ఆమంచికి ఇక చెక్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆమంచికి ఇక చెక్...

ఒంగోలు, ఆగస్టు 30, (way2newstv.com)
ఆమంచి కృష్ణమోహ‌న్‌
ఆమంచి కృష్ణమోహ‌న్‌. 2014కు ముందు ఈయ‌న ఎవ‌రో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా తెలియ‌దు. కానీ, ఆ త‌ర్వాత మాత్రం ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ అయ్యారు. 2014 ఎన్నిక‌ల్లో న‌వోద‌యం పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించిన ఆయ‌న త‌ర్వాత కాలంలో చంద్రబాబు ఆహ్వానం మేర‌కు సైకిల్ ఎక్కారు. అయితే, త‌న నియోజ‌క‌వ‌ర్గాన్నే రాష్ట్రాన్ని చేసుకుని, తానే సీఎం అయి పాలించ‌డం, టీడీపీ నేత‌ల‌ను లెక్క చేయ‌క‌పోవ డం, ఎక్కడిక‌క్కడ త‌న‌మాటే చెల్లాల‌ని భావించ‌డం, టీడీపీ నేత‌ల‌ను ఈస‌డించ‌డం వంటి చ‌ర్యల‌తో ఆమంచి కృష్ణమోహ‌న్‌ రాష్ట్ర మీడియాలో హైలెట్ అయ్యారు.అలాంటి ఆమంచి కృష్ణమోహ‌న్‌ అనూహ్యంగా 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీని వీడొద్దని చంద్రబాబు రాయ‌బారం పంపినా కూడా ఆయ‌న మాట‌ల‌ను లెక్క చేయ‌కుండా వెళ్లి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 
ఆమంచికి ఇక చెక్...

ఈ క్రమంలోనే బాబు అప్పుడే ప్రవేశ పెట్టిన ప‌సుపు-కుంకుమ పథ‌కాన్ని విమ‌ర్శించి వార్తల్లో నిలిచారు. ఇక‌, వైసీపీ త‌రపున చీరాల నుంచి పోటీ చేసినా.. రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ హ‌వా వీచినా.. ఇక్కడ ఆమంచి కృష్ణమోహ‌న్‌ వ్యతిరేకతే పైచేయి సాధించింది. ఈ నేప‌థ్యంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన రాజ‌కీయ దిగ్గజం.. క‌ర‌ణం బ‌ల‌రాం.. గెలుపు గుర్రం ఎక్కారు. దీంతో ఊహించ‌ని విధంగా ఆమంచి కృష్ణమోహ‌న్‌ ప‌రాజ‌యం పాల‌య్యారు.నిజానికి ఓడిపోయిన నాయ‌కుడు మౌనం వ‌హించాలి. పార్టీ కార్యక్రమాల‌కే ప‌రిమితం అవ్వాలి. అయితే, ఆమంచి కృష్ణమోహ‌న్‌ మాత్రం త‌న దూకుడును ఆప‌లేదు. నేను ఓడినా.. నా పార్టీ అధికారంలోకి వ‌చ్చింది కాబ‌ట్టి.. తమ ప్రభుత్వం ఉంది కాబ‌ట్టి.. తన మాటే చెల్లుబాటు అవ్వాల‌నే ధోర‌ణిని ప్రద‌ర్శించారు. ఈ నేప‌థ్యంలోనే ఆమంచి కృష్ణమోహ‌న్‌ ప‌లు విష‌యాల్లో జోక్యం చేసుకున్నారు. దీంతో వీటిని ప్రతిప‌క్షం త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది. జ‌గ‌న్‌పై విమ‌ర్శలు సంధించింది. అధికారులు కూడా ఆమంచి కృష్ణమోహ‌న్‌ దూకుడుతో విసుగెత్తిపోయారు. ఈ నేప‌థ్యంలో చివ‌రికి నెల రోజుల త‌ర్వాత ఆమంచి కృష్ణమోహ‌న్‌పై నేరుగా అధికారులే సీఎంకు ఫిర్యాదులు చేశారు. ఇలా అయితేమేం ప‌నిచేయ‌లేం సార్‌! అంటూ విన్నవించారు.దీంతో రంగంలోకి దిగిన జ‌గ‌న్‌.. ఆమంచి కృష్ణమోహ‌న్‌కి ఘాటుగా సందేశం పంపారు. అధికారుల‌పై పెత్తనం చేసేందుకు వీలులేద‌ని, ఏదైనా ఉంటే .. పార్టీ జిల్లా వ్యవ‌హారాల ఇంచార్జ్ స‌జ్జల రామ‌కృష్ణారెడ్డికి వివ‌రించి.. సానుకూలంగా ప‌నిచేయించుకోవాల‌ని హెచ్చరించినట్టు తెలిసింది. అలా కాకుండా దూకుడుగా వెళితే స‌హించేది లేద‌ని హెచ్చరించిన‌ట్టు స‌మాచారం. దీంతో గ‌డిచిన నెల రోజులుగా ఆమంచి కృష్ణమోహ‌న్‌ సైలెంట్ అయిపోవ‌డం జిల్లాలోను, చీరాల నియోజ‌క‌వ‌ర్గంలోనూ చ‌ర్చనీయాంశంగా మారింది. మొత్తానికి జ‌గ‌న్ కీలెరిగి వాత పెట్టార‌న్నది ఇప్పుడు ఆమంచి కృష్ణమోహ‌న్‌పై వినిపిస్తోన్న హాట్‌టాపిక్‌