ఇంతింటై...వటుడింతై.... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంతింటై...వటుడింతై....

పవర్ ఫుల్ లీడర్ గా  షా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14, (way2newstv.com)
అమిత్ అనిల్ చంద్ర షా….. అంటే ఎవరో తెలియకపోవచ్చు. కానీ అమిత్ షా అంటే అందరికీ సుపరిచితం. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. అత్యంత ప్రభావశీల నాయకుడు. అటు పావులు, ఇటు ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతుడు. అధికార భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కీలకమైన కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా ప్రస్తుతం తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నారు. సాధారణంగానే హోంమంత్రి అంటే ప్రధాని తరువాత స్థానం. ప్రధానిని సైతం ఒప్పించగల సమర్థుడు. ప్రధానికి కుడిభుజం లాంటి వాడు. ప్రధాని మోదీ సైతం అమిత్ షాను అత్యంత నమ్మకస్తుడిగా విశ్వాసపాత్రుడిగా పరిగణిస్తారు. అనేక విషయాల్లో ఆయనపై ఆధారపడతారు. 
ఇంతింటై...వటుడింతై....

సూచనలు, సలహాలు పొందుతారు. పాలించేది ప్రధాని మోదీ అయినప్పటికీ తెరవెనుక మంత్రాంగం నడిపేది మాత్రం అమిత్ షా అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. ప్రధాని విశ్వాశాన్ని అంతగా చూరగొన్నారు ఆయన.మోదీ , అమిత్ షా బాల్య స్నేహితులు. వీరి పరిచయం ఈ నాటిది కాదు. సంఘ్ ప్రచారక్ పనిచేసిన సమయంలో ఏర్పడిన పరిచయం దినదినాభివృద్ధి చెందింది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయనకు అమిత్ షా కుడిభుజంగా పనిచేశారు.కీలకమైన మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఒక దశలో ఏకంగా 12 శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. హోం, న్యాయ, జైళ్లు, సరిహద్దుభద్రత, ఎక్సైజ్, రవాణా, సివిల్ డిఫెన్స్, మద్యనిషేదం, హోంగార్డ్స్, గ్రామ రక్షక్ దళ్, పోలీస్ హౌసింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్, గోద్రా అల్లర్ల కేసుల్లో చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ 2014లో మోదీ ప్రధాని కావడంతో షా దశ తిరిగింది. 2014లో మోదీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించగానే షా కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ ఇన్ ఛార్జిగా నియమితులయ్యారు. మొత్తం 80 స్థానాలకు గాను 73 స్థానాలను పార్టీ గెలుచుకోవడంలో షా పాత్ర కీలకం. దీంతో మోదీ అధికారంలోకి రాగానే ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షునిగా నియమితులయ్యారు. పార్టీ సారధిగా షా తిరుగులేని విజయాలు సాధించారు. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కశ్మీర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మణిపూర్, నాగాలాండ్, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపధంలో నడిపించారు. బీహార్, ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికీ షా ప్రాధాన్యత తగ్గలేదు. తాజాగా గత ఏడాది ఛత్తీస్ గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికీ ఆయనపై పెద్దగా ప్రభావం చూపలేదు. తాజాగా లోక్ సభ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో మోదీ ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారుఆధునిక రాజకీయాల్లో షా-మోదీ ద్వయాన్ని చాణిక్య, చంద్రగుప్తగా పోలుస్తారు రాజకీయ విశ్లేషకులు. అపర చాణిక్యుడిగా అమిత్ షాకు పేరుంది. చంద్రగుప్తలాంటి రాజు అయిన మోదీని తెరవెనక ఉండి నడిపించేది అమిత్ షా అన్న పేరుంది. ఎత్తుగడలు వేయడంలో, వ్యూహరచనలు, ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీయడంలో అమిత్ షా అందెవేసిన చేయి. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో సామాజిక సమీకరణలు, బూత్ మేనేజ్ మెంట్, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య సమన్వయం చేయడంలో ఆయన క్రియాశీల పాత్ర పోషిస్తారు. ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా తావు ఇవ్వరన్న పేరుంది. ఈ నైపుణ్యాల కారణంగానే ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో పార్టీ 303 సీట్లు సాధించారని విశ్లేషకులు చెబుతుంటారు. దేశవ్యాప్తంగా 543 నియోజకవర్గాలకు గాను 312 నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా పర్యటించారు. 18 రోడ్ షోలు, 161 బహిరంగసభలు, పార్టీ కార్యకర్తలతో 1500 సమావేశాలు నిర్వహించారు.రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చాక తీసుకున్న కీలక నిర్ణయాల వెనుక అమిత్ షా పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా ముఖ్యంగా త్రిపుల్ తలాక్, జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370, 35ఏ రద్దు, రాష్ట్రాన్ని రెండు కీలక ప్రాంతాలుగా విభజించడం, సమాచార హక్కు చట్ట సవరణ వంటి నిర్ణయాల్లో షా పాత్ర కీలకం. రాజ్యసభలో అధికార పార్టీకి మోజారిటీ లేనప్పటికీ ఈ బిల్లుల ఆమోదంలో అమిత్ షా పాత్రను పార్టీ శ్రేణులు కొనియాడాయి. ఎలాంటి ముందస్తు సమాచారం హడావుడి లేకుండా కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించారు అమిత్ షా. మూడో కంటికి తెలియకుండా నడిపించారు. ఇప్పటివరకు పనిచేసిన భారత హోంమంత్రుల్లో అమిత్ షా అత్యంత శక్తిమంతుడిగా పేర్కొనవచ్చు. అదే సమయంలో ప్రధానికి విశ్వాసపాత్రునిగా పేరొందిన హోంమంత్రి అమిత షానే. సాధారణంగా హోంమంత్రులను ప్రధానులు అనుమానంగా చూస్తుంటారు. రెండోస్థానంలో ఉన్న హోంమంత్రి తన పదవికి ఎక్కడ ముప్పు తెస్తారో అని ప్రధానుల భయం. కానీ షా విషయంలో మోదీకి అలాంటి భయం లేనేలేదు. వీరి మనుసులు వేరు, శరీరాలు వేరు కావచ్చు. కానీ వారి ఆత్మలు ఒక్కటే. ఆలోచనాధోరణులు ఒక్కటే.యూపీఏ హయాంలో శివరాజ్ పాటిల్, సుశీల్ కుమార్ షిండే, పళనియప్పన్, చిదంబరంలు హోంమంత్రులుగా పనిచేసినప్పటికీ అంత శక్తి మంతులుగా పేరొందలేదు. అంతకు ముందు వివిధ ప్రభుత్వాల్లో ఎస్.బి.చవాన్, పి.సి. సేధీ, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నర్సింహారావు, జ్ఇనీ జైల్ సింగ్ , ఆర్ .వెంకట్రామన్, బూటాసింగ్ వంటి వారు సంయమనంగా పనిచేసినప్పటికీ వారి పాత్ర పరిమితమే. పార్టీ నేతలు, అభిమానులు అమిత్ షాను దేశ తొలి హోంమంత్రి ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎల్.కె.అద్వానీతో పోలుస్తుంటారు. వారి దృష్టిలో అమిత్ షా అంత గొప్పనాయకుడు. వారి అభిప్రాయంతో విభేదించడం కూడా కష్టమే.