ప్రకాశానికి 50 ఎలక్ట్రిక్ బస్సులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రకాశానికి 50 ఎలక్ట్రిక్ బస్సులు

ఒంగోలు, సెప్టెంబర్ 26, (way2newstv.com)
ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించడంలో ముందడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా తాత్కాలికంగా జిల్లాలో 19 మార్గాల్లో  8 డిపోలకు 19 అద్దె బస్సులకు టెండర్లు ఇటీవల విడుదల చేసింది. ఈ బస్సులు అతి త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. అయితే డీజిల్‌ కన్నా ఎలక్ట్రిక్‌ ద్వారా నడిచే బస్సులను నడపడం ద్వారా ఇటు పర్యావరణ హితం, సాంకేతికతతో సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాకు 50 ఎలక్ట్రిక్‌ బస్సులను పంపేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించడంతో ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు ఏ మార్గంలో ఈ బస్సులను నడపగలమనే ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నారు. 
 ప్రకాశానికి 50 ఎలక్ట్రిక్ బస్సులు

టెండర్‌ బిడ్‌లోనే రూటును కూడా స్పష్టం చేయాల్సి ఉండడంతో ఈ కసరత్తులు ప్రారంభం అయ్యాయి. అందులోను ఎలక్ట్రిక్‌ బస్సుల టెండర్ల ప్రక్రియ కూడా అత్యంత వేగంగా ప్రారంభమవుతుంది. ముందస్తుగా ఫాస్టెస్ట్‌ ఎడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ (హైబ్రీడ్‌) ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌(ఫేమ్‌) విధానంలో డ్రైవర్‌తో, డ్రైవర్‌ కాకుండా ఎలక్ట్రిక్‌ బస్సుల టెండర్లకు మొదటి దశలో టెండరు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 350 బస్సులకు టెండర్లు ఆహ్వానించింది.క్రమంగా ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచాలని సంకల్పించి ప్రతి జిల్లాకు ఎలక్ట్రిక్‌ బస్సులను కేటాయించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాకు రెండో దశలో 50 బస్సులు పంపాలని ప్రతిపాదించింది.వాస్తవానికి కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపేందుకు సుముఖంగా ఉన్నాయి. ఒకసారి చార్జి చేస్తే 260 కిలోమీటర్ల మొదలు 400 కిలోమీటర్ల వరకు బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బస్సు రకాన్ని బట్టి వీటికి కిలోమీటరు దూరానికి చొప్పున ఆర్టీసీ «అద్దెను చెల్లిస్తుంది. దీంతో బస్సు చార్జింగ్‌ గనుక 400 కిలోమీటర్లకు పెరిగితే ఒంగోలు నుంచి చెన్నై, ఒంగోలు– తిరుపతి, ఒంగోలు–విశాఖపట్నం, ఒంగోలు–హైదరాబాదుకు కూడా ఈ బస్సులను నడిపే అవకాశం ఉంది. ఏది ఏమైనా  నవంబరు 6వ తేదీ సాయంత్రం టెండర్ల ప్రక్రియ పూర్తయితే ఎన్ని రకాల బస్సులు, తక్కువ గంటల్లో ఎక్కువ దూరం నడిచేందుకు అవకాశం ఉన్న బస్సులు తదితరాలు మొత్తం వెల్లడవుతాయి.ఈ బస్సుల కారణంగా ఇంజన్‌ శబ్దాలు ఉండవు, ఆయిల్‌ వినియోగం ఉండదు కనుక పొగ రాదు. తద్వారా కాలుష్యం ఉండదు.జిల్లాలో 8 డిపోలు ఉండగా మార్కాపురం–ఒంగోలుకు రెండు, మార్కాపురం–విజయవాడకు మూడు ఎక్స్‌ప్రెస్‌ డీజిల్‌ సర్వీసులకు టెండర్లు పిలిచింది. గిద్దలూరు డిపో నుంచి గిద్దలూరు–కంభం (వయా తురిమెళ్ల)–1, చీరాల డిపో నుంచి చీరాల–రేపల్లె (1), కందుకూరు డిపో నుంచి కందుకూరు–కావలి (1), ఒంగోలు డిపో నుంచి ఒంగోలు–ఇంకొల్లు (వయా రాచపూడి)–1, ఒంగోలు–కొండపి (వయా మద్దులూరు)–2, పొదిలి డిపో నుంచి పొదిలి–ఒంగోలు (3), పొదిలి–అద్దంకి (4), అద్దంకి డిపో నుంచి అద్దంకి–పొదిలి (1) తెలుగు వెలుగు సర్వీసుల కోసం గత నెలలో టెండర్లు పిలిచింది. వీటికి సంబంధించిన ప్రక్రియ మరో నెలరోజుల్లో పూర్తయి బస్సులు రోడ్కెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.తిరుపతికి 50, వాల్తేర్‌ –100, విద్యాధరపురం–50, అమరావతి–50, కాకినాడ–50 ఉన్నాయి. తిరుపతికి కేటాయించిన బస్సులో 40 సీట్లు, మిగిలిన అన్ని డిపోలకు కేటాయించిన బస్సులలో 50 సీట్లు ఉండాలని (డ్రైవర్‌ సీటు అదనం)గా పేర్కొన్నారు. ఈ టెండర్ల ప్రక్రియ నవంబరు 6వ తేదీతో ముగుస్తుంది. ఆ తరువాత ఒప్పందం ప్రక్రియ ఖరారు చేసుక్ను మూడు నెలల్లోగా బస్సులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో బస్సు 12 సంవత్సరాలపాటు సేవలు అందించాల్సి ఉంటుంది. రెండో దశ టెండర్లలో ప్రకాశం జిల్లాకు బస్సులు కేటాయించనున్నారు.ఎలక్ట్రిక్‌ బస్సులలో పూర్తి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనున్నారు. బస్సులోని మొత్తం పరికరాలను ల్యాప్‌టాప్‌కు   వైఫై కనెక్షన్‌ ద్వారా సెన్సార్లకు అనుసంధానం చేసుకుని ఏదైనా సమస్య వస్తే తక్షణమే మరమ్మతులు చేసుకునేలా రూపొందిస్తారు. ఈ బస్సులకు ఆయిల్‌ ఉండదు కనుక విద్యుత్‌ చార్జింగ్‌ కోసం చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, అవసరమైన 33/11 కేవీ విద్యుత్‌ లైను సౌకర్యం, ట్రాన్స్‌ఫార్మర్లు, మెషినరీ, బిల్డింగ్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, స్ట్రక్చర్‌ వంటివన్నీ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి బస్సుకు ఒక స్లో చార్జర్‌తోపాటు ప్రతి 10 బస్సులకు ఒక ఫాస్ట్‌ చార్జర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. అయితే తొలిదశలో ఆహ్వానించిన బస్సులన్నీ ఏసీ కావడంతో జిల్లాకు కూడా ఏసీ బస్సులే వస్తాయని తెలుస్తుంది. అదే జరిగితే ఒంగోలు నుంచి అన్ని ముఖ్య పట్టణాలకు ఈ ఏసీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, బస్సు వేగం 75–80 కిలోమీటర్లు/గంటకు ఉండాలని విధి విధానాల్లో పేర్కొన్నారు.