అక్రమాల ప్లానింగ్ (మెదక్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అక్రమాల ప్లానింగ్ (మెదక్)

మెదక్, సెప్టెంబర్ 10  (way2newstv.com): 
అక్రమాలకు తావులేకుండా చూడాల్సిన అధికారులే అక్రమార్కులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌ రోడ్డులో వెలిసిన కట్టడాలను తొలగించకుండా చోద్యం చూస్తుండడంతో పాటు సదరు యజమానులకు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. లోపాయికారి ఒప్పందాలతో ‘అక్రమార్కుల మాస్టర్‌ప్లాన్‌’కు బల్దియా అధికారులు వత్తాసు పలుకుతుండడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు, సిబ్బంది పొంతనలేని మాటలు చెబుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  మెదక్‌ పట్టణంలోని భవనానానలు పరిశీలిస్తున్న అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాసేలా పలువురు బల్దియా అధికారులు భలే ‘ప్లానింగ్‌’తో ముందుకు సాగుతున్నారు. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మాణాలను చూస్తూనే ఉన్నారు.
అక్రమాల ప్లానింగ్ (మెదక్)

కాని చర్యలు తీసుకోవడం లేదు. వారికి మేమున్నామంటూ అనే భరోసా కల్పిస్తున్నారు. ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి సదరు నిర్మాణదారులకు అవినీతికి అలవాటు పడ్డ పలువురు బల్దియా అధికారులు పూర్తిస్థాయిలో అండదండలు అందజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు భారీగా ముడుపులు ముట్టడమే కారణమని తెలుస్తోంది. మాస్టర్‌ప్లాన్‌ రోడ్డులో అక్రమ కట్టడాలకు సంబంధించి టౌన్‌ప్లానింగ్‌లోని సిబ్బంది నుంచి మొదలు ఆ విభాగంలోని వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతూ సమస్యను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారు. గంగినేని థియేటర్‌ వద్ద నిర్మించిన భవనం కెనాల్‌ బఫర్‌ జోన్‌ పరిధిలో ఉందని.. ఇరిగేషన్‌ శాఖ నుంచి నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) తీసుకొస్తే అనుమతులిచ్చామని ఓ అధికారి చెప్పారు. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో భవనం లేదని ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో లేదని కచ్చితంగా చెప్పగలరా అని ప్రశ్నిస్తే బఫర్‌ జోన్‌ను రోడ్డుగా ఉపయోగించుకోవచ్చు.. ఇది బఫర్‌ జోన్‌ కమ్‌ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు అని సమాధానమిచ్చారు. మాస్టర్‌ ప్లాన్‌ 1992 అమల్లోకి వచ్చిన తర్వాతే బిల్డింగ్‌ నిర్మాణమైందని.. పిల్లర్‌ గుంతలు తీసిన తర్వాత నోటీసులు జారీ చేశామని మరో అధికారి చెప్పడం విశేషం. ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నిస్తే మున్సిపాలిటీయే అనుమతి ఇవ్వడంతో అంటూ సమాధానం దాటవేశారు. గత అధికారుల తప్పిదంతో ఇలాంటివి చోటుచేసుకున్నాయని ఇంకో అధికారి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. అజంపూర్‌కు సంబంధించి మాత్రం చాలా ఏళ్ల క్రితం జరిగింది.. రికార్డులు వెలికి తీసే పనిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.అక్రమ కట్టడాలపై తలోమాట చెబుతున్న అధికారులు కలెక్టర్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వడంతో నోటీసులకు ఉపక్రమించారు. గంగినేని థియేటర్‌ వద్ద కెనాల్‌ను ఆనుకుని మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో నిర్మించిన భవన నిర్మాణదారుడికి నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో లేదని ఒకసారి.. ఉందని ఒకసారి  చెబుతూ వచ్చిన అధికారులు ప్రస్తుతం సెట్‌బ్యాక్‌తో కలిపి ఆరు మీటర్లు రోడ్డు పరిధిలోకి వచ్చిందని.. ఈ మేరకు డీవియేషన్‌ నోటీసులు ఇచ్చామని.. అజంపూర్‌కు సంబంధించి ఒకరికి నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెబుతుండడం గమనార్హం.