ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు...

జగన్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత క్లారిటీ
విజయవాడ,ఆగస్టు 23, (way2newstv.com)
ఏపీ రాజధాని అమరావతి తరలింపుపై పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. బొత్స వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత టీడీపీ నేతలు ఉలిక్కిపడుతుంటే, రాయలసీమకు చెందిన టీడీపీ, వైసీపీ నేతలు మాత్రం అలా అయితే మా ప్రాంతంలోనే రాజధాని పెట్టడంటూ రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు రాజధాని తరలిపోతుందా అనే అంశంపై  ఏపీ ప్రభుత్వ వర్గాల నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. దీని ప్రకారం రాజధానిగా అమరావతి ఎంపిక విషయంలో తమకు మాటమాత్రమైనా చెప్పకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఏపక్షంగా నిర్ణయం తీసుకున్నారని వైసీపీ అధినాయకత్వం సహా ఆ పార్టీకి చెందిన మెజారిటీ నేతలు భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో రాజధాని మార్పు విషయానికి వచ్చే సరికి మాత్రం పార్టీ నేతల్లో సైతం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 
ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు...

కానీ ప్రభుత్వ పెద్దలు, అధికార వర్గాలు మాత్రం రాజధాని మార్పుపై ఏమాత్రం సుముఖంగా లేవు. అధికార వికేంద్రీకరణ పేరుతో రాజధానిని విస్తృతం చేయాలనే ఉద్దేశం మాత్రం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.ఏపీ రాజధానిగా అమరావతి ఎంపిక నేపథ్యంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులతోనే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులను నిర్మించింది. కానీ అంతకు ముందే తమ పార్టీకి చెందిన ముఖ్య నేతలకు రాష్ట్రంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా వందలాది ఎకరాలు కట్టబెట్టిందనే ఆరోపణలున్నాయి. వైసీపీ కొన్నేళ్లుగా దీన్నే ఇన్ సైడర్ ట్రేడింగ్ గా అభివర్ణిస్తోంది. అంటే రాజధాని ఎక్కడ ఉండబోతోందో ముందుగానే పార్టీ నేతలకు చెప్పి వారిని భారీగా భూములు కొనేలా ప్రోత్సహించడం అన్నమాట. టీడీపీ సర్కారు వ్యవహారశైలి వల్ల తమకు భారీగా నష్టం జరిగిందని అప్పటి నుంచి వైసీపీ నేతలు బాధపడుతూనే ఉన్నారు. అయితే జరిగిందేదో జరిగిపోయింది. అమరావతి ఏపీ రాజధానిగా ఓ ముద్ర అయితే పడిపోయింది. కాబట్టి దాని తరలింపు వ్యవహారం రాజకీయంగా, ఆర్ధికంగా కొందరు టీడీపీ నేతలకు నష్టం చేసే అవకాశమున్నా... ప్రజల దృష్టిలో వైసీపీ ప్రభుత్వం పలుచన కావడం ఖాయం. అందుకే వైసీపీ సర్కారు కూడా ఈ విషయంలో మధ్యే మార్గాన్ని అన్వేషించింది. అదే రాజధాని వికేంద్రీకరణ. గతంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధిని కేంద్రీకరించిన మాజీ సీఎం చంద్రబాబు దానికి తగిన ఫలితం అనుభవించడమే కాకుండా ఏపీకి కూడా తీవ్రంగా నష్టం చేశారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు దానికి భిన్నంగా వికేంద్రీకరణ మంత్రాన్ని తెరపైకి తీసుకురావాలన్నది వైసీపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.రాజధాని ప్రాంతంలో 10 వేల ఎకరాల భూముల్ని రూ.15 వేల కోట్లు ఖర్చుపెట్టి మరీ రెండు మీటర్ల ఎత్తుకు పెంచుతామని సీఆర్డీఏ గతంలోనే అధికారికంగానే ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాజధాని అమరావతి ఎంత సురక్షితమో ఇట్టే అర్ధమవుతుంది. తాజాగా వచ్చిన కృష్ణానది వరదలు మరోసారి ఈ ప్రాంతంలో పరిస్ధితి ఎంత గొప్పగా ఉందో ప్రపంచానికి వెల్లడించాయి. ఇక్కడ భారీ నిర్మాణాలు సురక్షితం కాదన్న భావన అప్పట్లోనే శివరామకృష్ణన్ కమిటీ కూడా నిర్మొహమాటంగా చెప్పేసింది. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ద్వారా వాగు నీటిని నదిలోకి ఎత్తిపోయాలా లేక నదిలో నీటిని వాగులోకి పంపాలా అన్నది ప్రభుత్వం కూడా తేల్చుకోలేని పరిస్ధితి తాజా వరదలు మరోసారి కల్పించాయి. కాబట్టి రాజధాని ప్రాంతంలో అవసరమైన కొన్ని నిర్మాణాలు మాత్రమే ఉంచి మిగతా వాటిని రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు తరలిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రభుత్వ పెద్దలకు ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాజధానిలో నిర్మాణ వ్యయం రెట్టింపు అవుతుందన్న మంత్రి బొత్స వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. అందుకే ఇప్పుడు వైసీపీ సర్కారు వికేంద్రీకరణ వ్యూహాన్ని ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది.అన్నింటికీ మించి గతంలో హైదరాబాద్ రాజధానిగా ఉండగా.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలంతా విద్య, ఉద్యోగ,ఉపాధి అవకాశాల కోసం భారీగా తరలివచ్చేవారు. కానీ అమరావతిలో ప్రస్తుతం అలాంటి పరిస్ధితి లేదు. రాజధాని ప్రకటనతో భారీగా పెరిగిపోయిన అద్దెలు, రాజధాని ప్రాంతంలో సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, చుక్కలనంటుతున్న భూముల ధరలు ఇక్కడ ప్రజా జీవనాన్ని దుర్భరంగా మార్చేశాయి. మరోవైపు గత టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి అమరావతి బ్రాండ్ కు ప్రచారం చేసినా రాజధాని తమదే అన్న అభిప్రాయం చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు సైతం కల్పించలేకపోయారు. దీంతో ఇప్పటికీ వెనుకబడిన రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర వాసులు కూడా అమరావతి విషయంలో పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాజధాని అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కీలకమైన హైకోర్టు తాత్కాలిక ప్రాతిపదికపై అమరావతిలో నిర్మించినందున రాయలసీమలో ఓ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం, అలాగే ప్రణాళికా సంఘం రద్దుతో ప్రాంతీయ అభివృద్ధి మండళ్ల ఏర్పాటు, మారుమూల జిల్లాల్లో సైతం మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు వంటి చర్యల ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణకు బాటలు వేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎలాగో ఇప్పుడు అమరావతిలో నిర్మాణ వ్యయం ఆధారంగా రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవని ప్రభుత్వం ఇప్పటికే తేల్చేసింది. కాబట్టి మిగిలిన జిల్లాల్లో అందుబాటులో ఉన్న నిధులతో ఎక్కడికక్కడ స్ధానికంగా అభివృద్ధి ఫలాలు అందించగలిగితే గ్రామ సచివాలయాల తరహాలోనే ప్రజల మెప్పు పొందే అవకాశం కూడా ఉంటుందన్న వాదన ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దీనిపై సీఎం జగన్ విదేశీ పర్యటన నుంచి రాగానే ఓ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి.