బొత్స బాంబు వెనుక... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బొత్స బాంబు వెనుక...

విజయవాడ, ఆగస్టు 22, (way2newstv.com)
అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మరాయి. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పడం వెనక ఆంతర్యమేంటన్న చర్చ ఇటు సామాన్య ప్రజల్లోనే కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ జరుగుతుండటం విశేషం. బొత్స సత్యనారాయణ ఇటువంటి పెద్ద నిర్ణయాన్ని లైట్ గా తీసుకుని ఎందుకు ప్రకటించారన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది.నిజానికి వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం విషయంలో పెద్దగా ఆసక్తి కనపర్చడం లేదు. రీ టెండర్లకు ఆహ్వానించాలని మాత్రం ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 
బొత్స బాంబు వెనుక...

అంతే తప్ప రాజధానిని మారుస్తామని జగన్ ఎప్పుడూ చెప్పలేదు. ఇక బడ్జెట్ సమావేశాల్లోనూ రాజధాని అమరావతి విషయంలో పెద్దగా చర్చ జరగలేదు. కానీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో రాజధానిని మారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ దాడిని ప్రారంభించింది.అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు వైసీపీ సీనియర్ నేతలు. అమరావతి రాజధాని విషయంలో జగన్ మాత్రమే ప్రకటన చేయాల్సి ఉంటుందన్నారు. బొత్స సత్యనారాయణ లాంటి వారి కామెంట్స్ కు విశ్వసనీయత ఉండదన్నారు. ఇటీవల అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా వారు ఉదహరిస్తున్నారు. ఆర్థికమంత్రి, విద్యాశాఖ మంత్రి అమ్మవొడి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమవుతుందని చెప్పినా వెంటనే సీఎంవో కార్యాలయం నుంచి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు అమ్మఒడి వర్తిస్తుందని ప్రెస్ నోట్ విడుదల చేయడం మంత్రులకు, జగన్ ఆలోచనలకు తేడా ఉందని స్పష్టమయిందంటున్నారు.ఇక రాజధాని అమరావతి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మార్పు జరగదంటున్నారు. అక్కడ కొంత మేర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వాటిని కొనసాగించాలన్నదే జగన్ అభిప్రాయమట. అయితే చంద్రబాబు కలలు గన్న పూర్తి స్థాయి రాజధాని నిర్మాణాన్ని మాత్రం జగన్ చేపట్టే అవకాశాలు లేవంటున్నారు. కొన్ని కార్యాలయాలను మిగిలిన ప్రాంతాల్లో నిర్మించాలన్నది వైసీపీ ప్రభుత్వ ఆలోచనట. మొత్తం మీద బొత్స సత్యనారాయణ రాజధాని నిర్మాణం విషయంలో వదిలిన ఫిల్లర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ అమెరికా నుంచి వచ్చిన తర్వాతనే దీనిపై స్పష్టత రానుంది.