ఐదు తర్వాత చంద్రబాబు యాత్రలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఐదు తర్వాత చంద్రబాబు యాత్రలు

తూర్పు నుంచి మొదలు
గుంటూరు, ఆగస్టు 30, (way2newstv.com)
ఏపీలో ఎన్నికల ఫలితాలతో సీట్ల సంఖ్యలో దీన స్థితికి చేరుకున్నా ఓటింగ్ శాతంలో 40 శాతం ప్రజలు... తెలుగుదేశం వైపు ఉన్నారన్న భరోసాతో చంద్రబాబు రణరంగానికి ప్రణాళిక వేశాడు. జగన్ వంద రోజులు పూర్తి చేసుకుని హనీమూన్ పీరియడ్ ముగించడంతో ఇక అస్త్రాలతో ఆయనపై దాడికి సిద్ధమయ్యారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రజలు గుండెలు మండి రోడ్లపైకి వస్తుంటే సోషల్ మీడియాలో కూర్చుంటే పని కాదని నిర్ణయించుకున్న చంద్రబాబు ప్రజల బాట పట్టాడు. 
ఐదు తర్వాత చంద్రబాబు యాత్రలు

నేలకు కొట్టిన బంతిలా తెలుగుదేశం పతాకాన్ని తిరిగి ఎగురవేయడానికి చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకుని కీలక పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు.ఇకపై ప్రతి జిల్లాలో క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో స్వయంగా చంద్రబాబు పర్యటన ఖరారుచేశారు. ప్రతి వారంలో రెండ్రోజుల పాటు ఒక్కో జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి సెప్టెంబర్ 5, 6 తేదీల్లో తొలి పర్యటనతో చంద్రబాబు ప్రజా యాత్రలు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్రంలోనే రెండ్రోజులు చంద్రబాబు మకాం వేస్తారట. అక్కడ టీడీపీ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించి కార్యకర్తలు, నేతలతో మమేకమై వారి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. అనంతరం నియోజకవర్గాల వారీగా సమీక్షలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజలను కూడా కలుసుకోనున్నారు. ఏదేమైనా ఇంతకాలం జరిగిన నష్టాన్ని పక్కన పెట్టి... విజయపు మెట్లు ఎక్కడానికి పసుపు సైన్యాన్ని పోరాటానికి సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు.