సంక్షేమ పథకాల అమలులో అందరూ సమానమే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సంక్షేమ పథకాల అమలులో అందరూ సమానమే

అర్హులకు అన్యాయం జరిగితే సహించం
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఇప్పుడంతా ఒక్కటే
నవరత్నాలు ప్రతి ఇంటి ముంగిట్లోకి చేరాలి
వలంటీర్ల సమావేశంలో ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి
అనంతపురం సెప్టెంబర్ 5 (way2newstv.com)
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో అందరినీ సమానంగా చూడాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని, తమ ప్రభుత్వంలోఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరిగినా సహించేది లేదన్నారు. గురువారం అనంతపురం శివారులోని శిల్పారామంలో నాలుగు పంచాయతీల వలంటీర్ల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అనంతవెంకట రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారికి దిశానిర్దేశం చేశారు. ముందుగా ఇప్పటికే కుటుంబ వివరాలు సేకరిస్తున్న వారితో ఎమ్మెల్యే మాట్లాడారు. వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను స్వయంగా చూసి తెలుసుకున్నారని, ఇందులోభాగంగానే నవరత్నాలతో పాటు కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారన్నారు. 
సంక్షేమ పథకాల అమలులో అందరూ సమానమే

ఇవి ప్రజల ముంగిటకే నేరుగా చేర్చేందుకు వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు. వలంటీర్లు తమకుకేటాయించిన 50 ఇళ్లకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఈ క్రమంలో ఎవరైనా రాజకీయ ఒత్తిడి తెస్తే పరిగణలోకి తీసుకోరాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులకు అన్యాయం జరగరాదని, అదే సమయంలో అనర్హులై ఉండి పథకాలు పొందుతుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రేషన్, పింఛన్ పంపిణీ, ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డులు, ధ్రువీకరణ పత్రాల జారీ తదితర అవసరాలన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత వలంటీర్లదేనన్నారు. ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదని సంక్షేమ పథకాలు అందించే క్రమంలో తమ పార్టీ వాళ్లు చెప్పినా వినొద్దని అన్నారు. ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరేనని వలంటీర్లతో అన్నారు. అక్టోబర్ నుంచి సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని, వాటి అనుసంధానంగా అందరూ పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇంకాఎవరైనా వివరాలు సేకరించకపోతే 10 రోజులు పూర్తి చేయాలన్నారు. వివరాల సేకరణ సమయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని కొందరు వలంటీర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వలంటీర్లతంతా తమకు ఇచ్చిన ఐడీ కార్డులను తీసుకెళ్లి కేటాయించిన ఇళ్లకు సంబంధించిన కుటుంబ సభ్యులను పరిచయం చేసుకోవాలన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం అందించే పథకాలు లబ్ధిపొందాలంటే వివరాలు అవసరమని తెలియజేసి సేకరించాలని సూచించారు. ప్రజల్లో ఒక నమ్మకం కలిగించేలా పని చేయాలన్నారు. తమ పరిధిలోని కుటుంబాల్లో ఏ కష్టం వచ్చినా ముందుగా వలంటీర్లు గుర్తుకు వచ్చేలా పేరు తెచ్చుకోవాలన్నారు. అందరూ ఓపిక, సహనంతో ఉండి అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాలని అన్నారు. వైసీపీ మేనిఫెస్టోను తాము భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావిస్తామన్నవిషయాన్ని గుర్తు చేశారు. వలంటీర్లంతా తప్పకుండా మేనిఫెస్టోను అందుబాటులో ఉంచుకుని అందులోని పథకాలు అందరికీ అందించేలా పని చేయాలన్నారు. సచివాలయాలు అందుబాటులోకి వచ్చాక 72 గంటల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. తనతో సహా వలంటీర్లంతా ప్రజా సేవకులమేనని, ప్రజల ముంగిటకు సంక్షేమ పథకాలు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. తాను నియోజకవర్గానికి సేవకుడినైతే, వలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్ల పరిధిలో సేవకులన్నారు. ఈ క్రమంలో అవినీతి ఆరోపణలు వచ్చినా, అవినీతి జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. వలంటీర్ల వ్యవస్థ ఓ విప్లవాత్మక మార్పు అని అన్నారు. బాగా పని చేసే వలంటీర్లుకు అవార్డులు కూడా అందిస్తామని స్పష్టం చేశారు.ప్రధానంగా మీ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్రెడ్డి, ఈఓఆర్డీ అలివేలమ్మ, నారాయణపురం పంచాయతీ కార్యదర్శి నరసింహారెడ్డితదితరులు పాల్గొన్నారు.