దిగొస్తున్న బంగారం, వెండి ధరలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దిగొస్తున్న బంగారం, వెండి ధరలు

ముంబై, సెప్టెంబర్ 14, (way2newstv.com)
బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. గతవారం దాకా పది గ్రాముల పుత్తడి రూ.40 వేల దాకా పలికింది. మల్టీ కమోడిటీ ఎక్సేంజీ (ఎంసీఎక్స్‌‌)లో గురువారం ధర రూ.1,730 తగ్గి రూ.38,152గా నమోదయింది. ఎంసీఎక్స్‌‌ ఫ్యూచర్స్‌‌లో కేజీ వెండిధర రూ.3,800లు తగ్గి, రూ.47,686గా రికార్డయింది. గత వారం దీని ధర రూ.51 వేల వరకు దూసుకెళ్లింది. ఇన్వెస్టర్లలో రిస్క్‌‌ సెంటిమెంట్‌‌ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,500 డాలర్లకు దిగొచ్చింది. ఫలితంగా దేశీయ ధరలూ తగ్గిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో గురువారం పుత్తడి ధర 1,491 డాలర్ల వద్ద ట్రేడయింది. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రభుత్వాలు ప్రకటిస్తున్న నిర్ణయాల వల్లే బంగారానికి డిమాండ్‌‌ తగ్గుతోందని యెస్‌‌ సెక్యూరిటీస్‌‌ తెలిపింది. 
దిగొస్తున్న బంగారం, వెండి ధరలు

ఢిల్లీలో పది గ్రాముల ధర రూ.372లు తగ్గి రూ.38,975గా నమోదయింది. కిలో వెండి ధర రూ.1,150లు తగ్గి రూ.48,590లకు చేరిందని ట్రేడర్లు తెలిపారు.బంగారం, వెండి ధరల్లో గత వారం నుంచి కరెక్షన్‌‌ కనిపిస్తున్నా, వీటిని కొనడం ఆపొద్దని అనలిస్టులు అంటున్నారు. అంతర్జాతీయంగా పలు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గిస్తున్నందున, విలువైన లోహాలకు డిమాండ్‌‌ పెరుగుతుందని చెప్పారు. కొంతకాలం తరువాత ఔన్సు బంగారం ధర రెండు వేల డాలర్లకు (దాదాపు రూ.1.42 లక్షల) చేరవచ్చని ఇటీవల రాసిన నోట్‌‌లో సిటీ బ్యాంకు ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ సెంట్రల్‌‌ బ్యాంక్‌‌ మీటింగ్‌‌ ఫలితాల కోసం గోల్డ్‌‌ ట్రేడర్లు ఎదురుచూస్తున్నారు. బ్యాంకు కచ్చితంగా వడ్డీరేట్లను తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, బాండ్ల కొనుగోలుకు నిర్ణయాలను ప్రకటిస్తుందని చెబుతున్నారు. వచ్చే వారం జరిగే యూఎస్‌‌ ఫెడరల్‌‌ రిజర్వ్‌‌బ్యాంక్‌‌ కూడా వడ్డీరేట్లను తగ్గిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఏర్పడే అవకాశాలు ఉన్నందున, రేట్ల తగ్గింపునకే అమెరికా మొగ్గుచూపుతుందని అంటున్నారు. యూరప్‌‌ సెంట్రల్‌‌ బ్యాంక్‌‌ ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్‌‌ నోట్‌‌ తెలిపింది. ఇటీవల పసిడి ధరల్లో కరెక్షన్ వచ్చినా, ఇండియాలో ఈ ఏడాది ఇప్పటి వరకు రేట్లు 20 శాతం పెరిగాయి. చాలా మంది ట్రేడర్లు గోల్డ్‌‌ ఎక్సేంజ్‌‌ ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులను పెంచారు. గత నెలే రూ.145 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్‌‌ ఫండ్స్‌‌ ఈయూఎంల విలువ రూ.5,700 కోట్లకు చేరింది. పండుగల సీజన్‌‌ కూడా దగ్గర పడుతున్నందున, డిమాండ్‌‌ తప్పక పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.ఆర్థిక వ్యవస్థలను గాడిన పెట్టడానికి చాలా ప్రభుత్వాలు ప్రకటించిన చర్యలు  ఇన్వెస్టర్లలో రిస్క్‌‌ సెంటిమెంట్‌‌ను పెంచాయి. దీనివల్ల బంగారానికి డిమాండ్‌‌ కొద్దిగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,500 డాలర్లకు దిగొచ్చింది.  బంగారం, వెండి ధరల్లో గత వారం నుంచి కరెక్షన్‌‌ కనిపిస్తున్నా, వీటిని కొనడం ఆపొద్దని అనలిస్టులు అంటున్నారు.  విలువైన లోహాలకు డిమాండ్‌‌ పెరుగుతుందని చెప్పారు.