అందని సంజీవని (తూర్పుగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అందని సంజీవని (తూర్పుగోదావరి)

కాకినాడ, ఆగస్టు 27  (way2newstv.com): 
అంగన్‌వాడీ కేంద్రాలకు రెండు నెలల నుంచి బాల సంజీవని పేరుతో పంపిణీ చేస్తున్న పోషకాహార కిట్ల పంపిణీ ఆగిపోవడంతో రక్తహీనత ఇతర సమస్యలతో బాధపడుతున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల పరిధితో పాటు ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేకంగా సర్వే చేశారు. రక్తంలో హిమోగ్లోబిన్‌ 11 శాతం కంటే తక్కువగా ఉండి, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి పోషకాహార కిట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలా ప్రస్తుతం జిల్లాలోని గర్భిణులు, బాలింతలు 70,269 మంది బాల సంజీవని కిట్ల లబ్ధిదారులుగా ఉన్నారు. వీరందరికీ ప్రతినెలా ఒకటో తేదీన కిట్లు చేరేవి. దీనివల్ల వారిలో రక్తహీనత సమస్యలోతగ్గుతుందని వైద్యుల నివేదికలు సైతం స్పష్టం చేశాయి. 
అందని సంజీవని (తూర్పుగోదావరి)

బాల సంజీవని కిట్ల కంటే ముందుగా గర్భిణులకు, బాలింతలకు ఒక పూట భోజనంతో పాటు ప్రతిరోజూ 200 మి.లీ. పాలు, కోడిగుడ్డు, రాగి జావ ఇచ్చేవారు. అయినా రక్తహీనత సమస్య వెంటాడడంతో బాలసంజీవని కిట్లు పంపిణీ మొదలుపెట్టారు. ప్రస్తుతం బాల సంజీవని కిట్లు సరఫరా నిలిచిపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో పప్పు, అన్నం, పాలతో సరిపెడుతున్నారు. కోడిగుడ్డు సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో పంపిణీపై అయోమయం నెలకొంది. ఈ ఏడాది జూన్‌ వరకు బాలసంజీవని కిట్లు సరఫరా చేసేలా కాంట్రాక్టర్లతో చేసిన ఒప్పందం గడువు ముగిసిపోయిన తరువాత సమస్య వచ్చింది. జులై నెలంతా రేపోమాపో వస్తాయంటూ లబ్ధిదారులకు నచ్చచెప్తూ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఆగస్టులో రెండు నెలలకు సరిపడా వస్తున్నాయని చెప్పారు. ఈనెల మూడోవారం ముగిసినా కిట్లు రాకపోవడంపై లబ్ధిదారులకు సమాధానం చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. వీటికోసం కేంద్రాలకు వచ్చే తల్లులకు పలుచోట్ల పప్పు అన్నం పెడుతున్నారు. బాలసంజీవని నిలిచిపోవడం వల్ల గర్భిణులు, బాలింతలపై రక్తహీనత సమస్య మరింతగా పెరగడంపాటు చిన్నారుల్లోనే ఆందోళన కలిగించే పరిస్థితులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కిట్లు సరఫరా నిలిచిపోవడంపై పేదవర్గాల్లోని లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ఈ కిట్లు వస్తాయనే దానిపై సరైన స్పష్టత లేకుండా పోయిందని వీరంతా వాపోతున్నారు. రక్తహీనత కలిగిన గర్భిణులు, బాలింతల ఆధార్‌, రేషన్‌ కార్డులను ఆన్‌లైన్‌ చేయడంతో బాల సంజీవని కిట్లు సక్రమంగా అంగన్‌వాడీ కేంద్రాలకు చేరేవి. సంచుల్లోనే ఇవన్నీ ఉండటంతో కార్యకర్తలంతా కేంద్రాల్లోనే లబ్ధిదారులకు అందించేవారు. కిట్లుతో పాటు నెలకు సరిపడా 25 గుడ్లు, పాల ప్యాకెట్లు తీసుకునేవారు. దానికి అదనంగా బాలసంజీవని కిట్లలో కిలో చొప్పున కర్జూరం, వేరుసెనగపప్పు అచ్చులు, బెల్లం, రాగిపిండి ఇచ్చేవారు. రక్తహీనత సమస్యలతో అవస్థలు పడుతున్న వారికి వీటి ద్వారా అవసరమైన కాల్షియం, పొటాషియంతో పాటు విటమిన్లు అందుతాయన్న ఉద్దేశంతో వీటిని పంపిణీ చేసేవారు. ప్రతినెలా 9న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత్‌ యోజనలో భాగంగా గర్భిణులకు చేసే వైద్య పరీక్షల్లో రక్తహీనత చూసేవారు. బాల సంజీవని పోషకాహారం వల్ల రక్తంలో 11 శాతం కంటే హిమోగ్లోబిన్‌ తక్కువ ఉన్న వారిలో మార్పు కనిపించింది. క్రమంగా చాలామంది గర్భిణుల్లో 13 శాతం దాటిన మార్పును చూడగలిగామని వైద్యులు సైతం చెబుతున్నారు.