కర్నూలు, ఆగస్టు 27 (way2newstv.com):
జిల్లాను కరవు కాటేసింది. నీటి బొట్టు లేక మొక్కలు ఎండిపోయాయి అప్పుల కుప్పలే కళ్లలో మెదిలాయి అన్నదాతల ముఖాలు వాడిపోయాయి.న్యూస్‌టుడే-కర్నూలు సచివాలయం: జిల్లాలో సాధారణ సాగు 6.25 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికే 4.18 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయని.. ప్రత్యామ్నాయ పంటలు అవసరం లేదని జిల్లా వ్యవసాయాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపారు. వాస్తవానికి జూన్ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు పరిశీలిస్తే దాదాపు 46 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు తేలింది. ఇంకనూ 2 లక్షల హెక్టార్లలో పంటల సాగు లేకపోగా.. ఇప్పటికే వేసిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు డివిజన్ పరిధిలోని మండలాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. చాలామంది రైతులు తమ పంటలపై ఆశలు వదిలేసుకున్నారు.
కరవు కాటు (కర్నూలు)
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలో మాత్రం చినుకు జాడే కరవైంది. జలాశయం పరిధిలోని ప్రాంతాల్లో సాగునీటికి కష్టాలు లేకపోయినా జిల్లాలో చాలావరకు వర్షాధారంపైనే ఆధారపడి రైతులు సాగు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో గతంలో పడిన అరకొర వానలతో పత్తి, వేరుసెనగ తదితర పంటలు వేశారు. వరుణుడు కినుకు వహించడంతో ప్రస్తుతం అవి ఎండుముఖం పడుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లోని పరిస్థితులపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారు. వర్షాధారంగా పంటలు సాగు చేసే రైతుల పరిస్థితిపై ఆరా తీశారు. అవసరమైన విత్తనాలు సరఫరా చేసి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా భరోసా ఇవ్వాలని ఆదేశించారు. కానీ జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు అవసరం లేదంటూ అప్పటికే అధికారులు నివేదికలు పంపేయడం గమనార్హం. రైతులకు రుణాలు మంజూరు చేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లను ఒప్పించాల్సి ఉండగా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రూ.1,000 కోట్ల వరకు రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీసీసీబీ ప్రకటించినప్పటికీ ఆ దిశగా దృష్టి సారించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చింది. అయినా అడుగు ముందుకు పడటం లేదు. పాలకవర్గం లేకపోవడంతో రుణాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందంటూ కొందరు అధికారులు చెబుతూ కాలం గడిపేయడం గమనార్హం.