మళ్లీ ఉద్యమాలపై టీడీపీలో భిన్న స్వరాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ ఉద్యమాలపై టీడీపీలో భిన్న స్వరాలు

విజయవాడ, ఆగస్టు 16, (way2newstv.com)
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయి రెండు నెలలు కావస్తుంది. అధికారాన్ని కోల్పోయినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా టెలికాన్ఫరెన్స్ లతో పార్టీ నేతలకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు గడిచిపోయింది. ఈ ఎన్నికలలో ఘోర ఓటమిని చంద్రబాబు చవిచూశారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎప్పుడూ ఇలాంటి ఓటమి ఎరుగరు. ఆ బాధ నుంచి ఆయన ఇంకా తేరుకోలేదు. అయినా సరే పార్టీ నేతలను మాత్రం మిమ్మల్ని వదలనంటూ వెంటపడుతూనే ఉన్నారు. ఇది పార్టీలో చర్చనీయాంశమైంది.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎప్పుడూ మీడియాలో నలగాలన్న తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో తాను పడుతున్న కష్టం ఫోకస్ అవ్వాలని భావిస్తుంటారు. 
మళ్లీ ఉద్యమాలపై టీడీపీలో భిన్న స్వరాలు

జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల గడవకముందే పోరాటాలంటూ కార్యకర్తలకు ఆయన పిలుపునివ్వడంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా అనేక మంది నేతలు ఓటమి నుంచి తేరుకోలేదు. జగన్ పాలనకు ఆరు నెలలు సమయం ఇద్దామని చంద్రబాబే స్వయంగా చెప్పారు.కానీ వరసగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆయువుపట్టుమీద జగన్ దృష్టి పెట్టడంతోనే చంద్రబాబులో అసహనం పెరిగిపోవడానికి కారణం. పోలవరం, పీపీఏ, బందరుపోర్టు కాంట్రాక్టుల రద్దు వంటివి చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాలని నిర్ణయించారు. సహజంగా కొత్త గా ఏర్పడిన ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షిస్తుంది. లోపాలు ఉన్నట్లు తేలితే రద్దు చేస్తుంది. అయితే దానికి అంత యాగీ చేయాల్సిన అవసరం లేదన్నది ఆ పార్టీ నేతల నుంచే విన్పిస్తున్న మాట. చంద్రబాబు మళ్లీ టెలికాన్ఫరెన్స్ లు ప్రారంభించారు. ఈ టెలికాన్ఫరెన్స్ ల్లో నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. స్థానిక సమస్యలపై పోరాటం ప్రారంభించమని పిలుపునిస్తున్నారు. అయితే టెలికాన్ఫరెన్స్ తర్వాత నేతల వైఖరి మాత్రం భిన్నంగా ఉంది. ఎన్నికల సమయంలో కోట్లు వెచ్చించిన నేతలు ఇప్పుడు మళ్లీ ఉద్యమాలంటే ఎవరు ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం జిల్లా కు చెందిన ఒక నేత ఈ ప్రశ్నను సూటిగా పార్టీ సీనియర్ నేతలనే అడిగినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల వరకూ ఓకే గాని, ఉద్యమాలంటే మా వల్ల కాదని, నిత్యం టెలికాన్ఫరెన్స్ లన్నీ కుదరదని కొందరు నేతలు తేల్చి చెబుతున్నారట. మొత్తం మీద చంద్రబాబు మాత్రం గత వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది.