రెండు వర్గాలుగా ఏపీ కమలం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెండు వర్గాలుగా ఏపీ కమలం

విజయవాడ, ఆగస్టు 29, (way2newstv.com)
కొత్త నీరు వచ్చి పాత నీరుని తోసేసిందా. అలాగే కనిపిస్తుంది ప్రస్తుత ఎపి బిజెపి పాలిటిక్స్. ఎన్నికల ముందు వరకు ఒకే విధానంలో కమలం రాజకీయం నడిచేది. ఎన్నికల తరువాత మోడీ రెండోసారి ప్రధాని కావడం, వైసిపి అధికారంలోకి రావడం తో టిడిపి లోని బడాబాబులు బిజెపికి జై కొట్టారు. అప్పటి నుంచి కాషాయం పాలిటిక్స్ లో పసుపుదనం పరిమళిస్తుంది. అదే ఇప్పుడు ఎపి బిజెపికి సమస్యగా మారింది.పాత బిజెపి, కొత్త బిజెపి లా ఇప్పుడు ఎపి లో బిజెపి నేతల వ్యవహారసరళి సాగుతుంది. టిడిపి మొన్నటి ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన తరువాత మోడీ రెండోసారి అధికారం చేపట్టిన తరువాత ఎపి లో బిజెపి కి ఆశావహ పరిస్థితి వుంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి రాష్ట్రానికి విరివిగా ఆర్ధిక సాయం అందిస్తే బిజెపి పై సానుకూల పరిస్థితులు మెరుగుపడతాయన్నది విశ్లేషకుల అంచనా. 
రెండు వర్గాలుగా ఏపీ కమలం

అయితే ఇటీవల బిజెపి లో కొత్తగా టిడిపి నుంచి వచ్చి చేరిన నేతలతో ఆ సానుకూల వాతావరణం కనుమరుగు అవుతుంది. వారు చేస్తున్న వ్యాఖ్యలు కమలం కన్నా పసుపు పార్టీకే అనుకూలంగా ఉండటంతో ఎపి బిజెపి భవిష్యత్తులో పుంజుకోవడం కష్టమే అంటున్నారు.అమరావతి ని మారుస్తారంటూ ప్రచారం మొదలయ్యాక ఎపి బిజెపి నేతల్లో కొత్తవారు ఒకలా పాతవారు మరోలా వ్యాఖ్యలు చేస్తూ గందరగోళానికి తెరతీశారు. వాస్తవానికి అధికార కేంద్రీకరణ చేస్తున్నారని, రాజధాని కొందరి కోసమే అంటూ విమర్శలు గుప్పించారు. ప్రాంతాల వారీగా అభివృద్ధి జరగాలని డిమాండ్ చేశారు. ఇదంతా ఎన్నికలకు ముందు. ఆ తరువాత ఇప్పుడు మాత్రం మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి రాజధాని మార్పు అంగీకరించమని వ్యాఖ్యానించి వివాదానికి తెరలేపారు. ఇక మరో తాజా బిజెపి నేత రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మరోఅడుగు ముందుకు వేసి ఏపీ లో నాలుగు రాజధానులు అంటూ బాంబులు పేల్చారు. ఇక ఎన్నికల ముందు బిజెపి తీర్ధం పుచ్చుకున్న ఎపి శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సుజనా వాదనే వినిపించారు. ఎపి మంత్రి బొత్స సత్యనారాయణ మొదలు పెట్టిన రాజధాని ఇది కరెక్ట్ కాదన్న వ్యాఖ్యల చిచ్చులో వీరంతా ఇలా తలోమాట మాట్లాడి ప్రజల్లో తమ గందరగోళాన్ని మరింత పెంచారు.సోము వీర్రాజు ఆర్ఎస్ఎస్ నుంచి బిజెపి లో చురుకైన నేత. కాలం కలిసిరాక ఎపి బిజెపి అధ్యక్షుడు కాలేకపోయిన వీర్రాజు అధిష్టానం వైఖరిని తూచా తప్పకుండా అనుసరిస్తారు. రాజధాని వ్యవహారం పై రేగిన రగడపై వీర్రాజు తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు మోళీ చేసి తాయత్తులు అమ్మాలని చూశారని అవి కొనుక్కుని అంతా బుక్ అయిపోయినట్లు చెప్పారు ఆయన. రియల్ ఎస్టేట్ వ్యాపారంగా రాజధాని తయారు అయ్యిందన్నది గతంలో చెప్పిందే ఆయన స్పష్టం చేశారు. ఆయారాం గయారాం ల మాటలతో పార్టీకి సంబంధం లేదని వైసిపి సర్కార్ టిడిపి అవకతవకలు బయటపెట్టి కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. రెండు పార్టీలు లాలూచి అయిపోయారా అంటూ నిలదీశారు. వైసిపి ని విమర్శించే నైతిక హక్కు టిడిపికి లేనేలేదని ఏది మాట్లాడినా బిజెపి మాత్రమే మాట్లడుతుందని చెప్పుకొచ్చారు. ఇలా సొంత పార్టీ లో కొత్తగా చేరిన వారికి మరోపక్క టిడిపి కి తన వ్యాఖ్యలతో వాతలు పెట్టి కర్ర విరక్కుండా పాము చావకుండా సోము మాట్లాడటం మరో చర్చకు తెరలేపింది.