విజయనగరం, ఆగస్టు 20 (way2newstv.com):
ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులు మూలంగా నష్టపోయిన రైతాంగానికి పంటల బీమా సదుపాయం కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వం ఈ-పంట నమోదును చేపడుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఈ-పంట ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ నత్త కంటే నెమ్మదిగానే సాగుతోంది. ఖరీఫ్ పంటల సాగు దాదాపుగా సగానికి చేరుకున్నా నమోదు మాత్రం కనీస స్థాయిలో కూడా లేదు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం, సాంకేతిక ఇబ్బందులు, సిబ్బంది కొరత తదితర సమస్యలు అవరోధంగా నిలుస్తున్నాయి. గడువులోగా పంటల నమోదు జరగక పోతే పంటల బీమాతో పాటు రాయితీలు, వ్యవసాయ పరికరాలు అందక నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో అన్ని రకాల ఖరీఫ్ పంటలు 1,90,063 హెక్టార్లలో సాగు జరగాల్సి ఉంది. ఇంత వరకు సుమారుగా 75 వేల హెక్టార్లలో పంటల సాగు పూర్తయ్యింది. ఇవన్నీ ఈ-పంటలో నమోదు కావాల్సి ఉన్నా వీటిలో కేవలం 3.4 శాతం వరకు మాత్రమే నమోదు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్ఛు ఇంత వరకు వ్యవసాయ శాఖ చూపుతున్న గణాంకాలను చూస్తే జిల్లాలోని 34 మండలాల్లో 2,523 హెక్టార్లలోనే ఈ- పంట నమోదు జరిగింది. మెంటాడ, గజపతినగరం, విజయనగరం, గంట్యాడ, శృంగవరపుకోట, కొత్తవలస ఆరు మండలాల్లో ఈ-పంట నమోదు ప్రక్రియ ఇంత వరకు ప్రారంభమే కాలేదు. రామభద్రపురం మండలంలో 420.71, గరుగుబిల్లి మండలంలో 222.16, బొబ్బిలి మండలంలో 201 హెక్టార్లులో పంట నమోదు చేశారు. మిగతా మండలాల్లో 50 నుంచి 200 హెక్టార్ల లోపే ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లాలో మెట్ట పంటలుగా వేరుసెనగ, మొక్కజొన్న, పత్తి, చెరకు వంటి పంటలు సాగు జరిగాయి. నీటి ఆధారిత భూముల్లో వరి నాట్లు పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పల్లపు భూముల్లో నాట్లు పడుతున్నాయి. వ్యవసాయ మోటార్ల కింద వరిసాగు జరుగుతోంది. పంటల సాగు క్రమేపీ పెరుగుతున్నా ఈ-పంట నమోదు మాత్రం జోరందుకోవడం లేదు. సకాలంలో పంట నమోదు ప్రక్రియ పూర్తికాకుంటే అన్ని విధాలా నష్టపోవాల్సి వస్తోందని రైతులు కలవర పడుతున్నారు.
జిల్లాలో ఈ-పంట నమోదులో జాప్యానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. గ్రామ రెవెన్యూ అధికారులకు, వ్యవసాయ సిబ్బందికి మధ్య సమన్వయం కొరవడడం, పరస్పర సహకారం లోపించడం పంటల నమోదు ప్రక్రియ ఆలస్యానికి కారణమవుతోంది. పంట నమోదుకు పొలాల సర్వే నంబర్లను గుర్తించడానికి వ్యవసాయ సిబ్బందికి రెవెన్యూ అధికారుల నుంచి సహకారం కొరవడుతోంది. వీఆర్వోలు రెవెన్యూపరమైన పనులతో బిజీగా ఉంటూ తమతో కలవడం లేదని ఈ కారణంగా పంట నమోదు ఆలస్యమవుతుందని వ్యవసాయ సిబ్బంది చెబుతున్నారు. ఈ-పంట యాప్‌తో ఉన్న ఆండ్రాయిడ్ చరవాణి, ట్యాబ్‌తో రైతు సాగు చేసే పొలం వద్దకు వెళ్లి పంట వివరాల నమోదుతో పాటు పంటల చిత్రాలను చిత్రీకరించి జీపీఎస్ పద్ధతిలో సర్వర్‌కు పంపాలి. ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేయాలి. ఈ-పంట యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంలో కొన్ని మండలాల వ్యవసాయ అధికారులు వెనుకంజ వేశారు. దీనికి తోడు వ్యవసాయ సిబ్బందికి ఇచ్చిన పాస్‌వర్డ్, యూజర్ నేమ్‌లు అనుసంధానం కాకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో ఈ-పంట నమోదు వేగవంతం కావడం లేదు. దీనికి తోడు వ్యవసాయ శాఖలో సిబ్బంది కొరత ప్రభావం చూపుతోంది. జిల్లాలోని 177 మంది ఎంపీఈవోలుండగా వీరిలో 90 మంది వరకు విధులకు దూరమై సమ్మెలో ఉన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులకు మండలాల్లో కొరత తీవ్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలోని గ్రామ రెవెన్యూ అధికారులకు ఈ-పంట నమోదు బాధ్యతలను అప్పగించి వేగవంతానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది మధ్య సమన్వయాన్ని పెంచి పంట నమోదు ప్రక్రియను జోరందుకునేలా చేయక పోతే రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ఈ-పంటలోని వివరాలు ఆధారంగా రైతులకు వ్యవసాయ పరికరాలను అందించనున్నారు. విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్ రాయితీతో పాటు వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాలు మూలంగా పంటలు నష్టపోయిన వారికి చెల్లించాల్సిన పరిహారం వంటివన్నీ ఈ-పంటలోని నమోదైన భూముల వివరాలు ఆధారంగానే అందుతాయి. రైతు ఎప్పుడైనా తన పొలం వివరాలను తెలుసుకునే వీలుంటుంది. పంట పొలానికి చీడపీడలు తలెత్తినపుడు రైతులకు అవరమైన సూచనలు చేసే వీలుంటుంది. ఈ-పంటలో భూమి వివరాలు నమోదు కాకుంటే సంబంధిత రైతు ప్రభుత్వ పథకాల లబ్ధికి అనర్హుడవుతాడు.
Tags:
Andrapradeshnews