అన్నీ ఉన్నా.. (విజయనగరం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అన్నీ ఉన్నా.. (విజయనగరం)

విజయనగరం, సెప్టెంబర్ 10  (way2newstv.com): 
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత అచ్చం ఏజెన్సీలో భద్రగిరి ఆసుపత్రికి వర్తిస్తుంది.. గిరిసీమకు కేంద్ర బిందువుగా ఉన్న ప్రజలకు వైద్యసేవలదించాల్సిన దవాఖానా పడకేసింది.. ఏమైనా ఘటనలు జరిగినప్పుడు అధికారులు, పాలకులు హడావుడి చేస్తున్నారే తప్ప.. సేవలు మెరుగుపర్చడంపై ఎవరు దృష్టిసారించడం లేదు... వైద్యులు, సిబ్బంది సరిపడా లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు... సేవలు అందిస్తున్నామని, వ్యాధులు తగ్గుముఖం పడుతున్నాయని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు. భద్రగిరి ఆసుపత్రి స్థాయి పెంచి 30 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చేశారు. అయితే ఇందుకు తగ్గట్టుగా సేవలు మాత్రం మెరుగుపర్చలేదు. 
అన్నీ ఉన్నా.. (విజయనగరం)

కనీసం ఐదుగురు వైద్యులు ఉండాల్సిన ఆసుపత్రిలో ఒక్కరు మాత్రమే ఇప్పటి వరకు సేవలందిస్తున్నారు. మరొకరు డిప్యూటేషన్‌పై వస్తున్నారు. ఇక్కడ వైద్యసేవలు సక్రమంగా అందడం లేదని ఆరోపిస్తూ ఇటీవల రోగులు ఆందోళన చేపట్టిన ఘటనలున్నాయి. వైద్య నిపుణులు ఉండాల్సిన ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో నియమించకపోవడం విచారకరం. దీంతో ఏజెన్సీ ప్రజలకు వైద్యసేవలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. సిబ్బంది కొరత సైతం వెంటాడుతున్నా పట్టించుకునేవారు కరవవుతున్నారు. చేసేది లేక ఉన్నవారే సేవలందిస్తున్నారు. గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి అధునాతన పరికరాలను ఆసుపత్రిలో సమకూర్చారు. అయినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకపోతుంది. శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ వైద్య నిపుణులు లేని కారణంగా పరికరాలు మూలకు చేరాయి. దీంతో అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యసేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయానికే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇందుకు నిదర్శనమే ఇటీవల గుమ్మలక్ష్మీపురంలో చోటుచేసుకున్న గర్భిణి మృతి ఘటన. శస్త్రచికిత్స నిపుణులు అందుబాటులో ఉంటే గర్భిణి బతికుండేదని, పరికరాలు ఉన్నప్పటికీ నిపుణులు లేకపోవడంతో పరిస్థితి విషమించే సమయంలో మెరుగైన వైద్యసేవలకు పార్వతీపురం తరలించే క్రమంలో మాతృమూర్తి మృత్యుఒడికి చేరింది. ఇలా ప్రాణాలు పోయిన ఘటనలు జరుగుతున్నా వైద్య నిపుణులను నియమించకపోవడం దురదృష్టకరమని గిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఉండటంతో ఏజెన్సీలో వైద్యసేవలు మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తే గిరిజన ప్రజల ఆరోగ్యానికి భరోసా కలుగుతుందని పలువురు భావిస్తున్నారు. ప్రధానంగా భద్రగిరి ఆసుపత్రిలో వైద్య నిపుణుల నియామకానికి చర్యలు చేపట్టి, శస్త్రచికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే ఏజెన్సీ ప్రజలకు ఉపయోగపడుతుందని అంటున్నారు.