నత్తకే నడకలు (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నత్తకే నడకలు (పశ్చిమగోదావరి)

ఏలూరు, ఆగస్టు 27 (way2newstv.com): 
జిల్లాలో ఆరోగ్య ఉప కేంద్రాలను ఈ- ఉప కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ- ఉప కేంద్రాల ఏర్పాటుకు కనీసం మూడు గదులు అవసరం. గ్రామాల్లో మూడు గదులున్న భవనం లేదా ఇల్లు దొరకడం లేదు. ఉన్నా.. ఇచ్చేందుకు వాటి యజమానులు ఆసక్తి చూపడం లేదు. మూడు, నాలుగేళ్లకు పైగా ఒప్పంద పత్రం రాయాల్సి ఉండటంతో విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ- ఉప కేంద్రాల్లో ఏడు రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల అందరినీ వేధిస్తున్న మధుమేహం (షుగర్‌) పరీక్షను ఆర్‌బీఎస్‌ పరికరంతో చేస్తారు. రక్తహీనతను హెచ్‌బీ పరికరంతో తెలుసుకుంటారు. మల్టీపర్పస్‌ పారామానిటర్‌తో బీపీ, పల్స్‌, జ్వర సంబంధిత వివరాలు తెలుసుకోవచ్ఛు గుండె సంబంధిత వ్యాధుల నిర్ధరణకు వీలుగా చేసే ఈసీజీ పరీక్ష కూడా అందుబాటులో ఉంది.
నత్తకే నడకలు (పశ్చిమగోదావరి)

పరీక్షల సమయంలో ట్యాబ్‌లో రోగి ఆధార్‌, వయసు తదితర వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. ఆ తర్వాత మల్టీపర్పస్‌ పారామానిటర్‌ సాయంతో రోగి బీపీ, పల్స్‌, శరీర ఉష్ణోగ్రత తదితర వివరాలు అక్కడికక్కడే నేరుగా ఆన్‌లైన్‌లో నమోదవుతాయి. వీటితో పాటు మధుమేహ పరీక్ష అనంతరం ఆ వివరాలను పరికరం ద్వారా నేరుగా అనుసంధానం చేస్తారు. ఈ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో వైద్యుల బృందం పరిశీలిస్తుంది. తర్వాత అవసరాన్ని బట్టి వైద్యుడు రోగితో ఆన్‌లైన్‌లోనే మాట్లాడి వివరాలను సేకరిస్తారు. లేదంటే అవసరమైన మందులను, వైద్య విధానాన్ని ఉప కేంద్రం సిబ్బందికి వివరిస్తారు. ఆ ప్రకారం డ్రగ్‌ మెషీన్‌ ద్వారా రోగికి మందులను అందజేస్తారు. వైద్యుడు సూచించిన మేరకు తర్వాత పర్యాయం ఉపకేంద్రానికి రావాల్సి ఉంటుంది. గుండె వ్యాధులకు సంబంధించి ఈసీజీ పరీక్షలనూ వైద్యుడు నేరుగా ఆన్‌లైన్‌లోనే పర్యవేక్షిస్తారు. గ్రామాల్లో ఈ- ఉపకేంద్రాల సేవలు అరకొరగా ప్రారంభమయ్యాయి. ఈసీజీ పరీక్షలను పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు. దీనిపై సిబ్బందికి ఇంకా శిక్షణ ఇవ్వలేదని తెలిసింది. డ్రగ్‌ మెషీన్లు కూడా అలంకారప్రాయంగానే ఉన్నాయి. మందులు అందించాల్సి ఉన్నప్పటికీ వాటి నిర్వహణ, పనితీరుపై సిబ్బందికి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఇక కేంద్రాల నిర్వహణకు వైద్య పరికరాలతో పాటు 14 రకాల సామగ్రిని సరఫరా చేస్తున్నారు. వీటిలో ఆరడుగుల బెంచీలు రెండు, గర్భిణులు, రోగులను పరీక్షించే బల్ల ఒకటి, పొడుగు బల్ల, టేబుల్‌, కుర్చీలు తదితర సామగ్రి ఉంది. ఇవికాక ఉపకేంద్రాల్లో ఇప్పటికే బీరువా, ఇతర పరికరాలు ఉన్నాయి. వీటిని ఉంచడానికి ఉన్న గదులు చాలడం లేదు. చేసేది లేక వరండాల్లో ఉంచాల్సిన పరిస్థితి. వైద్య సేవల కోసం వచ్చే రోగులు కూర్చొనేందుకు చోటు ఉండటం లేదు. జిల్లాలో 453 ఉప కేంద్రాలకు సొంత భవనాలు లేవని అధికారులు గుర్తించారు. ఆ మేరకు పంచాయతీల్లో భవనాల నిర్మాణానికి స్థలాలను సేకరించారు. ప్రస్తుతం నిర్మాణాల ఊసే లేదు.