చుక్కపై లెక్కలేదా..? (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చుక్కపై లెక్కలేదా..? (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, ఆగస్టు 26 (way2newstv.com): 
అవసరానికి మంచి నీటిని వాడటంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. పొదుపు చర్యలు చేపట్టకపోవడంతో భవిష్యత్తులో బిందెడు నీటి కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీటిపై ఆధారపడిన వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుంటోంది. బోర్ల తవ్వకాలతో అలసిపోయిన అన్నదాతలు నీటి కోసం పరితపిస్తున్నారు. నీటి వనరుల లెక్కలు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి అయిదేళ్లకోసారి సర్వే నిర్వహిస్తోంది. నీటి లభ్యత ఎంత.? వినియోగమెంత.? తదితర వివరాలు సేకరిస్తుంది. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వే చేపడుతున్నారు. 
చుక్కపై లెక్కలేదా..? (ఆదిలాబాద్)

జలవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య ప్రణాళిక ఆధ్వర్యంలో జిల్లాలో ఈ ఏడాది జూన్‌ 1 నుంచి నీటి లభ్యత సర్వే ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నా.. ఇప్పటికీ ఆ ఊసేలేదు. నెల రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తిచేసి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో అధికారులు జలగణన చేపట్టకపోవడంతో నీటి లెక్కలు మరికొద్ది రోజుల్లో కాగితాల్లో కనిపించే అవకాశాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నీటి లభ్యత ఎక్కడ ఉంది.. ఏ మేరకు వినియోగిస్తున్నారనే అంశాలు పరిగణనలోకి తీసుకుని లెక్క కట్టాల్సి ఉంది. 2013-14లో సర్వే నిర్వహించారు. మళ్లీ జలగణన చేయాల్సిన సమయం వచ్చింది. ఇందుకు సంబంధించి ముఖ్య ప్రణాళికశాఖ అన్ని ఏర్పాట్లు చేసినా.. అందుబాటులో అధికారులు, సిబ్బంది లేకపోవడంతో జల‘గణన’ చేపట్టేందుకు చిక్కులు తలెత్తాయి. నీటి వనరుల లెక్కింపు ప్రక్రియ జిల్లాలో ఇంకా మొదలుకాలేదు. ఈ విషయమై అధికారులను అడిగితే క్షేత్రస్థాయిలో నీటి వనరుల లెక్కలు చేసేందుకు అవసరమైన అధికారులు, సిబ్బంది లేకపోవడమేనని చెబుతున్నారు. వాస్తవానికి ప్రతి మండలానికి ఒక ఏఎస్‌వో ఉండాలి. జిల్లాలోని 19 మండలాల్లో మాత్రమే నలుగురు సారంగాపూర్‌, దిలావర్‌పూర్‌, కుంటాల, భైంసాలలో ఉన్నారు. కొత్తగా అయిదుగురు ఏఎస్‌వోలు ఇటీవల విధుల్లో చేరినా వారు ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. మరో తొమ్మిది మండలాల్లో ఏఎస్‌వోలు లేకపోవడంతో ఆయా మండలాల్లో నీటి వనరుల లెక్కలు చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలోని నిర్మల్‌, భైంసా పట్టణాలతో పాటు 18 మండలాల్లోని 428 రెవెన్యూ గ్రామాల్లో అధికారులు జలగణన చేపట్టాల్సి ఉంది. రెవెన్యూ, వ్యవసాయశాఖల సంయుక్త సహకారంతో జిల్లా ముఖ్య ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో సిబ్బంది క్షేత్రస్థాయిలో వెళ్లి నీటి వనరుల లెక్కలు తేల్చాలి. వీఆర్వో, వీఆర్‌ఏ, వ్యవసాయశాఖ అధికారులు, ఉపాధిహామీ పథకం క్షేత్రసహాయకులు సర్వేలో భాగస్వాములు. ప్రతి గ్రామంలో నీటి లభ్యత, వినియోగంపై ఆరా తీసి లెక్కలు చేయాల్సి ఉన్నా.. రెవెన్యూశాఖలో ఇటీవల వీఆర్వోల బదిలీలు జరగడం, వీఆర్‌ఏలు కార్యాలయాల పనులకు పరిమితం కావడం, ఖరీఫ్‌ సీజన్‌ మొదలుకావడంతో వ్యవసాయ అధికారులు పంటపొలాలను సందర్శిస్తున్నారు. ఇలా ఎవరి పనుల్లో వారు నిమగ్నం కావడంతో నీటి వనరుల లెక్కలు తేల్చడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.చిన్ననీటి వనరుల ఆధారంగా వ్యవసాయ రంగం ఉంది. చెరువులు, కుంటలు, బోర్లు, బావులు రైతన్నలకు అండగా నిలుస్తున్నాయి. వర్షం నీటిని భూమిలోకి సరిగా ఇంకించని కారణంగా జిల్లాలో భూగర్భ జలాలు పడిపోతూనే ఉన్నాయి. అవసరాలకు మించి నీటి వినియోగం ఎక్కువవుతుండటంతో పంటపొలాలకు నీరందక ఎండిపోతున్నాయి. ఫలితంగా పంటలు సాగుచేస్తున్న అన్నదాతలు ఆర్థికంగా నష్టాలు చవిచూస్తున్నారు. పంటలకు పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. నీటి లభ్యత అంచనా వేయడంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయుక్తంగా ఉండేందుకు కేంద్రప్రభుత్వం జలగణన చేపడుతోంది. ఈ సర్వే ఆధారంగా నీటి లభ్యత, వినియోగంపై స్పష్టత రానుండటంతో రానున్న రోజుల్లో నీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈసారి జల గణనను పకడ్బందీగా చేపట్టడానికి వాటిని జియో ట్యాగింగ్‌ చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని వ్యవసాయ బావులు, బోర్లు, కుంటలు, ఎత్తిపోతల పథకాలకు జియోట్యాగింగ్‌ చేయాల్సి ఉంది. ప్రతి సాగునీటి వనరులకు కచ్చితంగా ఈ విధానాన్ని అమలు చేయాలి. ప్రతి నీటి వనరుకు గుర్తింపు సంఖ్య కేటాయించాలి. నీటి వనరుల లెక్కల సర్వే పూర్తయిన తర్వాత జిల్లాలో నీటి వనరులు, లభ్యత, వినియోగం, తదితర అంశాలను అంతర్జాలంలో నమోదు చేయాల్సి ఉంటుంది. చిన్న నీటి వనరులు ఎన్ని, సాగునీటి వనరులు ఎన్ని, భూగర్భ జలాల లభ్యత, వినియోగం, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందనే వివరాలు తెలుస్తాయి. ఈ నివేదిక ఆధారంగా సాగునీటి వనరుల అభివృద్ధికి నిధులు మంజూరు కానున్నాయి. జిల్లాలో అయిదేళ్ల కిందట 32,570 సాగునీటి వనరులు ఉన్నట్లు అధికారులు గుర్తించినా.. కొత్తగా 20 వేల వరకు నీటి వనరులు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న నీటి వనరుల లెక్కపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది.