ్బ ప్రాంతంలో ఉన్న విజయనగరం ఎక్సైజ్‌ స్టేషన్లు– 1, 2 ఉన్న భవనం దశాబ్దాల కిందటి నిర్మించినది కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వర్షాకాలం వస్తే భవనం పైకప్పు ఎప్పుడు కూలిపోతుందోనని అధికారులు, సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. భవనం పెంకులతో నిర్మించినది కావడంతో వర్షం నీరు కారిపోవడం.. తేళ్లు, జెర్రిలు భవనం పైకప్పు నుంచి కార్యాలయాల్లో పడుతుండడంతో సిబ్బంది భయపడుతున్నారు.జిల్లా ఎక్సైజ్‌ డీసీ, ఏసీ, ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌ కార్యాలయాలు, రెండు ఎక్సైజ్‌ స్టేషన్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 4.34 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి  ఫిబ్రవరి 11న జీఓ 255తో జీఓ జారీ చేశారు. దీంతో కంటోన్మెంట్‌ ప్రాంతంలో బొగ్గులదిబ్బ ఎక్సైజ్‌ స్టేషన్ల ప్రాంగణంలో సర్వే 637లో ఉన్న 1.67 ఎకరాల విస్తీర్ణంలో భవన కాంప్లెక్స్‌ నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు. ఇంతలో ఎన్నికల ప్రకటన రావడం.. ఈ నిధులను పుసుపు – కుంకుమ పథకానికి మరలించేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ప్రభుత్వమైనా సొంత భవన నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.