ఆడేదెట్లా..? (ఖమ్మం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆడేదెట్లా..? (ఖమ్మం)

ఖమ్మం, ఆగస్టు 26 (way2newstv.com):
 గ్రామీణ విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాల క్రీడా సమాఖ్య(ఎస్‌జీఎఫ్‌) పోటీలకు నిధులు కరవయ్యాయి. ఒకప్పుడు అండర్‌-14, 17, 19 విభాగం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించేందుకు పోటీపడ్డ జిల్లా కార్యదర్శులు నేడు పోటీలు అంటేనే మొహం చాటేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోతే మున్ముందు ఎస్‌జీఎఫ్‌ పోటీలను మూసివేయాల్సి వస్తుందన్న అనుమానం వ్యక్తం అవుతోంది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగే ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలకు తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని నిర్వహణలోనే తేలిపోయింది. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించిన ఆరు నెలల్లోనే బకాయిలు చేతికొచ్చేవి.. కొత్త జిల్లాల ఏర్పాటుతో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.. 
ఆడేదెట్లా..? (ఖమ్మం)

అంతేకాకుండా ఉమ్మడి జిల్లా పోటీలు నిర్వహించిన సమయంలో జిల్లా నుంచి రాష్ట్ర పోటీల్లో పాల్గొనే కబడ్డీ, ఖో-ఖో, అథ్లెటిక్స్‌, వాలీబాల్‌ జట్ల క్రీడాకారులకు రవాణా, భోజన భత్యంతో పాటు క్రీడా దుస్తులు అందించాలి. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత సైతం రాష్ట్ర స్థాయి పోటీలకు పాత జిల్లానే జోన్‌గా ఏర్పాటు చేశారు. దీంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. పోటీలను నిర్వహించి రెండేళ్లు గడుస్తున్నా పైసలు చేతికందని పరిస్థితి తలెత్తింది.. 2017-18, 2018-19 విద్యా సంవత్సరంలో కొంత మంది జిల్లా కార్యదర్శులు అప్పులు తెచ్చి అండర్‌-14, 17, 19 విభాగం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించారు. అండర్‌-14, 17 విభాగంలో కరీంనగర్‌లో 5 రాష్ట్ర, పెద్దపల్లిలో 7 రాష్ట్ర, జగిత్యాలలో 2 రాష్ట్ర, రాజన్న సిరిసిల్లలో 1 రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించగా మొత్తం 16 రాష్ట్ర స్థాయి పోటీలకు రూ.34 లక్షలు బకాయిలను కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా అండర్‌-19 విభాగంలో 4 రాష్ట్ర, 1 జాతీయ స్థాయి పోటీలను నిర్వహించగా రూ.20 లక్షలు బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితిలో మాజీ కార్యదర్శులు ఉన్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన కొత్త జిల్లా కార్యదర్శులు పోటీలను నిర్వహించేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. సీˆనియార్టీ ప్రకారం వచ్చి కార్యదర్శి పదవిని చేజార్చుకోవడం ఇష్టం లేక కొంతమంది అయిష్టంగానే ఆ పదవిలో కొనసాగుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇటీవల అండర్‌-19 కార్యదర్శుల రాష్ట్ర బాధ్యులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను కలిసి పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందించారు. ‘రెండేళ్ల పాటు అండర్‌-14, 17, 19 పాఠశాల, కళాశాల స్థాయి కార్యదర్శులుగా కొనసాగి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించినా నేటికీ పోటీల నిర్వహణకు సంబంధించిన బకాయిలు చెల్లించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బకాయిలు విడుదల చేయకపోవడంతో అప్పు చేసి పోటీలను నిర్వహించాల్సి వస్తోంది.