సింగరేణి ఉద్యోగుల్లో సంతోషం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సింగరేణి ఉద్యోగుల్లో సంతోషం

అదిలాబాద్, సెప్టెంబర్ 19, (way2newstv.com)
ఉద్యోగులకు తెలంగాణ సర్కారు లాభాల్లో 28 శాతం బోనస్ ప్రకటించింది. గత ఏడాది కంటే ఇది ఒక శాతం అధికం. శాతాల్లో కొద్ది తేడానే ఉన్నా.. అంకెల్లో మాత్రం భారీ వ్యత్యాసం ఉంది. ఈ ఏడాది బోనస్ రూపంలో ఒక్కో కార్మికుడు రూ.1,00,899 అందుకోనున్నాడు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఉద్యోగికి రూ.60,369 బోనస్‌గా లభించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అందనున్న బోనస్ రూ.40,530 అధికం కావడం గమనార్హం.ఉమ్మడి జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. 
సింగరేణి ఉద్యోగుల్లో సంతోషం

దీని ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంది. ఈ సంస్థలో కేంద్రానికి 49 శాతం వాటా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంది. 2018-19లో ఈ సంస్థ 64.41 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రూ.1765 కోట్ల లాభాలను ఆర్జించింది.గతంలో నష్టాల్లో నడిచిన సింగరేణి గత కొన్నేళ్లుగా లాభాల బాట పట్టింది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత సింగరేణి సంస్థ లాభాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో లాభాల్లో సింగరేణి ఉద్యోగులకు ఇస్తోన్న బోనస్ కూడా పెరుగుతోంది.2013-14లో సింగరేణి లాభాలు రూ.418 కోట్లు కాగా.. ఉద్యోగులకు ఇచ్చిన బోనస్ రూ.13,540. ఈ ఆరేళ్లలోనే ఉద్యోగుల బోనస్ లక్ష రూపాయలను దాటడం విశేషం. దీనికి సింగరేణి కార్మికుల పనితీరే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అందుకే తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని సీఎం కేసీఆర్ ప్రశంసలు గుప్పించారు.2015-16లో సింగరేణి ఉద్యోగులకు 21 శాతం బోనస్‌గా ఇవ్వగా.. 2016-17లో దాన్ని 23 శాతానికి పెంచారు. 2016లో 54 వేల బోనస్, రూ.18 వేల ఫెస్టివల్ అడ్వాన్స్ అందుకున్న సింగరేణి ఉద్యోగులు.. 2017లో రూ.57 వేల బోనస్, రూ.25 వేల అడ్వాన్స్ అందుకున్నారు. 2018లో రూ.60,369 బోనస్‌గా అందింది.