ఒంగోలు, సెప్టెంబర్ 10 (way2newstv.com):
కరవు నేలలో సాగు ఆశాజనకంగా ఉంది. ప్రభుత్వమూ ఉద్యానానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రత్యేక రాయితీలను వర్తింపజేస్తోంది. అయితే క్షేత్రంలో సాంకేతిక సలహాలు, రాయితీలను దరి చేర్చడానికి అవసరమైన అధికార యంత్రాంగం కరువైంది. పంటలకు చీడ పీడలు, రోగాలు ఆశించినా నివారణ, జాగ్రత్తలు తెలిపేవారు లేరు. తప్పని పరిస్థితుల్లో మందుల దుకాణాల యజమానులు, ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించాల్సిన దుస్థితి రైతన్నలకు నెలకొంది. దీంతో సంక్షేమ పథకాలు వారికి అందని ద్రాక్షలా మారాయి. గత నాలుగేళ్లుగా జిల్లాలో ఉద్యాన పంటల సాగు క్రమంగా పెరుగుతోంది.
పట్టించుకోరా.. (ప్రకాశం)
దానికితోడు ఇప్పటికే జిల్లాలో లక్ష హెక్టార్లలో ఆ పంటలను వేశారు. ఒక్కో హెచ్‌వోకు 4నుంచి 6 మండలాలు కేటాయించారు. ఇలాంటప్పుడు ఆ హెచ్‌వోలు వారి పరిధిలో పంటలకు చీడ పీడల నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను తెలపాలి. అంతేకాదు రోజు రోజుకు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పద్ధతలపై వారికి అవగాహన కల్పించాలి. అయితే వీరు అరకొరగా ఉండటంతో యాజమాన్య, సాంకేతిక పద్ధతులను వివరించడం కురదడం లేదు. క్షేత్ర స్థాయిలోనూ శాఖాపరమైన పరిపాలన అంశాలను చూసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షేడ్‌నెట్స్ ఏర్పాటు, ప్యాక్ హౌస్‌లు, భారీ ఇంకుడు గుంతల తవ్వకం, యంత్ర సామగ్రి సమకూర్చుకోవడం, వాహనాల కొనుగోలుకు ఉద్యాన శాఖ రాయితీలు అమలు చేస్తోంది. హెచ్‌వోలు రైతులకు తెలిపి క్షేత్ర స్థాయిలో అమలు చేయాలి. అయితే ఏడాదిగా ఉద్యాన అధికారులు కొరతతో పథకాలు రైతులకు అందడం కష్టంగా మారింది. ఏఏ వాటికి రాయితీ సౌలభ్యం ఉందో కూడా తెలియని పరిస్థితిలో కార్యాలయాల వద్ద వెళ్లి విచారిద్దామంటే ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. కొన్ని పంటలకు నిత్యం చీడపీడలు ఆశిస్తుంటాయి. వీటిని చక్కదిద్దడానికి సగానికిపైగా మండలాల్లో అధికారులు లేరు. వెరసి మందుల దుకాణదారులు, ప్రైవేట్ కంపెనీల వారు తమ ప్రచారాల్లో భాగంగా వారి మందుల విక్రయాన్ని పెంచుకోవాలనే ఆలోచనతో ఇచ్చే సూచనల రైతులకు దిక్కుగా మారాయి. వారిచ్చే సూచనలు ఒక్కోసారి రైతులపై తీవ్ర భారాన్ని మోపుతున్న దాఖలాలు ఉన్నాయి. ఇక తప్పని పరిస్థితుల్లో వారు ప్రైవేటు వ్యక్తుల సూచనలు పాటించక తప్పడం లేదు. ఒక్కో మండలానికి ఓ ఉద్యాన ఎంపీఈ ఉన్నా వీరికి పూర్తి స్థాయిలో ఉద్యాన పంటల్లో యాజమాన్య పద్దతులు అందడం లేదు. ఇటీవల క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాల జాడ కరవైంది. ఒకటి రెండుచోట్ల మినహా అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మిరప, నిమ్మ, టమోటా, దొండ పంటలు భారీగా సాగు చేస్తున్నారు. సదరు రైతులకు అవగాహన కల్పిస్తే సస్యరక్షణ సులభతరం కానుంది. మిరపలో పాటించాల్సిన జాగ్రత్తలు తెలియక వారు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.